కథ చెబుతాం ఊ కొడతారా.. | Sakshi
Sakshi News home page

కథ చెబుతాం ఊ కొడతారా..

Published Wed, Mar 1 2023 4:52 AM

Miyawaki designed the Story Time program - Sakshi

చిన్నప్పుడు ‘అనగనగా..’అంటూ అమ్మమ్మలు, నానమ్మలు కథలు చెప్పే రోజులు గుర్తున్నాయా? కథను ఊరిస్తూ.. ఊహించేలా చెబుతుంటే ఆ పాత్రల్లోకి మనం పరకాయ ప్రవేశం చేసేవాళ్లం. కడుపులో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు ‘నారాయణ మంత్రం’విని ఊకొట్టాడని.. తల్లిగర్భంలో ఉన్నప్పుడే అభిమన్యుడు ‘పద్మవ్యూహం’గురించి విని నేర్చుకున్నాడని పురాణాల్లో చదువుకున్నాం.

దృశ్య రూపంలో కంటే శ్రవణ రూప కథనంలో పిల్లల ఊహాశక్తి మెరుగుపడుతుంది. అందుకే మనిషి పరిణామక్రమంలో కథ ప్రాధాన్యం అనన్య సామాన్యం. అయితే నేటి కంప్యూటర్‌ యుగంలో ఆ అదృష్టం పిల్లలకు పూర్తిగా దూరమైంది. కెరీర్‌ పరుగులో పడిపోయి.. పిల్లలకు కథలను చెప్పగలిగేంత సమయం, ఓపిక రెండూ తల్లిదండ్రులకు దొరకడం లేదు. అందుకే ఇప్పటి పిల్లలు కథలంటే గుగూల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలో పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందిస్తూ చదువుపై వారికి ఆసక్తి కలిగించి.. తద్వారా వారిలోని సృజనాత్మక శక్తిని, నిద్రాణంగా దాగి ఉన్న కళలను వెలికి తీసే ఉద్దేశంతోనే పుట్టిందే స్టోరీ టెల్లింగ్‌ డే. ద్వారకానగర్‌ పౌర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చక్కటి స్పందన లభిస్తోంది.     
– విశాఖపట్నం డెస్క్‌

నేటితరం చేతుల్లో పుస్తకాలు నలగవు కానీ ఫోన్లలోని యాప్స్‌ గిరగిరా తిరుగుతుంటాయి. స్మార్ట్‌ ఫోన్లు, వీడియో గేమ్‌లు, ఇంటర్నెట్‌లతో కాలం గడిపే చిన్నారుల్లో సృజనాత్మకశక్తి పూర్తిగా తగ్గిపోవడంతో పాటు వారిలో ఊబకాయం తదితర దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అనేక సర్వేలు వెల్లడించాయి. ‘మీ పిల్లలు తెలివిగల వాళ్లు కావాలంటే వారికి రోజూ కథలు చెప్పండి’అని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ చెప్పారంటే.. చిన్నారుల జీవితాలను కథలు ఎంతగా ప్రభావితం చేయగలవో అర్థం అవుతుంది.

ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రుల ఆలోచనల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. పిల్లలకు ప్రతి రోజూ కథలు చెప్పే సమయం దొరక్కపోయినా.. వారాంతాల్లో తప్పనిసరిగా ‘స్టోరీ టెల్లింగ్‌’ కార్యక్రమాలకు తీసుకెళ్తున్నారు. పాఠశాలల్లో సైతం వారంలో కనీసం రెండు రోజులు స్టోరీ టెల్లింగ్‌ క్లాసులు ఉండేలా యాజమాన్యాలకు అభ్యర్థిస్తున్నారు . ఈ పరిస్థితుల్లో నగరంలో స్టోరీ టెల్లింగ్‌ నిపుణులు, ఈ తరహా కార్యక్రమాలకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది.  

‘మియావాకీ’ అలా మొదలైంది 
కథల ద్వారా పిల్లలను చదువు వైపు మళ్లించడం సులభమని ఉపాధ్యాయురాలు, ప్రముఖ స్టోరీ టెల్లర్‌ షింపీ కుమారి అంటున్నారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ నివాసి అయిన షింపీ కుమారి ఎమ్మెస్సీ, బీఈడీ చదివారు. ఉద్యోగ రీత్యా 2006లో విశాఖ వచ్చారు. ఇక్కడ ఓ ప్రైవేట్‌ పాఠశాలలో సైన్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులు బోధిస్తున్నారు. ద్వారకానగర్‌లోని పౌరగ్రంథాలయం కమిటీ కార్యదర్శి డీఎస్‌ వర్మ చొరవతో 7 నెలల కిందట మియావాకీ స్టోరీ టైమ్‌ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

పౌర గ్రంథాలయంలో నెలలో రెండు రోజులు ఒకటి నుంచి 4వ తరగతి పిల్లలకు ఉదయం 10.15 నుంచి 11.30 వరకు, 5వ తరగతి నుంచి 8 తరగతి చదివే పిల్లలకు 11.15 నుంచి 12.30 వరకు కథలు చెప్పడం ప్రారంభించారు. తొలుత షింపీ కుమారి ఒక్కరే పిల్లలకు చక్కని కథలు చెబుతూ.. వివిధ అంశాలు వివరించేవారు. ఆమె తలపెట్టిన ఈ కార్యానికి తర్వాత నగరానికి చెందిన స్టోరీ టెల్లర్, వాయిస్‌ ఆరి్టస్ట్‌ సీతా శ్రీనివాస్, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్‌ (స్టెమ్‌) ఎడ్యుకేటర్‌ శ్రావ్య గరుడ, ఉపాధ్యాయిరాలు రబియా నవాజ్‌ తోడయ్యారు. వారు స్వచ్ఛందంగా తమ సేవలందిస్తూ చిన్నారులను తీర్చిదిద్దే గురుతర బాధ్యతలో భాగస్వాములయ్యారు.

ఒక్క స్టోరీ టెల్లింగ్‌ ఎన్నో కళలను వెలికి తీస్తుందని షింపీకుమారి తెలిపారు. స్టోరీ టెల్లింగ్‌ క్లాస్‌ పూర్తయిన ప్రతిసారీ తాము పిల్లలతో డ్రాయింగ్, క్రాఫ్టŠస్, సింగింగ్, పప్పెట్రీ, ఒరిగామి తదితర కృత్యాలు పిల్లలతో చేయిస్తామని.. తద్వారా పిల్లల్లో తాము అనుకున్నది వ్యక్తీకరించే స్వతంత్రత వస్తుందన్నారు. భారతీయ విద్యా భవన్స్‌ పబ్లిక్‌ స్కూల్, విశాఖ పౌర గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో గ్రంథాలయం మూడో అంతస్తులోని పిల్లల విభాగంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేదని తెలిపారు.  

కథ అంటే ఓకే అంటారు 
సాధారణంగా పాట పాడదామా, డ్రాయింగ్‌ వేద్దామా అని పిల్లలను అడిగితే కొందరు మాత్రమే సరేనంటారు. అదే కథ వింటారా అంటే అందరూ ఓకే అంటారు. కథ చెప్పడం అనేది ఓ కళ. మిగతా కళలతో పోలిస్తే కథల్లో వినేవాళ్లే కళాకారులు. ఎందుకంటే కథ వినేవాళ్లు వాళ్ల బుర్రల్లో పాత్రలను ఊహించుకుంటారు. అందుకే కథలను అందరూ ఇష్టపడతారు. కెనడాలో మూడేళ్ల కిందట స్కూల్‌ కరిక్యులమ్‌లో స్టోరీ టెల్లింగ్‌ను చేర్చారు. మన సంప్రదాయంలో అది ఎప్పట్నించో ఉంది. చరిత్ర, పురాణాలను కథల ద్వారానే మనం చెప్తాం కదా..  

ఊహాశక్తితో పాటు భాషా పరిజ్ఞానం 
కథలు వినడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తరగతుల్లో చెప్పే పాఠాల్లో దాదాపు సగం చిన్నారులకు గుర్తు ఉండవు. అదే ఓ కథలోని ప్రతీ సంఘటన పిల్లల మనసుల్లో బలంగా నాటుకుపోతుంది.  వారిలో ఊహాశక్తి పెరుగుతుంది. కథ చెబుతూ పోతుంటే ఆ తర్వాత ఏం జరుగుతుందన్న విషయాన్ని చిన్నారులు ఊహిస్తూ ఉంటారు.

ఇదే వారి మానసిక ఎదుగుదలకు ఉపయుక్తంగా నిలుస్తుందని నిపుణుల అభిప్రాయం. ఇక చరిత్రకు సంబంధించిన అంశాలను కథల్లా చెప్పడం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు తెలియజేయవచ్చు. మాతృభాషతో పాటు ఇంగ్లి‹Ù, హిందీ తదితర భాషల్లో పిల్లలకు కథలు చెబితే వారికి భాషా పరిజ్ఞానం కూడా పెరుగుతుంది. 

కథ చెప్పడం ఓ కళ 
శ్రోతలను ఆకట్టుకునేలా కథలను చెప్పగలగడం ఓ ప్రత్యేకమైన కళ. కథల్లోని అంశాలకు తగ్గ ట్టు ఓ ఊహాజనిత లోకాన్ని కళ్లకు కట్టేలా కథలు చెప్పగలిగినపుడే శ్రోతలు ఆ కథలో పూర్తిగా నిమగ్నమవుతారు. ఇప్పటి స్టోరీ టెల్లర్స్‌ వారి హావభావాలను కథలతో కలిపి వ్యక్తీకరించడంతో పాటు పెయింటింగ్స్, పేపర్‌ కటింగ్స్, పాటలు వంటి వాటిని తమ మాధ్యమాలుగా వినియోగిస్తున్నారు.

ఎంచుకున్న కథతోపాటు ఎత్తుగడ, ముగింపు అనే అంశాలు ఓ స్టోరీ టెల్లర్‌ నైపుణ్యాన్ని తెలియజేస్తా యి. కథలు అనగానే కేవలం చిన్నారులకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరబడ్డట్టే. ఎన్నో ఒత్తిళ్లతో సతమతమయ్యే పెద్ద వారికి సైతం ఈ తరహా కథకాలక్షేపాలు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి.  

కథల్లా పాఠాలు 
కథలు వింటూ పాఠాలు వినడం.. కథలే పాఠాలైపోవడం నాకెంతో నచ్చింది. ఇంతకు ముందు చదివింది గుర్తుండేది కాదు. ఇప్పుడు మా బుక్స్‌లోని లెసన్స్‌ కథల్లా మారిపోయాక.. బాగా గుర్తుంటున్నాయి. మార్కులు కూడా బాగా వస్తున్నాయి.   
 – బి.తనూశ్రీ, 3వ తరగతి, భారతీయ విద్యా భవన్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ 

క్లాసెస్‌ బాగుంటున్నాయి 
స్టోరీ టెల్లింగ్‌ క్లాసెస్‌ చాలా బాగుంటున్నాయి. లైబ్రరీలో కొత్తకొత్త పుస్తకాలు కూడా నాకు చాలా నచ్చుతున్నాయి. బుక్స్‌ రీడింగ్‌ వల్ల కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కథలు నేర్చుకోవడంతో పాటు చెప్పడం అలవాటు చేసుకుంటున్నా..    
– సూర్య విహాన్‌ వర్మ, 3వ తరగతి, టింపనీ సీనియర్‌ సెకండరీ స్కూల్‌  

అద్భుతాలు చేయవచ్చు 
కథలు ఎవరికైనా నచ్చుతాయి. అవి ఏ వయసు వారికైనా గుర్తుండిపోతాయి. కథ, కథలు చెప్పే విధానంలోను నవ్యత ఉంటే అవి మనల్ని జీవితాంతం వెంటాడుతాయి. మేం చేస్తున్నది అదే. కథల ద్వారా చిన్ని మనసుల్లో నైపుణ్యాన్ని చొప్పిస్తున్నాం. ఈ నెల 26న మియావాకీ స్టోరీటైమ్‌లో మళ్లీ కలుద్దాం.   
– సీతా శ్రీనివాస్, స్టోరీ టెల్లర్, వాయిస్‌ ఆర్టిస్ట్ 

విద్యార్థులకు మేలు చేస్తుంది 
స్టోరీ టెల్లింగ్‌ విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. ఏదైనా కథలా చెబితే వారికి ఇట్టే గుర్తుండిపోతుంది. ఒక్క చదువే కాదు.. సరైన రీతిలో భావవ్యక్తీకరణ అనేక విధాలుగా జీవితంలో ఉపయోగపడుతుంది. స్టోరీ టెల్లింగ్‌ ద్వారా ఆ నైపుణ్యం పిల్లలకు అందించేందుకు మేం కృషి చేస్తున్నాం.     
– శ్రావ్య గరుడ, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్‌(స్టెమ్‌) ఎడ్యుకేటర్‌  

Advertisement
Advertisement