సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో అనకాపల్లి, అల్లూరి, పోలవరం, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ రోజు, రేపు(శుక్ర,శని) వానలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరో వైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండగా... ఇటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అధిక వేడి, ఉక్కపోతకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు కొబ్బరినీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు డీ హైడ్రేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుందన్నారు. వీటితో పాటు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం. బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీతో పాటు కళ్లజోడు తప్పనిసరిగా పెట్టుకోవాలి. మహిళలు గొడుగులు తప్పనిసరిగా ఉపయోగించాలి. కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరమని వైద్యులు తెలిపారు.


