
పుత్తూరులో గౌడ మద్యం దుకాణం ఉండకూడదని నగరి ఎమ్మెల్యే ఒత్తిడి
సాక్షి టాస్క్ ఫోర్స్: కల్లు గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణంపై నగరి ఎమ్మెల్యే బంధువులు దౌర్జన్యానికి దిగారు. తమ మద్యం దుకాణానికే అడ్డు ఉండకూడదని వారికి హుకుం జారీ చేశారు. మరో చోట మద్యం దుకాణం ఏర్పాటు చేసుకుంటే.. అక్కడ మరో వైన్ షాపు యజమాని గీత కార్మికులపై దాడి చేశారు. ఆపై గౌడ మద్యం దుకాణానికి తాళం వేశారు. గత నెలలో జరిగిన ఘటన తిరుపతి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు..ప్రభుత్వం గీత కార్మికుల కోటాలోని మద్యం దుకాణం కోసం అతిరాల నారాయణ మూడు చోట్ల దరఖాస్తు చేసుకున్నారు. నగరి నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీలో మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతులు పొందారు.
పుత్తూరు సమీపంలో ఫిబ్రవరి 2న గౌడ మద్యం దుకాణం ఏర్పాటు చేసుకున్నారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఒత్తిడి మేరకు ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి చేశారు. ఆ తరువాత విష్ణుమహల్ సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. అక్కడ కూడా వీల్లేదని ఎమ్మెల్యే ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి చేశారు. ఎక్సైజ్ ఉన్నతాధికారి సలహా మేరకు పుత్తూరు–కార్వేటినగరం మార్గంలో కళ్యాణపురం వద్ద ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. అక్కడ వ్యాపారం చేస్తుండగా సమీపంలోని గంగా వైన్స్ యజమాని దౌర్జన్యం మొదలైంది.
గౌడ వైన్స్‌ని తొలగించాలని ఒత్తిడి చేశారు. తొలగించకపోవటంతో దాడికి తెగబడి, దుకాణానికి తాళం వేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. 2 రోజుల తరువాత గౌడ సంఘం సహకారంతో తాళాలు పగులగొట్టి మద్యం దుకాణం నుంచి వ్యాపారం ప్రారంభించారు. 2 రోజుల తరువాత గంగా వైన్స్ యాజమాన్యం వర్గీయులు గౌడ మద్యం దుకాణం ఫ్లెక్సీలు, విద్యుత్ లైట్లను ధ్వంసం చేశారు. వ్యాపారం జరగనివ్వకుండా అరాచకం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని నారాయణ సోమవారం ఫిర్యాదు చేశారు.