సీఎం జగన్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ బృందం

Niti Ayog Team Meets Ap CM YS Jagan Mohan Reddy Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నీతి ఆయోగ్‌ బృందం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్‌ 2020-21 రిపోర్టును సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, వివిధ రంగాల అభివృద్దికి ఇస్తున్న ప్రాధాన్యతను సీఎం వైఎస్‌ జగన్‌ నీతిఆయోగ్‌ సభ్యులకు వివరించారు.

కాగా అంతకముందు నీతిఆయోగ్‌ ఆధ్వర్యంలో సచివాలయంలో సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎస్‌డీజీస్‌) ఇండియా ఇండెక్స్‌ 2020–21, మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌(ఎంపీఐ)పై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఎంపీఐ ర్యాంకింగ్‌లో భారత్‌ 62వ స్థానంలో ఉందని నీతి ఆయోగ్‌ సలహాదారు వెల్లడించారు. మానవాభివృద్ధి సూచికలో ఏపీ అగ్రస్థానంలో ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏపీ 3వ స్థానంలో ఉందని.. త్వరలోనే మొదటి స్థానానికి చేరుకుంటామని ఏపీ ప్రభుత్వం నీతి ఆయోగ్‌కు స్పష్టం చేసింది. ఎస్‌డీజీ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రాన్ని మొదటి స్ధానంలో నిలిపేందుకు ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్లాలనే అంశంపై చర్చించారు. 

ఏపీ ప్రభుత్వం సుస్ధిరాభివృద్ది లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని సాధించుకునేందుకు కృషి చేస్తుందని ముఖ్యమంత్రితో జరిగిన చర్చలో అధికారులు వెల్లడించారు. నవరత్నాలలో భాగంగా వివిధ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయడంపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దికి ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను నీతిఆయోగ్‌ సభ్యులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎస్‌డీజీ లక్ష్యాల సాధనపై రాష్ట్ర, జిల్లా స్ధాయి అధికారులకు నీతిఆయోగ్‌ ఆధ్యర్యంలో దిశానిర్ధేశం చేసినట్లు అధికారుల బృందం సీఎంకు వివరించారు. 

ఈ కార్యక్రమంలో నీతిఆయోగ్‌ సలహాదారు శాన్యుక్తా సమద్దార్, నీతిఆయోగ్‌ ఎస్‌డీజీ ఆఫీసర్‌ అలెన్‌ జాన్, నీతిఆయోగ్‌ డేటా ఎనలటిక్స్‌ ఆఫీసర్‌ సౌరవ్‌ దాస్, ఏపీ ప్రణాళికాశాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top