వెలుగోడు ముట్టడిని అడ్డుకున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్సార్‌బీసీ తదితర ప్రాజెక్టులకు సాగునీరు విడుదల చేసి కరువు ప్రాంతాల రైతులను ఆదుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి వెలుగోడుకు బయలుదేరిన నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు.
మంగళవారం వేకువజామునుంచే వెలుగోడు రిజర్వాయర్‌కు వెళ్లే దారిలో ఆత్మకూరు, కరివేన, వైఎస్సార్ స్మృతివనం, మోత్కూరు, బండి ఆత్మకూరు ప్రధాన రహదారితోపాటు గ్రామాల నుంచి వెలుగోడు వెళ్లే దారుల్లోనూ బారికేడ్లు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అడుగడుగునా పోలీసులను మోహరించారు. వెలుగోడుకు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై వస్తారని తెలుసుకున్న పోలీసులు సోమవారం రాత్రి గ్రామాలకు వెళ్లి ధర్నాకు వచ్చే వారందరిపైనా కేసులు పెడతామని, ప్రతి ఎడ్లబండికి రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని బెదిరించారు. అయినా ఖాతరు చేయని వైఎస్సార్‌సీపీ శ్రేణులు వెలుగోడు ముట్టడి కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చారు.
వేల్పనూరు వద్ద కాటసాని అడ్డగింపు
మాజీ ఎమ్మెల్యే నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బనగానపల్లి సమన్వయకర్త కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు సమన్వయకర్త ధారా సు«దీర్, వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కర్నూలు మాజీ మేయర్ బీవై రామయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి తదితర నేతలను వెలుగోడు సమీపంలోని వేల్పూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిసి పాదయాత్రగా బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
అనంతరం నేతలంతా పాదయాత్రగా వెలుగోడుకు చేరుకున్నారు. దారి పొడవునా పలుమార్లు పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న ప్రతిసారి వైఎస్సార్‌సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల ఆంక్షల నడుమ వెలుగోడు గ్రామానికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. చంద్రబాబు డౌన్ డౌన్, శ్రీశైలం నుంచి తక్షణం సాగునీరు విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. నీళ్లివ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ నీటి చౌర్యాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
బండి ఆత్మకూరులో శిల్పా నిర్బంధం
మరోవైపు పార్టీ శ్రేణులతో కలిసి వెలుగోడుకు వస్తున్న శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల సమన్వయకర్త శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డిని పోలీసులు బండి ఆత్మకూరులో అడ్డుకున్నారు. దీంతో వారు పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి అక్కడే బైఠాయించి రెండు గంటలపాటు నిరసనకు దిగారు. వెలుగోడు దిగువన అన్ని సాగునీటి వనరులకు నీళ్లిచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆర్డీవో వెంకటశివ బండి ఆత్మకూరులో శిల్పా చక్రపాణిరెడ్డిని కలిసి మాట్లాడారు.

నాలుగు రోజుల్లో నీటి విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శిల్పా చక్రపాణిరెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన విరమించారు. మరోవైపు మోటార్ బైక్‌లపై కార్యకర్తలతో కలిసి వెలుగోడు బయలుదేరిన శిల్పా రవిని మోతుకూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శిల్పా రవి, శిల్పా కిషోర్ అక్కడే ధర్నాకు దిగారు. గంటపాటు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం నియోజకవర్గంతోపాటు నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు.


