సీతమ్మా.. దయ ఏదమ్మా!

Partial Allocations In Union Budget 2023 To Railways Of Joint East Godavri - Sakshi

రైల్వేకు అరకొర కేటాయింపులు

కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైనుకు రూ.100 కోట్లు

కొవ్వూరు – భద్రాచలం లైనుకు రూ.20 కోట్లు

కాకినాడ మెయిన్‌ లైన్‌ ఊసే లేదు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు అరకొర కేటాయింపులతో కేంద్ర బడ్జెట్‌ ఉసూరుమనిపించింది. ప్రధానంగా పలు పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులకు దండిగా నిధులు వస్తాయనే ఆశలపై నీళ్లు చల్లింది. కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారమే పార్లమెంటులో ప్రవేశపెట్టినా.. రైల్వే కేటాయింపులపై శుక్రవారం రాత్రికి కానీ స్పష్టత రాలేదు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలు కీలక డిమాండ్లకు ఈ బడ్జెట్‌లో మోక్షం లభించలేదు. కొన్నింటిని అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. 

కీలకమైన కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైను నిర్మాణానికి ఈ బడ్జెట్‌లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో కనీసం నాలుగైదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తారని ఆశ పడ్డారు. 22 ఏళ్ల క్రితం రూ.645 కోట్లతో మొదలైన ఈ రైల్వే లైన్‌ అంచనా వ్యయం ప్రస్తుతం రూ.2,892 కోట్లకు పెరిగింది. దీనికి తగినట్టుగా కేటాయింపులు లేవని కోనసీమ వాసులు పెదవి విరుస్తున్నారు.

కేటాయింపులు ఎక్కువగా ఉంటాయని, 57 కిలోమీటర్ల రైల్వే లైను కోసం గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి పాయలపై నిర్మాణంలో ఉన్న మూడు వంతెనల పనులు వేగం అందుకుంటాయని అందరూ ఆశించారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కేటాయించిన రూ.100 కోట్లు ఏ మూలకు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఆశించిన స్థాయిలో కేటాయింపులు చేస్తే వైనతేయపై బోడసకుర్రు – పాశర్లపూడి మధ్య మందకొడిగా జరుగుతున్న తొమ్మిది పిల్లర్ల పనులు ఊపందుకునేవని అంటున్నారు. పెండింగ్‌లో ఉన్న 528 ఎకరాల భూసేకరణకు కూడా ఈ కేటాయింపులు సరిపోవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 

 ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాసులను దశాబ్దాలుగా ఊరిస్తున్న కాకినాడ – పిఠాపురం మెయిన్‌ లైన్‌ ఊసే బడ్జెట్‌లో లేకుండా పోయింది. ఈ రైల్వే లైను కోసం నాలుగు దశాబ్దాలుగా అలుపెరగని ప్రయత్నం చేస్తున్నా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కనికరించ లేదు. కాకినాడ మెయిన్‌ లైన్‌ నిర్మాణానికి రూ.40 కోట్లతో 22 ఏళ్ల క్రితమే గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. కాకినాడ పోర్టు ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు భారీ ఆదాయం వస్తున్నా మెయిన్‌ లైన్‌ నిర్మాణం అంశాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించకుండా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని పలువురు అంటున్నారు. 

ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు రాములోరి సన్నిధికి వెళ్లేందుకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొవ్వూరు – భద్రాచలం రైల్వే లైనుకు కేవలం రూ.20 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. 151 కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ ప్రాజెక్టును 2012–13లో రూ.1,445 కోట్లతో ఆమోదించారు. అనంతరం అంచనాలు రూ.2,154.83 కోట్లకు చేరాయి. దీనికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడంపై ఈ ప్రాంత వాసులు కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.  కొత్త రైళ్లకు హాల్టులు సహా పలు ప్రాజెక్టులపై ఈ బడ్జెట్‌లో ఎటువంటి స్పష్టతా కనిపించలేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top