పది రోజుల్లో నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపు
రాష్ట్రంలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ రూ.118.39, డీజిల్ రూ.106.11
తాజాగా లీటరు పెట్రోల్‌పై రూ.2.86, డీజిల్‌పై రూ.2.83 వడ్డన
ఫలితంగా వినియోగదారులపై ఏడాదికి రూ.8 వేల కోట్లు భారం.. సగటు సామాన్యుల జీవనంపై తీవ్ర ప్రభావం
సామాన్యుడి నడ్డి విరుస్తూ చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వినియోగదారులపై మరోసారి ఇంధన పిడుగు పడింది. గడిచిన పది రోజుల్లో నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపుతో సామాన్య, రవాణా రంగం కుదేలవుతోంది. దాదాపు పెట్రోల్‌పై రూ.7.98, డీజిల్‌పై రూ.7.75 పెరగడంతో తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంధన రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. రోజులు వ్యవధిలోనే నిత్యం పెరుగుతూ బడుగు జీవుల జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. రాష్ట్రంలో రోజుకు 9 వేల కిలో లీటర్ల పెట్రోల్, 20 వేల కిలోలీటర్ల డీజిల్ వినియోగం కనిపిస్తోంది. ప్రస్తుతం పెరిగిన ఇంధన రేట్లతో సామాన్యులపై ఏడాదికి పెట్రోల్‌పై రూ.2,600 కోట్లు, డీజిల్‌పై రూ.5,400 కోట్లు వెరసి మొత్తం రూ.8వేల కోట్లు భారం మోపుతోంది.
పది రోజుల్లో నాలుగు సార్లు పెంపు..
రాష్ట్రవ్యాప్తంగా ఇంధన రేట్లు భారీగా పెరగ్గా.. అత్యధికంగా శ్రీసత్యసాయి జిల్లాలో లీటరు పెట్రోల్ రూ.118.39, డీజిల్ రూ.106.11 వరకు ఎగబాకింది. పదిరోజుల కిందట లీటరు పెట్రోల్ రూ.109.74, డీజిల్ రూ.97.47గా ఉంది. ఈ నెలలోనే వరుసగా 15, 19, 24, 25 తేదీల్లో రేట్లు పెంచడంతో దాదాపు డీజిల్, పెట్రోల్‌పై సగటున రూ.8(జిల్లాలను బట్టి రేట్లు మారతాయి) వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది.
ఫుల్ ట్యాంక్ నిల్..
ప్రస్తుతం రాష్ట్రంలో ఇంధన రేట్లు పైపైకి ఎగబాకుతుంటే మరోవైపు వాహనాలకు ఫుల్ ట్యాంక్‌పై పరిమితులు విధిస్తుండడం కొసమెరుపు. రేట్లు పెంచినప్పుడు దానికి తగ్గట్టుగా ఇంధనం సరఫరా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైనట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఒక లావాదేవీకి కేవలం 200 లీటర్లకు మాత్రమే పరిమితి కొనసాగుతోంది. ఇక్కడ వాణిజ్య వాహనాలు, సరుకు, ప్రజా రవాణా వాహనాలు సగటున 350–400 లీటర్ల కంటే ఎక్కువ ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో నడుస్తాయి. కానీ, ప్రభుత్వం 200 లీటర్ల లోపే కట్టడి చేస్తుండడంతో పదేపదే పెట్రోల్ బంకుల వద్ద సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీలర్లు నోటీసులా?
200 లీటర్లకు మించి ఇంధనాన్ని ఒకే లావాదేవీలో నింపితే డీలర్లకు ఆయిల్ కంపెనీలు ఆటోమేషన్ సిస్టమ్ ద్వారా నోటీసులు జారీ చేసి, విక్రయాలను నిలిపివేస్తుంటే ప్రభుత్వం వేడుక చూస్తోంది. ఫలితంగా డీలర్లతో పాటు పెట్రోల్ బంకుల్లో పని చేసే సిబ్బంది జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోంది. పైగా ఆస్పత్రులు, ఆక్వా, వ్యవసాయం, బోరువెల్స్ నిర్వహణలో జనరేటర్లు వినియోగించే వారికి అరకొర ఇంధనం అందిస్తే తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇంధన రంగంలో ఇన్ని సమస్యలు ఉన్నా.. చంద్రబాబు ప్రభుత్వం పరిష్కార మార్గాలు చూపకుండా.. ఇష్టారీతిన ఇంధన ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోంది.


