ట్రిపుల్‌ ఐటీలో విడతల వారీగా ఆఫ్‌లైన్‌ తరగతులు | Offline classes in installments at IIIT says RGUKT Chancellor KC Reddy | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీలో విడతల వారీగా ఆఫ్‌లైన్‌ తరగతులు

Feb 7 2022 4:53 AM | Updated on Feb 7 2022 9:47 AM

Offline classes in installments at IIIT says RGUKT Chancellor KC Reddy - Sakshi

వేంపల్లె (వైఎస్సార్‌ కడప జిల్లా): ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు విడతల వారీగా ఆఫ్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆర్జీయూకేటీ చాన్సలర్‌ కేసీ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోవిడ్‌ థర్డ్‌ వేవ్, ఒమిక్రాన్‌ నేపథ్యంలో విద్యార్థులకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ తరగతుల కోసం ఆప్షన్‌ ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ (ఈ4) విద్యార్థులకు ఆఫ్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేటి నుంచి (సోమవారం) పీ2 (ఒంగోలు, ఆర్‌కే వ్యాలీ) ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు ఆఫ్‌లైన్‌ తరగతులు ప్రారంభమవుతాయన్నారు.

ఇప్పటికే సుమారు 1,100 మంది విద్యార్థులు ఇడుపులపాయలోని ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌కు చేరుకున్నారన్నారు. ఈనెల 13వ తేదీ నుంచి పీ1 విద్యార్థులకు, 19వ తేదీ నుంచి ఈ3 విద్యార్థులకు ఆఫ్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామన్నారు. మార్చి 2వ తేదీలోపు ఈ1, ఈ2 విద్యార్థులకు ఆఫ్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇటీవల కొంతమంది విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు బహిష్కరిస్తున్నట్లు మెయిల్స్‌ పెట్టారని, అందుకు స్పందించి త్వరలోనే వారికి ఆఫ్‌లైన్‌ తరగతుల కోసం షెడ్యూల్‌ ఇచ్చామన్నారు. 

ట్రిపుల్‌ ఐటీలో ఖాళీల భర్తీ
నూజివీడు (ఆగిరిపల్లి): కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీ ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో మొదటి దశ కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పొంది, విద్యార్థులు చేరకపోవడంతో ఖాళీ అయిన 66 సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించి భర్తీ చేసినట్లు ఆర్జీయూకేటీ చాన్సలర్‌ ఆచార్య కేసీ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒంగోలు క్యాంపస్‌లో 34, శ్రీకాకుళం క్యాంపస్‌లో 32 సీట్లకు 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్‌ పూర్తయిందన్నారు. ఖాళీల కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఆచార్య జి.వి.ఆర్‌.శ్రీనివాసరావు, అడ్మిషన్స్‌ కన్వీనర్‌ ఆచార్య గోపాలరాజు పర్యవేక్షించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement