భాకరాపేట ప్రమాద బాధితులను పరామర్శించిన పెద్దిరెడ్డి

Minister Peddireddy Condolences To Bakarapeta Bus Accident Victims Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మృతి చెందడంపై  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద బాధితులను ఆయన పరామర్శించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు భరోసా ఇచ్చారు.

రుయాతో పాటు, స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇది చాలా బాధాకరమైన ఘటన అని, రాత్రంతా అధికారులు స్పాట్‌లో ఉండి పర్యవేక్షించారని తెలిపారు.

స్పాట్‌లో ఏడు మంది మృతి చెందారని, చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారని చెప్పారు. ప్రయాణించిన ప్రతి ఒక్కరికీ ఫ్యాక్చర్లు అయ్యాయని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్యం తీసుకుంటున్న వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఘటనపై సమీక్షించారని వెల్లడించారు. ఇప్పటికే మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు ఆర్థిక సహాయం ప్రకటించారని గుర్తుచేశారు.

మంచి చికిత్స అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. తక్షణం స్పందించిన అధికారులకు అభినందనలు తెలియజేశారు. భాకరాపేట ఘాట్‌లో తక్షణం రైలింగ్ ఏర్పాటుకు ఆదేశిస్తాని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఆ రోడ్డులో రైలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే రూ. 1500 కోట్లతో అక్కడ నాలుగు లైన్లు రోడ్డు మంజూరు అయ్యిందని గుర్తుచేశారు. ఆ రోడ్డు నిర్మాణం సమయంలో పూర్తి స్థాయిలో పర్మనెంట్ రైలింగ్‌కు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే చెవిరెడ్డి
భాకరాపేట లోయలో పెళ్లి బస్సు బోల్తా ఘటనలో గాయపడ్డ వారిని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. బస్సు బోల్తా ఘటనలో ఎనిమిది మంది మరణించగా 45 మంది క్షతగాత్రులు తిరుపతి రుయా ఆసుపత్రి, స్విమ్స్ ఆసుపత్రి, బర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రుయా ఆసుపత్రిలో ఒక అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండటంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ అమ్మాయిని మెరుగైన వైద్యం కోసం స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. బస్సు బోల్తా ఘటనలో ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ‌సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు.

చదవండి: భాకరాపేట బస్సు ప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top