ఊరూరా ప'రేషన్‌' | Nadendla Manohar started distribution of goods through ration shops on Sunday | Sakshi
Sakshi News home page

ఊరూరా ప'రేషన్‌'

Jun 2 2025 2:33 AM | Updated on Jun 2 2025 2:34 AM

Nadendla Manohar started distribution of goods through ration shops on Sunday

నాదెండ్ల ప్రారంభించిన షాపు నిమిషాల్లో మూత!

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం 18వ వార్డు 0486014 నంబర్‌ షాపులో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ రేషన్‌ షాపుల ద్వారా సరుకుల పంపిణీని ఆదివారం ప్రారంభించారు. వద్ధులకు, దివ్యాంగులకు ఇళ్ల వద్దే పంపిణీ చేస్తామని ప్రకటించినప్పటికీ.. పిఠాపురానికి చెందిన రాయి రామయ్యమ్మ అనే వద్ధురాలికి రేషన్‌ షాపు వద్దే  బియ్యం ఇచ్చారు. వాటిని మోసుకెళ్లేందుకు ఆమె తీవ్ర అవస్థ పడింది. మంత్రి ప్రారంభించిన కొద్దిసేపటికే ఆ రేషన్‌ షాపును మూసివేయడం కొసమెరుపు.

సాక్షి నెట్‌వర్క్‌: ఇంటికే రేషన్‌ విధానం రద్దు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తొలి రోజే ఆదివారం లబ్ధిదారులు నానా అవస్థలు పడ్డారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపాలెంలోని రేషన్‌ షాపు వద్దకు దాదాపు 3 కి.మీ. దూరంలోని అంకమ్మగూడెం నుంచి గిరిజన మహిళలు బియ్యం కోసం నడుచుకుంటూ వచ్చారు. మూటలు మోసుకుంటూ గూడేనికి చేరుకున్నారు. 

» భీమవరం మండలం దెయ్యాలతిప్ప గ్రామంలో తొలిరోజు ఒకరిద్దరు లబ్ధిదారులకు రేషన్‌ ఇచ్చి తలుపులు మూసేశారు. ప్రారంభించిన గంటలోనే దుకాణం మూతపడటంతో క్యూలో నిలబడ్డ లబ్ధిదారులు నివ్వెరపోయారు. యలమంచిలి మండలం మేడపాడు, నరసాపురం మండలం కొప్పర్రులో ఈ–పోస్‌ యంత్రాలు మొరాయించాయి. తాడేపల్లిగూడెం రూరల్, ఆకివీడు తదితర ప్రాంతాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చి వాహనాలపై సరుకులు తీసుకెళ్లారు. 

» ‘జగన్‌ ప్రభుత్వంలో ఇంటింటికీ రేషన్‌ పంపిణీ అమలు చేసినా మమ్మల్ని తొలగించకుండా మా కమీషన్‌ మాకు ఇచ్చేవారు. మాకు సుఖంగా ఉండేది. ఇప్పుడు మళ్లీ మాకు పని పెట్టారు’ అంటూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట పరిధిలో పలువురు డీలర్లు వాపోయారు.

» తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో 51 రేషన్‌ షాపులుండగా 34,483 రేషన్‌­కార్డు­లు­న్నాయి. డి.ముప్పవరంలో లబ్ధిదారులు సరుకుల కోసం డీలర్‌ వద్ద ఆధార్, రేషన్‌ కార్డులను క్యూ లైన్‌లో పెట్టారు. 65 ఏళ్లు పైబడిన వద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీపై తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని డీలర్లు చెబుతున్నారు. తొలి రోజు సర్వర్‌ పూర్తి స్థాయిలో పని చేయక కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతి షాపులో పదుల సంఖ్యలో మాత్రమే సరుకులు ఇచ్చారు.  

» విజయనగరం జిల్లాలో పలుచోట్ల మండుటెండలో ని­లబడి సరుకులు తీసుకున్నారు. క్యూ లైన్లలో గంటల తరబడి ఉన్నవారు ప్రభుత్వానికి శాపనార్దాలు పెట్టా­రు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, మెళియాపుట్టి తదితర గిరిజన ప్రాంతాల్లో పేదలు తీవ్ర అవస్థలు పడ్డారు. 

» అనంతపురం జిల్లాలో చాలాచోట్ల ఉదయం 8 గంటలకు చౌక దుకాణాలు తెరుచుకోలేదు. నింపాది­గా తొమ్మిది గంటల తరువాత పంపిణీ మొదలైంది. క్యూలైన్‌లో నిలబడలేక వద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. రాప్తాడు మండలం చిన్మయినగర్‌లో చౌక దుకాణం వద్ద చాలా ఆల­స్యంగా పంపిణీ ప్రారంభించారు. ఉదయమే వచ్చి­న కార్డుదారులు సంచులను క్యూ లైన్లలో పెట్టారు. 

»   వైఎస్సార్‌ జిల్లాలో కడపతోపాటు ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, మైదు­కూరు, కమలాపురం తదితర ప్రాంతాల్లో సర్వర్‌ సమస్యతో కార్డుదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో తల్లిదండ్రులు పనులకు వెళ్లడంతో పిల్లలు రేషన్‌ సరుకులు తీసుకునేందుకు వచ్చి అవస్థలు పడ్డారు. అన్నమయ్య జిల్లాలో సర్వర్‌ సమ­స్యతో రేషన్‌ సరుకులు అందని పరిస్థితి నెలకొంది. 

» కర్నూలు ఎన్‌ఆర్‌పేటలో సరుకుల కోసం మహిళలు, వద్ధులు, వికలాంగులు రేషన్‌ షాపుల దగ్గర పడికాపులు కాశారు. సర్వర్‌ మొరాయించడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి ఉండాల్సి వచ్చింది. 

» విశాఖలో తొలి రోజు పలుచోట్ల ఈ–పోస్‌ యంత్రాలు మొరాయించడంతో కార్డుదారులు ఎండలో రోడ్డు మీద గంటల తరబడి నిరీక్షించారు. పలుచోట్ల నెత్తిమీద సరుకులు మోసుకుంటూ వెళ్లడం కనిపించింది. 

» అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో చాలాచోట్ల డిపోలకు బియ్యం రాలేదు. సర్వర్‌ మొరాయించడంతో మారుమూల గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు నిరాశతో వెనుతిరిగారు. గూడెంకొత్తవీధి మండలం కుంకుమపూడి తదితర ప్రాంతాల్లో రేషన్‌ డిపోలు తెరచుకోలేదు. సర్వర్లు పనిచేయక అరకులోయ మండలంలో పంపిణీ నిలిచిపోయింది. 

బస్కీ, లోతేరు, ఇరగాయి, తదితర పంచాయతీల పరిధిలో బియ్యం పంపిణీ జరగలేదు. ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచా­యతీలోని జోడిగుమ్మ, పట్నపడాల్‌పుట్టు, కోసంపుట్టు గ్రామాలకు చెందిన రేషన్‌ దారులు నాలుగు కిలోమీటర్లు అటవీప్రాంతం మీదుగా వచ్చి అవస్థలు పడుతూ రేషన్‌ తీసుకెళ్లారు. బూసిపుట్టు, బుంగాపుట్టు పంచాయతీల్లో కూడా చాలా చోట్ల రేషన్‌ పంపిణీ జరగలేదు. 

»ఉమ్మడి కష్ణా జిల్లాలో ఉదయం నుంచి సర్వర్‌ సమస్యతో ఇబ్బందులు తలెత్తాయి. మండుటెండలో దుకాణాల వద్ద మహిళలు, వద్ధులు నిరీక్షించారు. రెండు రోజుల పాటు ఇదే పరిస్ధితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించిన మచిలీపట్నంలోని దుకాణంలో సైతం సర్వర్‌ సమస్య తలెత్తింది. ఎన్టీఆర్‌ జిల్లాలో ఒక్కో కార్డుకు సరుకుల పంపిణీకి 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టింది. వత్సవాయి, వేముల నర్వ, గోపువానిపాలెం గ్రామాల్లోని రేషన్‌ దుకాణాల్లో సర్వర్లు మొరాయించాయి.

»  రాజమహేంద్రవరంలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు తొలి రోజే మూతపడటంతో రేషన్‌ కోసం వచ్చినవారు కాళ్లీడ్చుకుంటూ వెను­దిరిగారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరంలో లేనందువల్లే రేషన్‌ దుకాణాలు తెరవలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

» ప్రారంభించిన తొలిరోజే పుంగనూరులోని కట్టకిందపాళ్యం రేషన్‌ షాపు (నెంబరు 1082005) మూతబడింది. డీలర్‌ బాలాజీ కార్డులు తీసుకుని బియ్యం ఇవ్వకుండా తాళం వేసి వెళ్లిపోయినట్లు లబ్ధిదారులు చెబుతు­న్నారు. కూలీ పనులు వదిలేసి వచ్చిన వారంతా ఉసూరుమంటూ ఇంటి ముఖం పట్టారు.

పిల్లాడిని మోసుకుంటూ..
పిల్లలను చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో నాతోపాటే రేషన్‌ దుకాణానికి తీసుకొచ్చా. నాలుగు కి.మీ. ఎండలో పిల్లాడిని తీసుకెళ్లడంతో సొమ్మసిల్లిపోయాడు. వైఎస్‌ జగనన్న మాదిరిగా ఇంటింటికీ బియ్యం ఇవ్వాలి. – సవర సావిత్రి, గేసరిగూడ, కొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా 

మహిళలు మోసేదెలా?
ఇన్నాళ్లూ ఇంటి వద్దనే బియ్యం ఇవ్వడం ఎంతో ఉపయోగకరంగా ఉంది. మహిళలు రేషన్‌ షాపు వద్దకు వచ్చి బియ్యం ఎలా మోసుకెళ్తారన్న విషయం పాలకులకు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 
పాత విధానాన్నే అమలు చేయాలి. – షేక్‌ షాజాదీ, బొమ్మూరు, రాజమహేంద్రవరం రూరల్‌ మండలం, తూర్పు గోదావరి జిల్లా 

ఇంటివద్దనే రేషన్‌ ఇవ్వాలి 
జగన్‌ ప్రభుత్వంలో మా­దిరిగా ఇంటి వద్దనే రేషన్‌ సరుకులు సరఫరా చేయా­లి. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి కావస్తున్నా తల్లికి వందనం, రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలేదు. వైఎస్‌ జగన్‌ ప్రతి పథకాన్నీ సకాలంలో అమలు చేశారు.– విడియాల శేషారత్నం, కొండ్రుప్రోలు, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement