
డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ జారీ చేసిన ఆదేశాల కాపీ
తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
తిరుపతి మంగళం: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళం, హింసాత్మక ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి చేసిన ఫిర్యాదుపై విచారణ కొనసాగుతోంది. ఆరు వారాల లోపల ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు నివేదికను తమకు సమర్పించాలని డీజీపీని మానవ హక్కుల కమిషన్ శనివారం ఆదేశించింది. 2025 ఫిబ్రవరి 3న జరిగిన ఘటనలు ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేలా ఉండటమే కాకుండా మానవ హక్కుల ఉల్లంఘనలకు, ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతినడానికి కారణమయ్యాయని ఎంపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికల రోజున తమ పార్టీ కార్పొరేటర్లతో కలిసి తాను ప్రయాణిస్తున్న బస్సుపై దుండగులు దాడి చేసి, అద్దాలు పగలగొట్టి, డ్రైవర్‌పై దాడిచేసి, టైర్ల గాలి తీసేసిన ఘటన రికార్డుల్లోనూ ఉందని ఎంపీ వివరించారు. ఈ ఘటన పోలీసుల సమక్షంలోనే జరిగినప్పటికీ, కేసు నమోదు సమయంలో పలువురు నిందితుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో లేకపోవడం అనుమానాస్పదమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్నికల అనంతరం ఎంపీ గురుమూర్తి సమర్పించిన ఆధారాలు, మీడియా రిపోర్టులు, హైకోర్టు ఆదేశాలను కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ పరిశీలనలోకి తీసుకుంది. ఎస్వీ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నం.18/2025 నమోదైనప్పటికీ, దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని ఎంపీ వాదించారు. ఈ నేపథ్యంలో కమిషన్ వరుసగా డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి నివేదికలు కోరింది.