ఎన్టీఆర్ జిల్లా: మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆ దిశగా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. బస్సు ఎక్కేందుకు ప్రయాణికులంతా ఒక్కసారిగా ఎగబడడంతో అదుపుతప్పి పడిపోయిన ఓ మహిళ కాలుపైకి బస్సు టైరు ఎక్కడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డ ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఆర్టీసీ బస్‌స్టాండులో సోమవారం సాయంత్రం జరిగింది. రెడ్డిగూడెం మండల పరిధి కుదప గ్రామానికి చెందిన పజ్జూరు కృష్ణవేణి తన తల్లికి కంటి పరీక్షల నిమిత్తం సోమవారం ఉదయం మైలవరం వచ్చారు.
తిరిగి ఇంటికి వెళ్లేందుకు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో బస్టాండుకు చేరుకున్నారు. సా.5.30 తరువాత విజయవాడ–విస్సన్నపేట 110వ నంబరు బస్సు రావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా బస్సెక్కేందుకు ఎగబడ్డారు. దీంతో తన తల్లిని బస్సు ఎక్కించేందుకు కృష్ణవేణి ముందుగా బస్సు ఎక్కి సీటులో లగేజీ సంచిని ఉంచి కిందకు దిగుతుండగా తోపులాట జరగడంతో ఆమె అదుపుతప్పి కింద పడిపోయింది. అదే సమయంలో బస్సు కదలడంతో బస్సు టైరు కృష్ణవేణి కాలుపైకి ఎక్కగా పాదం నుజ్జునుజ్జయింది. బాధితురాలిని స్థానికులు వెంటనే మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


