ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ ప్రతిపాదన లేదు 

Pratima Bhowmik answer to Vijayasai Reddy question At Rajya Sabha - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్‌ సమాధానం  

సాక్షి, న్యూఢిల్లీ: విద్య, ఉపాధి రంగాల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని సామాజిక కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి ప్రతిమా భౌమిక్‌ చెప్పారు. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు తెలి­పారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో కలిపి మొత్తం 50 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నట్లు చెప్పారు. జనాభా ప్రాతిపదికపై ఓబీసీలకు రిజర్వేషన్‌ కల్పించాలంటూ దేశవ్యాప్తంగా వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి ప్రభుత్వానికి వినతులు అందుతున్నట్లు తెలిపారు. 

ఏపీలో మూడు రూర్బన్‌ మిషన్‌ క్లస్టర్ల అభివృద్ధి 
ఆంధ్రప్రదేశ్‌లోని అరకులోయ, ఏలూరు, రంపచోడవరం క్లస్టర్లను శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ మిషన్‌ కింద ఎంపిక చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఈ మిషన్‌ కింద 21 విభాగాల్లో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల గురించి వివరించారు.

గ్రామాల్లో రహదారులు, డ్రెయిన్ల నిర్మాణం, అగ్రి సర్వీసెస్‌ ప్రాసెసింగ్, విద్య, స్వయం సహాయక బృందాల ఏర్పాటుతో ఉపాధి కల్పన, ఆరోగ్య, వివిధ గ్రామాలను రోడ్లతో అనుసంధానం చేయడం, గ్రామాలకు పైపులతో తాగునీటి వసతి కల్పించడం, గ్రామీణ గృహనిర్మాణం, ప్రజారవాణా సౌకర్యాల కల్పన, సామాజిక మౌలిక వసతుల కల్పన, పర్యాటక ప్రోత్సాహం, గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించి, వీధిదీపాల ఏర్పాటు వంటి ప్రాజెక్టులను ఈ క్లస్టర్లలో చేపట్టినట్లు వివరించారు.

ఆర్బిట్రేషన్‌ వ్యవస్థ స్వయంప్రతిపత్తితో పనిచేయాలి
ఆర్బిట్రేషన్‌ (మధ్యవర్తిత్వం ద్వారా వివా­దాలు పరిష్కరించుకోవడం) ప్రక్రియలో న్యాయవ్యవస్థ జోక్యం తగ్గించి ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ వీలైనంత స్వయంప్రతిపత్తి కలిగి ఉండేలా చట్టాన్ని రూపొందించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభలో ‘ద న్యూఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌’ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సవరణ బిల్లు ద్వారా న్యూఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను ఇండియా ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌గా మార్చే ప్రతిపాదనను స్వాగతించారు.

ఇప్పటివరకు నగరాలకు మాత్రమే పరిమితమైన ఆర్బిట్రేషన్‌ను దేశవ్యాప్తం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని అభినందించారు. సవరణ బిల్లులో పొందుపరచాలంటూ ప్రభుత్వానికి నాలుగు ముఖ్యమైన సూచనలు చేశారు. ఆర్బిట్రేటర్‌ నియామకంలో కోర్టు జాప్యం కారణంగా కక్షిదారులకు ఖర్చులు అధికం అవుతున్నాయని, దీనివల్ల తాత్కాలిక ఆర్బిట్రేషన్లలో ఆర్బిట్రేటర్లను నియమించే అధికారం సంపూర్ణంగా ఇండియా ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ కలిగి ఉండేలా చూడాలని సూచించారు. దీనివల్ల ఆర్బిట్రేషన్‌ ప్రక్రియలో న్యాయవ్యవస్థ జోక్యం తగ్గి ఆర్బిట్రేషన్‌ వ్యవస్థ స్వయంప్రతిపత్తి పెరుగుతుందని చెప్పారు.

ఆర్బిట్రేషన్‌ కేసుల్లో అధికశాతం రిటైర్డ్‌ జడ్జీలను ఆర్బిట్రేటర్లుగా నియమించడం ఆందోళనకరమైన విషయమన్నారు. న్యాయవ్యవస్థలో ఉండే దీర్ఘకాల వాయిదాల పర్వం ఈ ప్రక్రియలోను మొదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘నేటి చీఫ్‌ జస్టిస్‌ రేపటి ఆర్బిట్రేటర్‌’ అనే నానుడి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. న్యాయవృత్తిలో నైపుణ్యం ఉన్నవారితో ఆర్బిట్రేటర్‌ సమాజం బలపడేలా చూడాలని కోరారు.

అర్హులైన నిపుణులు మాత్రమే ఆర్బిట్రేషన్‌ సెంటర్‌లో పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్బిట్రేషన్‌ సెంటర్లకు సింగపూర్, హాంగ్‌కాంగ్‌ల మాదిరి అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా నిధులు ఖర్చుచేయాలని సూచించారు. ఈ బిల్లు ద్వారా దేశంలో స్నేహపూరితమైన ఆర్బిట్రేషన్‌   వాతావరణం నెలకొల్పుతున్నట్లు అంతర్జాతీయ సమాజానికి స్పష్టమైన సందేశం పంపించినట్లు అవుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ ఈ బిల్లును స్వాగతిస్తూ మద్దతు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. 

ఏపీ కొత్త జిల్లాల్లో ఓఎస్‌సీల ప్రతిపాదన వచ్చింది 
ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో వన్‌ స్టాప్‌ సెంటర్లు (ఓఎస్‌పీలు) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిందని కేంద్ర మహిళ, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. పాత 13 జిల్లాల్లో 14 ఓఎస్‌పీ కేంద్రాలను అనుమతించామని వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

3,753 పోస్టులు ఖాళీ 
కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో 3,753 బ్యాక్‌లాగ్‌ ఫ్యాకల్టీ పోస్టులు భర్తీచేయాల్సి ఉందని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్‌ సర్కార్‌.. వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ప్రశ్నకు జవాబిచ్చారు. 

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం నిబంధనల అమలు వివిధ దశల్లో.. 
ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లోని అనేక నిబంధనలు అమలు చేశామని, మిగిలిన నిబంధనల అమలు వివిధ దశల్లో ఉన్నట్లు  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ తెలిపారు. నిబంధనల అమలు పురోగతిని సమీక్షిస్తున్నామని, ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో 29 సమీక్ష సమావేశాలు జరిగాయని బీజేపీ ఎంపీ జి.వి.ఎల్‌.నరసింహారావు ప్రశ్నకు బదులిచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top