‘ప్రాన్‌’ సంకటం ఆక్వా ఆక్రందన | Power Cuts Hit Aqua Farmers Badly: Andhra pradesh | Sakshi
Sakshi News home page

‘ప్రాన్‌’ సంకటం ఆక్వా ఆక్రందన

May 24 2026 2:31 AM | Updated on May 24 2026 2:31 AM

Power Cuts Hit Aqua Farmers Badly: Andhra pradesh

విద్యుత్‌ కోతలతో కృష్ణా జిల్లా చావలిపాడులో రొయ్యల చెరువు వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న జనరేటర్‌

తీవ్రంగా వేధిస్తున్న విద్యుత్‌ కోతలు  

రాత్రి వేళ ఆక్సిజన్‌ అందక రొయ్యలు మృత్యువాత   

అవస్థలు పడుతున్న రైతులు

చెరువుల్లో రొయ్యల కోసం జనరేటర్లు

ఎకరాకు నెలకు రూ.15 వేల వరకూ అద్దె 

తడిసిమోపెడవుతున్న డీజిల్‌ ఖర్చులు  

పడిపోయిన ధరలు..పెరిగిన పెట్టుబడులు 

ప్రభుత్వం నుంచి అందని విద్యుత్‌ సబ్సిడీ 

గతంతో పోలిస్తే విద్యుత్‌ బిల్లుల రెట్టింపు  

కొల్లేరు పరీవాహక ప్రాంత ఆక్వా రైతుల ఆవేదన 

క్షేత్ర స్థాయి పర్యటనలో ‘సాక్షి’ కంటపడ్డ కష్టాలు  

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆక్వా రైతు పేరు సహదేవరాజు. బీఎస్సీ చదువుకున్నప్పటికీ తండ్రి బాటలోనే ఆక్వాసాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. విద్యావంతురాలైన అతని భార్య అండగా నిలవడంతో ఎకరం చెరువులో రొయ్యలను పెంచు­తున్నాడు. కానీ లాభాలు మాత్రం చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘ఆక్వా సాగుకు విద్యుత్‌ అనేది చాలా ముఖ్యం. కానీ రాత్రి వేళ కరెంటు తీసేస్తున్నారు. వర్షం వచ్చినా, గాలి వీచినా గంటల తరబడి పోతుంది. 

3 రోజులుగా కొట్టిన చెట్లనే మళ్లీ కొడుతున్నామంటూ విద్యుత్‌ సరఫరా ఆపేస్తున్నారు. కాసేపు కరెంటు ఆగితే ఆక్సిజన్‌ అందక రొయ్య చనిపోతుంది. అందుకే ఖర్చయినా తప్పదనుకుని నెలకు రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకూ అద్దె చెల్లించి జనరేటర్లు ఏర్పాటు చేసుకుంటున్నాం. విద్యుత్‌ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. జగన్ హయాంలో యూనిట్‌ రూ.1.50కే ఇచ్చేవారు. ఇప్పుడు యూనిట్‌కు రూ.3 చొప్పున భారం పడుతోంది.’ అంటూ తన కష్టా­లను ‘సాక్షి’తో చెప్పుకున్నాడు. ఇది రైతు సహదేవరాజు ఒక్కరి దుస్థితి మాత్రమే కాదు.. ఆక్వా రైతులందరి ఆవేదన.. ఆక్రందన..

బోణం గణష్, కొల్లేరు నుంచి సాక్షి ప్రతినిధి
ఎంతో కష్టపడితేగానీ ఆక్వా సాగులో లాభాలు చూడలేం..ఏళ్ల తరబడి సాగు చేస్తుంటే ఒకటో, రెండో పంటలే కాస్త ఆదుకుంటాయి..అలాంటి మమ్మల్ని విద్యుత్‌ కోతలు, అత్యధిక బిల్లులు ఆర్ధికంగా దెబ్బకొడుతున్నాయి. గత ప్రభుత్వంలో రాయితీపై విద్యుత్‌ అందించేవారు. కానీ ఇప్పుడు రాయితీ లేదు. ఎవరికైనా ఇస్తున్నా అంతకు మించి బిల్లులు బాదేస్తున్నారు. ఇక విద్యుత్‌ కోతలైతే దారుణంగా ఉన్నాయి. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియక జనరేటర్లు అద్దెకు తీసుకుని వచ్చి పెట్టుకుంటున్నామంటూ కొల్లేరు పరీ­వాహక ఆక్వా రైతులు ఆవేదనతో చెబుతున్నారు.

కొల్లేరు పరిధిలో 2.90 వేల ఎకరాల్లో రొయ్యలు, చేపల సాగు జరుగుతోంది. కాగా రాష్ట్రంలో ఈ వర్గం ఆ వర్గం అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను విద్యుత్‌ కోతలు వేధిస్తున్నాయి. అయితే ఆక్వా సాగులో కరెంటు కోతలు చేపలు, రొయ్యల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా, ఏలూరు, పశి్చమ గోదావరి జిల్లాల పరిధిలో ఆక్వా రైతుల సమస్యలను తెలుసుకోవడానికి ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పర్యటించింది. వారి కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆక్వా రైతుల ఆవేదన వారి మాటల్లోనే...

వైఎస్‌ జగన్‌ పాలనలో విద్యుత్‌ సబ్సిడీ
దేశంలో జరుగుతున్న మొత్తం ఆక్వా సాగులో 70 శాతం మన రాష్ట్రంలోనే జరుగుతోంది. దాదాపు 4.66 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా వీటికి మొత్తం 63,754 విద్యుత్‌ సర్వీసులు ఉన్నాయి. అయితే రొయ్యల సాగులో పెట్టుబడులు తిరిగిరాక,  విద్యుత్‌ బిల్లులు చెల్లించడానికి వచ్చిన ఆదాయం సరిపోక అప్పులపాలైన రైతులంతా ఆక్వాను వదిలేయాలనుకున్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఇక ఆత్మహత్యలే శరణ్యమనుకున్నప్పుడు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఆక్వా విద్యుత్‌ సర్వీసులకు యూనిట్‌ రూ.1.50 పైసలకే విద్యుత్‌ సరఫరా చేశారు.

ప్రతి యూనిట్‌పై రూ.2.36 చొప్పున విద్యుత్‌  సబ్సిడీ భారం మోస్తూ ఆక్వా రైతులను అదు­కున్నారు. అంతేకాకుండా ఆక్వా రైతులు తమ రొయ్య ఉత్పత్తులను అంతర్జాతీయ విపణిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వచ్చేది. కానీ ఆ అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సాధికార కమిటీ ద్వారా వివిధ కౌంట్‌ల రొయ్యలకు కనీస కొనుగోలు ధరలను నిర్ణయించింది. రైతు భరోసా (ఆర్‌బీకే) కేంద్రాల్లో కొనుగోలు ధరల పట్టిక, కాల్‌ సెంటర్‌ నంబర్‌ను అందుబాటులో ఉంచింది.

రొయ్య మేత ధరలను కూడా మేత ఉత్పత్తిదారులు ఇష్టానుసారం పెంచకుండా, సంప్రదింపుల ద్వారా మాత్రమే పెంచడానికి అనుమతి తీసుకునేలా కట్టుబాటు విధించింది. విద్యుత్‌ సబ్సిడీ ఇవ్వడంతోపాటు ఆక్వా జోన్‌ పరిధిలోకి తీసుకువచ్చి, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడంతో ఆక్వా రైతులు దేశ, విదేశాలకు మన రాష్ట్రం నుంచే రొయ్యలను ఎగుమతి చేస్తూ, వందలాది మందికి ఉపాధి కల్పించేవారు. కానీ ఇప్పుడు మళ్లీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యుత్‌ కోతలు, అత్యధిక బిల్లులతో ఆక్వా రైతుల జీవితాలను మళ్లీ చీకటిలోకి నెట్టేస్తోంది.

విద్యుత్‌ బిల్లు రెట్టింపు 
పదిహేనేళ్లుగా ఆక్వా సాగు చేస్తున్నాం. కానీ ఇప్పుడు అస్సలు బాగోలేదు. సీడ్‌(రొయ్యపిల్ల)లో నాణ్యత లేదు. ఫీడ్‌ (రొయ్యలకు ఇచ్చే ఆహారం)లో నాణ్యత లేదు. ధరలూ ఇటీవల చాలా దారుణంగా పెంచేస్తున్నారు. విద్యుత్‌కు రాయితీ ఇవ్వడం లేదు. గతంలో నాలుగెకరాలు సాగు చేస్తే రూ.10 వేలు బిల్లు వచ్చేది. ఇప్పుడు రూ.18 వేల వరకూ వస్తోంది. విద్యుత్‌ను రాత్రి వేళ ఆపేస్తున్నారు. రూ.15 వేల అద్దె కడుతూ జనరేటర్‌ వాడుతున్నాం. గంటకు ఆరు లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నాం. ఈ లెక్కన విద్యుత్‌ కోతల వల్ల నెలకు 200 లీటర్ల వరకూ ఖర్చవుతోంది. ఇకముందు ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. కరెంటు సక్రమంగా ఇస్తే మాకు ఈ బాధ ఉండదు. – సమయం రామాంజనేయులు, ఆక్వా రైతు, కైకలూరు

మా బతుకులు దుర్భరం
కొల్లేరు ప్రాంతంలో ఆక్వా సాగుపైనే మా జీవనం ఆ­ధా­రపడి ఉంటుంది. ప్రభు­త్వం ధ్రువీకరించిన (ఎంపెడా) హ్యాచరీస్‌(రొయ్య పి­ల్లల పెంపకం కేంద్రం) లేక నాణ్యమైన సీడ్‌ దొ­రకడం లేదు. దీని వల్ల దిగుబడి పడిపోతోంది. దీంతో మా బతుకులు దుర్భరంగా మారా­యి. ఫీడ్‌ బస్తాకు రూ.200 వరకూ పెరిగింది. ఫీడ్‌ మీద ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి. రొయ్య పిల్లలు ఇచ్చేది, వాటికి ఆహారం అమ్మేది, వాటిని కొనేది మొత్తం ఒక్కరే కావడంతో ధరలు వాళ్లిష్టమొచ్చి­నట్లు పెడుతున్నారు. 

గత ప్రభుత్వంలో యూ­నిట్‌ విద్యుత్‌కు రూ.1.50కి రాయితీ ఇచ్చేవారు. ఇప్పుడు అది రావడం లేదు. నేను మూడెకరాల చిన్న రైతుని నెలకు రూ.30 వేల విద్యుత్‌ బిల్లు వస్తోంది. అంటే యూనిట్‌కు రూ.3 నుంచి రూ.4.50 వరకూ బిల్లు పడుతోంది. ఏవేవో చార్జీలు వేస్తున్నారు. మరోవైపు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. దానివల్ల జనరేటర్లు, డీజిల్‌కి ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోంది. – రఫి, ఆక్వా రైతు, చావలిపాడు

అల్లాడిపోతున్నాం 
విద్యుత్‌ కోతలు ఆక్వా రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఈ మధ్య ఎక్కవగా సరఫరా ఆపేస్తున్నారు. కరెంటు లేకపోవడం వల్ల జనరేటర్లు వాడాల్సి వస్తోంది. ఒక రైతుకు ఎకరాకు రూ.25 వేల వరకూ అదనంగా ఖర్చవుతోంది. డీజిల్, పెట్రోల్‌ ధరలు పెరిగాయి. విద్యుత్‌ సబ్సిడీ కూడా అందరికీ రావడం లేదు. కొందరికి ఇచ్చినా కూడా మరో విధంగా లాగేస్తున్నారు. గతంతో రూ.2 వేలు వచ్చే బిల్లు ఇప్పుడు రెట్టింపు అయ్యింది. ఫీడ్, సీడ్‌ ధరలు పెంచేశారు. గత రెండు నెలలుగా ఈ పెంపు చాలా ఎక్కువగా ఉంది. రొయ్య, చేపల రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. సిండికేట్‌గా ఏర్పడి రైతులను దోచు­కు­ంటున్నారు. రొయ్యలు, చేపలను కొనేటప్పుడు ధరలు తగ్గించేస్తున్నారు. మేత రేటు పచ్చితవుడు దొరకడం లేదంటూ పెంచేస్తున్నారు. ఇవేవీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – జయమంగళ కాసులు, ఆక్వా రైతు, పెంచికలమర్రు

Advertisement
 
Advertisement
Advertisement