
ఉ.10 నుంచి సా.5 వరకు ప్రశ్నించిన ‘సిట్’ అధికారులు
మళ్లీ విచారణకు రావాలంటూ నోటీసులు
పూర్తిగా సహకరిస్తానని చెప్పా : మాజీ డిప్యూటీ సీఎం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మద్యం విధానంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే లక్ష్యంగా.. టీడీపీ పెద్దల స్క్రిప్ట్ ప్రకారం ముందుకెళ్తున్న ఏపీ ‘సిట్’ తాజాగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని టార్గెట్ చేసింది. డెబ్భై ఐదేళ్లు దాటిన ఈయన్ను ఏడు గంటలపాటు పనికిరాని ప్రశ్నలతో వేధించింది. తిరుపతి జిల్లా పుత్తూరులో నారాయణస్వామి ఉంటున్న ఇంటికి సిట్ అధికారులు శుక్రవారం ఉ.10 గంటల సమయంలో వచ్చి సా.5 గంటల వరకు నారాయణస్వామిని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం పాలసీకి సంబంధించి జరిగిన ఒప్పందాలు, లావాదేవీలు, మద్యం సరఫరా తదితర అంశాలపై ఆయన్ను ప్రశ్నించారు. నాటి ప్రభుత్వ హయాంలో నారాయణస్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుడు తీసుకొచ్చిన మద్యం పాలసీలో చాలా లొసుగులున్నాయని, ఎవరి ప్రోద్బలంతో లిక్కర్ ఆర్డర్లను ఆన్‌లైన్‌లో కాకుండా, ఆఫ్‌లైన్‌లో ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
సిట్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడంతో.. మరోమారు విచారణకు రావాలంటూ అధికారులు నారాయణస్వామికి నోటీసులిచ్చారు. విచారణ సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు.
ప్రశ్నలన్నింటికీ బదులిచ్చా..
విచారణ పూర్తయ్యాక నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ ‘అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చా. వాళ్ల విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పాను. మరో సారి విచారణకు రావాలంటే సరేనన్నాను. కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు’ అని అన్నారు. కేవలం వైఎస్సార్‌సీపీ నేతలను మానసికంగా వేధించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే ఈ ‘సిట్’ అని పార్టీ నాయకులు తెలిపారు.