నేరం ఒప్పుకోవాలంటూ వేధిస్తున్నారని
సెల్ఫీ వీడియోలో భార్య ఆవేదన
మనస్తాపంతో గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి
తెనాలి రూరల్: బంగారు ఆభరణాల రికవరీకి తనను, తన భర్తను పోలీసులు నేరం ఒప్పుకోవాలంటూ కొట్టి వేధించారని ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. బాపట్ల జిల్లా కూచిపూడికి చెందిన కటారి తిరుపతమ్మ, సాయిబాబు దంపతులు తెనాలిలో ఉంటున్నారు. కొత్తపేటలోని సువర్ణ అపార్ట్‌మెంట్‌లో సాయిబాబు వాచ్‌మన్. తిరుపతమ్మ అదే అపార్ట్‌మెంటులోని ఇళ్లలో పనులు చేసుకుంటోంది. అపార్ట్‌మెంట్‌లో ఉండే స్వర్ణలత అప్పుడప్పుడూ తిరుపతమ్మ దంపతులకు బంగారు వస్తువులను ఇచ్చి తాకట్టు పెట్టి డబ్బులు తెప్పించుకుంటూ ఉండేది.
ఈ క్రమంలో తిరుపతమ్మ దంపతులు బంగారాన్ని విడిపించి ఇవ్వకుండా తనను మోసం చేశారని స్వర్ణలత వారం క్రితం పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేసింది. దీనిపై తిరుపతమ్మ దంపతులను స్టేషన్‌కు పిలిపించి పోలీసులు ఇటీవల విచారించారు. మళ్లీ పిలిచినప్పుడు రావాలని పంపేశారు. ఆ తర్వాత తిరుపతమ్మ మారీసుపేటలో తన అత్తయ్య వాచ్‌మన్‌గా ఉంటున్న ఓ అపార్ట్‌మెంటుకు శనివారం వెళ్లింది. నేరం ఒప్పుకోవాలంటూ పోలీసులు తనను కొట్టి వేధించారని సెల్ఫీ వీడియో తీసుకుని గడ్డిమందు తాగింది. ఈ విషయం తెలిసిన సాయిబాబు ఆమెను తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాడు.
మెరుగైన చికిత్స కోసం ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. కాగా, పోలీసులు శనివారం రాత్రి పొద్దుపోయాక సాయిబాబు నుంచి తీసుకున్న స్టేట్‌మెంట్‌లో..స్వర్ణలతకు బంగారం ఇవ్వాల్సింది నిజమేనని అంగీకరించారు. తమను అరెస్టు చేస్తారేమోనన్న భయంతోనే తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని సాయిబాబు చెప్పారు. కాగా, తిరుపతమ్మ దంపతులను పిలిపించి మాట్లాడామని వారిని వేధించడం, కొట్టడం చేయలేదని వన్ టౌన్ సీఐ సీహెచ్.రాంబాబు ’సాక్షి’కి తెలిపారు.


