ఆదర్శ పాఠశాల టు అమెరికా

Paidibhimavaram student who got a seat at Harvard University in America - Sakshi

ప్రీ మెడికల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలో 93 శాతం మార్కులు

అమెరికాలోని హార్వర్డ్‌ వర్సిటీలో సీటు సాధించిన పైడిభీమవరం బాలుడు 

రణస్థలం: తన కుమారుడిని డాక్టరు చదివించాలన్న తండ్రి తపన అందుకు మార్గాలను అన్వేషించింది. తండ్రి చూపించిన బాటలో కష్టపడి చదివిన ఆ బాలుడు ప్రఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రీ మెడికల్‌ స్కూల్‌లో సీటు సాధించాడు. అమెరికా యూనివర్సిటీలో ఈ సీటు సాధించి తల్లిదండ్రులకు, ఊరికేగాక చదువుకున్న పాఠశాలకు, జిల్లాకు కూడా పేరుతీసుకొచ్చాడు.. గుడివాడ హేమకుమార్‌. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం గ్రామానికి చెందిన హేమకుమార్‌ రణస్థలం ఆదర్శ ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. తండ్రి సూర్యనారాయణ పైడిభీమవరంలోని అరబిందో పరిశ్రమలో పనిచేస్తుండగా తల్లి అరుణ గృహిణి. సూర్యనారాయణ తన కుమారుడిని డాక్టరు చదివించాలని వైద్య కళాశాలలు, ప్రవేశాల గురించి తెలుసుకునేవారు. స్నేహితుల ద్వారా అమెరికాలోని బోట్సన్‌ రాష్ట్రంలోగల హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రీ మెడికల్‌ స్కూల్‌ గురించి విన్న ఆయన హేమకుమార్‌తో ప్రవేశ పరీక్ష రాయించాలనుకున్నారు. అవసరమైన పుస్తకాలు సమకూర్చటమేగాక ఆన్‌లైన్‌లో శిక్షణ ఇప్పించారు. గత నెల 19న హేమకుమార్‌ ప్రవేశ పరీక్ష రాశాడు. అందులో 93 శాతం మార్కులు రావడంతో హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్‌ మెడికల్‌ కోర్సులో సీటు లభించింది. ఈ మేరకు యూనివర్సిటీ నుంచి ఈ నెల 17న సమాచారం వచ్చింది. దీంతో హేమకుమార్‌ ఆదర్శ పాఠశాలకు వచ్చి మిఠాయిలు పంచిపెట్టాడు. ప్రిన్సిపాల్‌ పి.శ్రీధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అతడిని అభినందించారు. 

ఆన్‌లైన్‌ క్లాసులు విన్నాను 
ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు పైడిభీమవరంలోనే ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకున్నా. 5వ తరగతి రణస్థలం ఆర్‌సీఎం స్కూల్లో, 6 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో చదువుకున్నా. డాక్టర్‌ కావాలనే లక్ష్యంతో రోజుకు 6 గంటలకు పైగా ఆన్‌లైన్‌ క్లాసులు విన్నాను. ఇంటరీ్మడియల్‌ బయాలజీ పుస్తకాలు చదివాను. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. ఇంటిగ్రేటెడ్‌ మెడికల్‌ కోర్సులో.. ముందు 11, 11ప్లస్‌ రెండేళ్లు పూర్తిచేయాలి. తరువాత నాలుగేళ్లు ఎంబీబీఎస్‌ చదవాలి. జూన్‌లో క్లాస్‌లు ప్రారంభమవుతాయి. అక్కడకు వెళ్లిన తరువాత స్కాలర్‌షిప్‌ పరీక్ష రాయాల్సి ఉంది. నాన్న సూర్యనారాయణ ప్రోత్సాహంతోనే ఈ పరీక్ష రాశాను. కష్టపడి చదివి ఆయన కల నెరవేరుస్తాను.
– హేమకుమార్, విద్యార్థి

బాగా చదువుతాడు..
నా కుమారుడు మంచి డాక్టర్‌ అవ్వాలనేది నా కోరిక. కొందరిని సంప్రదిస్తే మెడికల్‌ విద్యకు హార్వర్డ్‌ యూనివర్సిటీ ది బెస్ట్‌ అని తెలిసింది. అందుకే ఆన్‌లైన్‌లో అప్లై చేయించాను. మంచిగా చదువుతాడు కాబట్టే సీటు వచ్చింది. సీటు రావడం సంతోషంగా ఉంది. ఎంత కష్టమైనా నా బిడ్డను చదివిస్తాను.     
– సూర్యనారాయణ, విద్యార్థి తండ్రి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top