ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, బీమా లేకున్నా 'భరోసా'!

Orders for financial assistance from AP government funds to families of those who died - Sakshi

కుటుంబ పెద్దను కోల్పోయిన 12,039 కుటుంబాలకు సీఎం జగన్‌ భరోసా 

ప్రభుత్వ నిధుల నుంచి ఆర్థిక సాయానికి ఆదేశాలు 

ఇందుకోసం రూ.258 కోట్లు కేటాయింపు 

ఏప్రిల్‌ 6న సీఎం చేతులు మీదుగా అందజేత 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ బీమా పథకానికి అర్హత ఉండి, దాని పరిధిలో లేకుండా మరణించిన వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం బీమా వర్తించడానికి అవకాశంలేని ఈ కుటుంబాలకు కూడా భరోసా కలిగించేందుకు సర్కారే వీరికి సంబంధించిన ప్రీమియంను చెల్లించనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో మొత్తం 12,039 కుటుంబాలకు భరోసా కల్పించినట్లవుతుందని అధికారులు చెబుతున్నారు. 

రాష్ట్రంలో కొత్త విధివిధానాలతో సీఎం జగన్‌ గత ఏడాది అక్టోబరు 21న వైఎస్సార్‌ బీమా పథకాన్ని ప్రారంభించారు. అంతకుముందు.. అమలులో ఉన్న బీమా పథకానికి కేంద్రం అందజేసే ఆర్థిక సహాయం నిలిపిపేయడంతో ఈ పథకానికి అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ పేదలకు ఉచిత బీమాను అందజేస్తోంది. దీని ద్వారా సాధారణ, ప్రమాదవశాత్తు మరణించిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తోంది.

పథకం ప్రారంభమైన తేదీ తర్వాత ఈ పథకానికి అర్హత ఉండి, నిబంధనల ప్రకారం బీమా పరిధిలోకి రాలేకపోయిన వారు ఇప్పటివరకు 11,022 మంది సాధారణ పరిస్థితులతో మృతిచెందినట్లు, మరో 1,017 మంది ప్రమాదవశాత్తు మరణించడం లేదా శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారని అధికారులు గుర్తించారు. నిజానికి.. వైఎస్సార్‌ బీమా పథకంలో పేర్లు నమోదైన ఒకొక్కరి తరఫున ఆయా బ్యాంకులకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అయితే, బ్యాంకుల్లో నమోదు ప్రక్రియ పూర్తికాకుండా ఇందుకు అర్హత ఉన్నవారు మొత్తం 12,039 మంది మరణించారు.

వీరు సంబంధిత బీమా సంస్థలు, బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం పొందే వీలులేని జాబితాలో ఉండిపోయారని అధికారులు చెప్పారు. దీంతో సీఎం వైఎస్‌ జగన్‌ వీరిపట్ల ఉదారంగా వ్యవహరించి వారి కుటుంబాలను ఆదుకునేందుకు నిర్ణయించినట్లు వారు తెలిపారు. వీరికి ప్రత్యేకంగా ప్రభుత్వ నిధులు నుంచి ఆర్థిక సహాయం చేయాలని సీఎం ఆదేశించారన్నారు. కాగా, ఈ 12,039 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.258 కోట్లు ఖర్చు చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఆధికారులు వెల్లడించారు. 

ఏప్రిల్‌ 6న సీఎం చేతుల మీదుగా సాయం 
వైఎస్సార్‌ బీమా పథకం లబ్దిదారులకు ఏప్రిల్‌ 6న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ 12,039 కుటుంబాలకు ఆ రోజున రూ.258 కోట్ల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు సెర్ప్‌ అధికారులు తెలిపారు. 

వైఎస్సార్‌ బీమా సాయం ఇలా.. 
నిబంధనల ప్రకారం, 18–50 ఏళ్ల మధ్య వయస్సు ఉండి సాధారణ మరణం పొందితే ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు.. 18–50 ఏళ్ల మధ్య వయస్సు ఉండి ప్రమాదవశాత్తు మరణం లేదా పూర్తిస్థాయి అంగవైకల్యం పొందితే రూ.5 లక్షలు.. 51–70 ఏళ్ల మధ్య వయస్సు ఉండి ప్రమాదవశాత్తు మరణం లేదా పూర్తిస్థాయి అంగవైకల్యం పొందితే రూ.3 లక్షల చొప్పున బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తారు.  
(చదవండి: సీఎం జగన్‌పై అభిమానంతో..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top