మత్తు మందు వికటించి.. 14 నెలలుగా కోమాలోనే.. | Neglected in Nursing home in Dharmavaram | Sakshi
Sakshi News home page

మత్తు మందు వికటించి.. 14 నెలలుగా కోమాలోనే..

Mar 24 2026 4:53 AM | Updated on Mar 24 2026 6:15 AM

Neglected in Nursing home in Dharmavaram

కోమాలో ఉన్న జ్యోతి

రూ.కోటి ఖర్చు చేసినా కోలుకోని మహిళ

ధర్మవరంలో ఓ నర్సింగ్‌ హోం నిర్వాకం

పుట్టపర్తి అర్బన్‌: ఆపరేషన్‌ చేయడానికి ఓ మహిళకు మత్తు మందు (అనస్తీషియా) ఇవ్వగా, అది వికటించి ఆమె కోమాలోకి వెళ్లారు. అప్పటి నుంచి 14 నెలలుగా కోమాలోనే ఉన్నారు. ఇందుకు కారణమైన నర్సింగ్‌ హోం నిర్వాహకులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విన్నవించేందుకు అంబులెన్స్‌లో రోగిని తీసుకుని ఆమె కుటుంబ సభ్యులు సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చారు.

బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లికి చెందిన రైతు బావిగడ్డ హరిప్రసాద్‌ భార్య జ్యోతి(39)కి 14 నెలల కిందట కడుపునొప్పి రావడంతో ధర్మవరంలోని ఓ నర్సింగ్‌ హోంకు తీసుకెళ్లారు. ఆమెకు అన్ని పరీక్షలు చేసి గర్భసంచి తొలగించాలని వైద్యులు సూచించారు. దీంతో గత ఏడాది జనవరిలో అదే నర్సింగ్‌ హోంలో చేరారు. ఆమెకు ఆపరేషన్‌ చేయడానికి సిద్ధమైన వైద్యులు మత్తు ఇంజక్షన్‌ చేయగా, కోమాలోకి వెళ్లింది. వెంటనే ఆమెను ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి ఐసీయూలోకి మార్చి వైద్యం అందించారు.

అక్కడ కొద్దిరోజులు చికిత్స అందించినా కోలుకోకపోవడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఏడాదిపాటు ఉంచి సుమారు రూ.కోటి ఖర్చు చేసి వైద్యం అందించినా జ్యోతి కోమా నుంచి బయటకు రాలేదు. ఇటీవల జ్యోతిని ఇంటికి తీసుకొచ్చి మంచంపైనే ఉంచి సపర్యలు చేస్తున్నారు.  

విచారణ చేసినా ఎటువంటి చర్యలు తీసుకోని అధికారులు తమకు న్యాయం చేయాలని జ్యోతి కుటుంబ సభ్యులు పలుమార్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్‌వో) డాక్టర్‌ ఫైరోజాబేగం, డ్రిస్టిక్ట్‌ కో–ఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ (డీసీహెచ్‌ఎస్‌) డాక్టర్‌ మధుసూదన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ, వైద్యాధికారులతో విచారణ కమిటీ వేశారు. వారు స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. అయినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో విసుగు చెందిన కుటుంబ సభ్యులు సోమవారం అంబులెన్స్‌లో పేషెంట్‌ జ్యోతిని పుట్టపర్తిలోని కలెక్టరేట్‌కు తీసుకొచ్చారు.

ప్రజాసమస్యల పరిష్కార వేదిక హాలు బయట అంబులెన్స్‌లో జ్యోతిని ఉంచి కలెక్టర్‌ను కలిసేందుకు ప్రయతి్నంచగా, ఆర్డీవో సువర్ణ, డీసీహెచ్‌ఎస్‌ మధుసూదన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో కృష్ణానాయక్‌ వచ్చి వారితో మాట్లాడారు. ‘మీరు మాకు న్యాయం చేయడంలేదు. ఆస్పత్రి వైపు మాట్లాడుతున్నారు..’ అని అధికారులను జ్యోతి భర్త నిలదీశారు. కలెక్టర్‌ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇక్కడ తమకు న్యాయం జరగకపోతే సీఎం ఇంటి వద్ద నిరాహార దీక్ష చేస్తామని ఆయన చెప్పారు. అనంతరం జ్యోతిని తీసుకుని వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement