ఎస్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే బరితెగింపు | Narasaraopet MLA Chadalavada Aravinda Babu Overacting at Palnadu SP Office: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఎస్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే బరితెగింపు

Apr 1 2026 5:28 AM | Updated on Apr 1 2026 5:28 AM

Narasaraopet MLA Chadalavada Aravinda Babu Overacting at Palnadu SP Office: Andhra Pradesh

సీఎం చంద్రబాబుతో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబు (ఫైల్‌)

పల్నాడు ఎస్పీ కార్యాలయంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ హంగామా

తాను సిఫారసు చేసిన న్యాయవాదికి పోస్టింగ్‌ ఇవ్వాలంటూ ఎస్పీతో వాగ్వాదం, బెదిరింపు

ప్రజాప్రతినిధి దౌర్జన్యంపై పోలీసు వర్గాల్లో ఆగ్రహం

సాక్షి, టాస్క్ ఫోర్స్‌: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు మంగళవారం బరితెగించి ప్రవర్తించారు. ఎస్పీ కార్యాలయంలో బైఠాయించడమేగాక లోపల తలుపులు వేసుకుని గంటలపాటు హంగామా చేశారు. తాను సిఫార్సు చేసిన వ్యక్తికి పోస్టింగ్‌ ఇవ్వాలంటూ నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు జిల్లా ఎస్పీని బెదిరించడంతోపాటు విధులకు తీవ్ర ఆటంకం కలిగించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నారు. చివరికి పోలీసులు తలుపులు బద్దలుగొట్టి ఎమ్మెల్యేని బయటకు తీసుకొచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

నరసరావుపేట జిల్లా పోలీసు కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ వచ్చారు. ఎస్పీ బి.కృష్ణారావును కలిసి జిల్లా పోలీసు కార్యాలయ న్యాయ సలహాదారుడి నియామకంపై మాట్లాడారు. ఈ పోస్టుకు న్యాయవాది శ్రీరామినేని ప్రసాద్‌ను సిఫారసు చేస్తూ ఎనిమిది నెలల కిందట తాను లెటర్‌ ఇచ్చినా ఇప్పటి వరకు ఎందుకు నియమించలేదని ఎస్పీని ప్రశి్నంచినట్టు తెలిసింది. సిఫారసు లెటర్‌ను ఉన్నతాధికారులకు పంపామని, వారే ఈ నియామకాలు చేపడతారని ఎస్పీ చెప్పినట్టు సమాచారం.

తనకు ఇప్పుడే నియామక ఉత్తర్వులు కావాలంటూ ఎస్పీపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఒకదశలో ఎస్పీని బెదిరిస్తూ ఎమ్మెల్యే గట్టిగా అరవడంతో కార్యాలయ సిబ్బంది ఏం జరుగుతోందో తెలియక ఆందోళనకు గురయ్యారు. నేనేంటో ఈ రోజు నీకు చూపిస్తా.. అంటూ ఎమ్మెల్యే బెదిరిస్తుండటంతో ఎస్పీ అసహనంతో బయటకు వెళ్లిపోయారు.  

ఎస్పీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌  
ఎస్పీ బయటకు వెళ్లడంతో చాంబర్‌లోనే ఉండిపోయిన ఎమ్మెల్యే తనకు ఎస్పీ క్షమాపణలు చెప్పే వరకు బయటకు రానంటూ తలుపులు వేసుకున్నారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించిన కార్యాలయ అధికారులపై చిందులు తొక్కారు. తలుపు గడియ తీయకుండా గంటల కొద్దీ చాంబర్‌లోనే ఉండిపోయారు. తరువాత కార్యాలయానికి వచి్చన ఎస్పీ మాట్లాడేందుకు ప్రయత్నించినా ఎమ్మెల్యే స్పందించ లేదు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఫోన్‌లో ఎమ్మెల్యేతో మాట్లాడారు. టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జాన్‌సైదా, పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అరవిందబాబును బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.  

ఐజీతో మాట్లాడేందుకూ నిరాకరణ  
ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే బైఠాయించారన్న సమాచారం అందటంతో రాత్రి ఏడుగంటల సమయంలో గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అక్కడికి చేరుకున్నారు. అప్పటి వరకు ఎస్పీ చాంబర్‌లో ఉన్న ఎమ్మెల్యే.. ఐజీ రాకతో బాత్‌రూమ్‌లోకి వెళ్లి తలుపులు గడియ పెట్టుకున్నట్టు తెలిసింది. కనీసం ఐజీతో మాట్లాడేందుకు కూడా ఎమ్మెల్యే నిరాకరించారు. గంటల కొద్దీ వేచిచూసిన ఐజీ.. సమస్య పరిష్కరిస్తానని స్థానిక టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులకు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకి ఫోన్‌లో చెప్పారు.

తాను సిఫారసు చేసిన వ్యక్తికి నియామక ఉత్తర్వులు ఇస్తేనే బయటకు వస్తానని ఎమ్మెల్యే భీషి్మంచారు. దీంతో పోలీసులు ఎస్పీ చాంబర్‌ తలుపులను, బాత్‌రూమ్‌ తలుపులను బద్దలుగొట్టి ఎమ్మెల్యే చదలవాడను బయటకు తీసుకొచ్చారు. తరువాత ఆయనతో ఐజీ త్రిపాఠి, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ చర్చించారు. బుధవారం సాయంత్రానికి సంబంధిత నియామక ఉత్తర్వులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌కు అందజేస్తానని ఐజీ హామీ ఇవ్వడంతో రాత్రి 10 గంటల సమయంలో అరవిందబాబు ఇంటికి వెళ్లిపోయారు.  

గతంలోనూ ఇంతే..  
అధికారులను బెదిరించడం ఎమ్మెల్యే చదలవాడకు ఇదే మొదటిసారి కాదు. నరసరావుపేట లిక్కర్‌ డిపోలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించి తెలుగుదేశం కార్యకర్తలకు ఉద్యోగాలివ్వాలంటూ 2025 మార్చి 7వ తేదీన రాష్ట్ర ఎక్సైజ్‌ కమిషనరేట్‌లో బైఠాయించారు. అప్పట్లో ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోవడంతో ఆయన మళ్లీ అదేపంథాలో బైఠాయించారు. ఒక ఐపీఎస్‌ అధికారిపై ఎమ్మెల్యే దౌర్జన్యం చేసి విధులకు ఆటంకం కలిగించడంపై పోలీసు వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా అయితే విధులు నిర్వర్తించలేమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసేందుకు ఐపీఎస్‌ సంఘాలు సిద్ధమైనట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement