ఆఖరి స్టెప్‌తోనే ముగిసిన జీవితం..పెళ్లి వేడుకలో విషాదం | Old Man Dancing At Wedding Collapses Dies | Sakshi
Sakshi News home page

ఆఖరి స్టెప్‌తోనే ముగిసిన జీవితం..పెళ్లి వేడుకలో విషాదం

Jun 2 2026 1:09 PM | Updated on Jun 2 2026 1:19 PM

 Old Man Dancing At Wedding Collapses Dies

డీజే పాటలకు డ్యాన్స్‌ చేస్తూ వెల్లికిలా పడి వ్యక్తి మృతి 

చిలకలూరిపేటటౌన్‌: పెళ్లి వేడుకలో ఆనందంగా చిందేస్తూ, ఆ నవ్వుల మధ్యే ఓ నిండు ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయిన హృదయవిదారక సంఘటన చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాపట్ల మండలం రేకులగడ్డకు చెందిన ఏసోబు (62)కు చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి గ్రామానికి చెందిన భాగ్యమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు సంతానం లేదు. ఈ క్రమంలోనే దండమూడి గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగిన ఓ వివాహ వేడుకకు ఈ దంపతులు హాజరయ్యారు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన డీజే పాటలకు అక్కడి వారంతా ఉత్సాహంగా నృత్యాలు చేస్తుండటంతో ఏసోబు కూడా వారితో కలిసి ఆనందంగా చిందేశాడు.

 అయితే దురదృష్టవశాత్తూ వెల్లకిలా పడిపోయాడు. కింద పడే క్రమంలో తలకు తీవ్ర గాయాలవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనను బంధువులు హుటాహుటిన చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఏసోబు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అప్పటివరకు పెళ్లి సందడితో కళకళలాడిన ఆ గ్రామంలో విషాదం నెలకొంది. బిడ్డలు కూడా లేని తనకు ఆఖరి శ్వాస వరకు తోడుగా ఉంటాడనుకున్న భర్త ఇలా మధ్యలోనే దూరమయ్యాడయ్యా.. అంటూ భాగ్యమ్మ కన్నీటి రోదన చూపరులను సైతం కంట తడిపెట్టించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement