రామచంద్రపురం నియోజకవర్గంలో పోలీసులు, అధికారుల నిర్వాకం
మంత్రి తండ్రి పుట్టినరోజు వేడుకలకు యూనిఫాంతో హాజరైన పోలీసులు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని అధికారులు మంత్రిగారి ‘డాడీ’ సేవలో తరిస్తున్నారు. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం నియోజకవర్గంలో అనధికారిక ఎమ్మెల్యేగా చలామణీ అవుతున్నారు. అధికారులతో సమీక్షలు మొదలు అభివృద్ధి కార్యక్రమాల వరకూ చాలావరకూ ఆయన చేతుల మీదుగానే నడుస్తున్నాయి. దీనికి పరాకాష్టగా బుధవారం జరిగిన ఆయన జన్మదిన వేడుకలు నిలుస్తున్నాయని నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు.
యూనిఫాంతో పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు..
సరిగ్గా ఏడాది క్రితం ఇదే కార్తీక మాసంలో మంత్రి తండ్రి సత్యం ఆధ్వర్యాన జరిగిన వనభోజనాల్లో అప్పటి రామచంద్రపురం సీఐ యూనిఫాంతో పాల్గొని కులం గురించి స్పీచ్ ఇవ్వడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. మళ్లీ ఇప్పుడు కార్తీక మాసం ప్రారంభమవుతోందనగా జరిగిన సత్యం పుట్టిన రోజు వేడుకల్లో పోలీసు అధికారులందరూ యూనిఫాంలో పాల్గొని ప్రభుభక్తి చాటుకోవడం చర్చనీయాంశమైంది. పోలీసు శాఖతో పాటు పలు శాఖల అధికారులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనడాన్ని చూసి అందరూ విస్మయం వ్యక్తంచేస్తున్నారు.


