పశ్చిమాసియా ఉద్రిక్తత.. కేంద్రానికి ఎంపీ గురుమూర్తి లేఖ | MP Gurumurthy writes to the Center on the situation in West Asia | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియా ఉద్రిక్తత.. కేంద్రానికి ఎంపీ గురుమూర్తి లేఖ

Jun 12 2026 6:00 PM | Updated on Jun 12 2026 6:25 PM

MP Gurumurthy writes to the Center on the situation in West Asia

తిరుపతి, జూన్ 12: గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న భద్రతా పరిస్థితుల కారణంగా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయ సముద్ర కార్మికుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ ఆదేశాల మేరకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, కేంద్ర నౌకాశ్రయాలు మంత్రి సర్బానంద సోనోవాల్‌లకు ఈ అంశమై ఈ రోజు (శుక్రవారం) లేఖలు రాశారు.

ఒమన్ గల్ఫ్ ప్రాంతంలో జరిగిన క్షిపణి/డ్రోన్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం జిల్లాకు చెందిన భారతీయ నావికుడు సురేష్ పట్నాల మృతదేహాన్ని త్వరితగతిన స్వదేశానికి తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని  కేంద్రానికి ఎంపీ విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయన కుటుంబానికి అందాల్సిన బీమా, పరిహారం, సంక్షేమ ప్రయోజనాలు, ఇతర చట్టబద్ధ హక్కులు త్వరగా అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుని భార్య, ఇద్దరు చిన్నారులకు విద్యా సహాయం, ఉపాధి, దీర్ఘకాలిక సంక్షేమ మద్దతు కల్పించాలని సూచించారు.

అదే విధంగా ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు సమీపంలో సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయిన ఎంవీ పాస్కల్ నౌకలో 13 మంది భారతీయ సిబ్బంది చిక్కుకుపోయారని, వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు నావికులు ఉన్నారని లేఖలో ప్రస్తావించారు. ఆహారం, తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల కొరతతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఈ ప్రాంతంలో చిక్కుకున్న వారికోసం భారత రాయబార కార్యాలయం తక్షణం సంప్రదింపులు జరపాలని, అవసరమైన ఆహారం,నీరు, మందులు ఇతర మానవతా సహాయాన్ని అందించాలని తెలిపారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

అలాగే బాధిత కుటుంబాలకు పరిస్థితులపై నిరంతర సమాచారం అందించాలనివిదేశాల్లో విధులు నిర్వహిస్తున్న భారతీయ సముద్ర కార్మికుల భద్రత, సంక్షేమం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని ఎంపీ గురుమూర్తి కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement