606 మండలాల్లో వైఎస్సార్‌సీపీ ఉపాధ్యక్షులే 

MPP And Vice MPP Candidate Election In AP - Sakshi

623 మండలాల్లో రెండో ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తి 

కోరం లేక 26 మండలాల్లో వాయిదా  

7 చోట్ల టీడీపీ, 6 చోట్ల ఇండిపెండెంట్ల గెలుపు 

వాయిదా పడినచోట నేడు ఎన్నిక  

కర్నూలు జెడ్పీ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీకి చెందిన పాపిరెడ్డి 

2 మండలాల అధ్యక్ష పదవులు అధికారపార్టీ కైవసం  

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 623 మండలాల్లో మంగళవారం రెండో మండల పరిషత్‌ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. 606 మండలాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు  గెలుపొందారు. ఏడు మండలాల్లో తెలుగుదేశం, మూడుచోట్ల జనసేన, ఒక చోట సీపీఎం ఆ పదవుల్ని దక్కించుకున్నాయి. ఆరు మండలాల్లో ఇండిపెండెంట్‌ ఎంపీటీసీ సభ్యులు రెండో ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. వీరిలో ఎక్కువమంది వైఎస్సార్‌సీపీ మద్దతుతో గెలుపొందారు.

2 జిల్లాల్లో అన్ని మండలాల్లో ఎన్నికలు పూర్తి 
రాష్ట్ర వ్యాప్తంగా 649 మండలాల్లో రెండో ఉపాధ్యక్ష ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. వీటిలో 623 మండలాల్లో మంగళవారం ఎన్నికలు ముగిశాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అన్ని మండలాల్లో ఎన్నిక పూర్తవగా, మిగిలిన 11 జిల్లాల్లో 26 మండలాల్లో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. ఈ మండలాల్లో బుధవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా మండలాల్లో ఎంపీటీసీ సభ్యులకు మండల ప్రిసైడింగ్‌ అధికారులు సమాచారం ఇచి్చనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం తెలిపింది. 

కర్నూలు జెడ్పీ చైర్మన్‌గా పాపిరెడ్డి 
మండలాల్లో రెండో ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలతో పాటు వివిధ కారణాలతో పలుచోట్ల ఖాళీగా ఉన్న జెడ్పీ చైర్మన్, మండల అధ్యక్ష (ఎంపీపీ), ఒకటో ఉపాధ్యక్ష పదవులకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. కర్నూలు జెడ్పీ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీకి చెందిన యర్రబోతుల పాపిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  
►  విశాఖ జిల్లా మాకవరపాలెం, చిత్తూరు జిల్లా గుర్రంకొండ, రామకుప్పం మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా రామకుప్పం మండలంలో ఎన్నిక వాయిదా పడింది. మాకవరపాలెం, గుర్రంకొండ మండలాధ్యక్ష పదవుల్ని వైఎస్సార్‌సీపీ గెల్చుకుంది. రామకుప్పం మండలంలో బుధవారం ఎన్నిక జరిగే అవకాశం ఉంది.  
►  వైఎస్సార్‌ జిల్లా గాలివీడు, సిద్ధవటం, కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలాల్లో మొదటి ఉపాధ్యక్ష పదవుల్ని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెల్చుకున్నారు.  
►  గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో రెండు ఉపాధ్యక్ష పదవులకు నిర్వహించాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top