నివర్‌ తుఫాన్‌: వైఎస్సార్‌ సీపీ నేత మృతి

Nivar Cyclone: YSRCP Leader Deceased In Chittoor District - Sakshi

వాగులో కొట్టుకుపోయి కానరాని లోకాలకు..!

వైఎస్సార్‌ సీపీ నేతను పొట్టన పెట్టుకున్న ‘నివర్‌’

నదీ ప్రవాహంలో కారుతో సహా కొట్టుకుపోయి మృతి

మృతదేహం వెలికితీత చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

మృతుని కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా

ఇంటికి వస్తున్నా అని తన భార్యకు ఫోన్‌ చేశాడు..అతను అనుకున్నట్లు మరో రెండు నిమిషాల్లో గమ్యానికి చేరుకుని ఉంటే భార్యాపిల్లలతో ఆనందంగా గడిపేవాడే. కానీ విధి ఆ వైఎస్సార్‌ సీపీ నేతను చిన్నచూపు చూసింది. ఇంటికి సమీపిస్తున్న సమయంలో నదీ ప్రవాహం కబళించింది. కారుతో సహా కొట్టుకుపోయిన అతడిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. వస్తాడు..వస్తాడు..అని నిరీక్షిస్తున్న ఆ కుటుంబానికి అంతులేని దుఃఖమే మిగిలింది. ఈ విషాద సంఘటన ఐరాల మండలంలో చోటుచేసుకుంది. 

సాక్షి, ఐరాల(యాదమరి): నివర్‌ తుపాను మూలాన మండలంలో గార్గేయ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పూతలపట్టు మండలం పాలకూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు వినయ్‌ రెడ్డి(40) తన కారులో గురువారం రాత్రి  కాణిపాకం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐరాలలోని అత్తగారి ఇంటికి వెళ్తూ మృత్యువాత పడ్డారు. ఐరాల సమీపంలో రోడ్డు మీదుగా ఉధృతంగా ప్రవహిస్తున్న గార్గేయ నదిని దాటే ప్రయత్నంలో అదుపు తప్పి కారుతో సహా ఆయన దాదాపు 300 మీటర్ల దూరం కొట్టుకుపోయారు. కారులోనే ఆయన మరణించారు.

వాగులో కారు మునిగి ఉండటం శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని శ్రమలకోర్చి కారును వెలికితీశారు. అందులోని మృతుడిని వైఎస్సార్‌సీపీ నాయకునిగా గుర్తించారు. ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబుకు స్థానిక నాయకులు దుర్ఘటన గురించి తెలియజేయడంతో వెంటనే సంఘటన స్థలానికి ఆయన చేరుకున్నారు. కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దీంతో ఆర్డీఓ రేణుక, తహసీల్దార్‌ బెన్నురాజ్‌ అక్కడికి చేరుకున్నారు. వారితో ఎమ్మెల్యే చర్చించారు. 

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం తరఫున రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించడంతోపాటు దగ్గరుండి పోస్టుమార్టం తంతు త్వరితగతిన ముగిసేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకున్నారు. అనంతరం పాలకూరులో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, గ్రామస్తుల కన్నీటి నివాళుల నడుమ వినయ్‌కుమార్‌రెడ్డికి అంత్యక్రియలు నిర్వహించారు. వినయ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐరాల  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గల్లంతైన ప్రసాద్‌ శవమయ్యాడు
రేణిగుంట: రాళ్లకాలువ వాగులో గల్లంతైన కుమ్మరపల్లె వాసి ప్రసాద్ ‌(32) శవమై శుక్రవారం వెలుగులోకి వచ్చాడు. గ్రామ సమీపంలో వాగు మధ్యలో చిక్కుకున్న మృతదేహాన్ని గుర్తించారు. వాగు వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి స్థానికులతో కలిసి మృతదేహం వెలికితీత పనుల్లో పాల్గొనడమే కాకుండా స్వయంగా మృతదేహాన్ని ట్రాక్టర్‌పైకి ఎక్కించారు. అక్కడి నుంచి కుమ్మరపల్లె దళితవాడకు వెళ్లి మృతుని కుటుంబాన్ని ఓదార్చారు. గల్లంతైన ప్రసాద్‌ ఆచూకీ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విస్తృతంగా గాలించామని, దురదృష్టవశాత్తూ అతడిని కాపాడలేకపోయామని ఆయన విచారం వ్యక్తం చేశారు.  

రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా
మృతుని కుటుంబానికి ప్రమాద బీమా కింద ప్రభుత్వం తరఫున రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను ఎమ్మెల్యే ప్రకటించారు. మృతుని భార్య నాగభూషణకు వెంటనే వితంతు పింఛను మంజూరు చేయడంతోపాటు పిల్లల చదువులు, వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఆయనతోపాటు తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేష్‌ రెడ్డి, ఆర్డీఓ కనకనరసారెడ్డి, తహసీల్దార్‌ శివప్రసాద్, సీఐ అంజూయాదవ్, పార్టీ నాయకులు తిరుమలరెడ్డి, బాబ్జీరెడ్డి, జువ్వల దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top