ఈ షాడో మంత్రి ఓ కంత్రి! | Minister OSD Over action in Education Department: andhra pradesh | Sakshi
Sakshi News home page

ఈ షాడో మంత్రి ఓ కంత్రి!

May 2 2026 6:06 AM | Updated on May 2 2026 6:06 AM

Minister OSD Over action in Education Department: andhra pradesh

విద్యాశాఖలో మంత్రి ఓఎస్డీ ఓవరాక్షన్‌

అంతా నాకు తెలియాలి.. నువ్వు ఎవరైతే నాకేంటి అన్నట్లుగా వ్యవహారశైలి

ప్రొటోకాల్, సంస్కారాన్నిమరిచి ఇష్టానుసారం వ్యాఖ్యలు

మంత్రితో వ్యవహరించినట్లే తనతోనూ నడుచుకోవాలంటూ హుకుం

అర్ధరాత్రి.. అపరాత్రి తేడాలేకుండా సమాచారం పేరుతో వేధింపులు

ఫైల్‌ ప్రొసీడింగ్స్‌ను పక్కనపెట్టి అనధికారికంగా నోటి మాటలతోనే పనులు చేయాలంటూ ఒత్తిడి

గతంలోనే ఈ ఓఎస్డీ కాండక్టుపై నెగిటివ్‌ రిపోర్టు ఇచ్చిన ఇంటెలిజెన్స్‌

అయినా పట్టించుకోకుండా ఓఎస్డీగా నియమించుకున్న విద్యాశాఖ మంత్రి

సాక్షి, అమరావతి : అతనో కంత్రి.. కానీ, తానే మంత్రినన్నట్లుగా పెత్తనం. ప్రభుత్వోద్యోగాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన అవినీతి అంతా ఇంతా కాదు. గ్రూప్‌–1 అధికారిగా తోటి ఉద్యోగులనే వేధించి డబ్బుల కోసం పీడించిన ఘన చరిత్ర ఆయనది. అందుకే మంత్రి ఓఎస్డీగా నియమిస్తున్నప్పుడు రాష్ట్ర నిఘా వ్యవస్థ  అతనిపై నెగిటివ్‌ రిపోర్టు ఇచి్చంది. అయితే, విద్యాశాఖ మంత్రి ఇష్టపడి మరీ ఓఎస్డీగా పెట్టుకోవడంతో ఉన్నత విద్యకు ఆయన రాక పెనుశాపంగా మారింది.

ప్రస్తుతం విద్యాశాఖలో షాడో మంత్రిగా చక్రం తిప్పుతున్న సదరు ఓఎస్డీ తన హోదాను మరిచి ప్రవర్తిస్తుండటం, నిబంధనలను బేఖాతరు చేస్తూ ఆదేశాలిస్తుండడంతో ఉద్యోగులు, విద్యావేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తనకు సంబంధంలేని అంశాల్లో పదేపదే తలదూరుస్తూ నోటికొచి్చనట్లు తూలనాడడం ఉద్యోగులను కలవరపరుస్తోంది. ఉన్నత విద్యా వ్యవస్థల్లో సర్వసాధారణంగా చేపట్టే పనులను సైతం తన అనుమతిలేకుండా చేస్తే ‘సార్‌ ఊరుకోవట్లేదు’.. ‘రూల్స్‌ మాట్లాడొద్దు.. నా మాటే రూల్‌’ అంటూ శాసించే స్థాయికి ఆయన వచ్చేశారు.

అంతు చూస్తానని బెదిరింపులు..
వాస్తవానికి.. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ హోదా కార్యదర్శి కంటే పెద్దది. అలాంటి చోట గౌరవ మర్యాదలతో వ్యవహరించాల్సిన గ్రూప్‌–1 కేడర్‌కు చెందిన ఈ ఓఎస్డీ.. తాను ఫోన్‌చేస్తే మంత్రితో ఎలా వ్యవహరిస్తారో అలాగే  నడుచుకోవాలని హుకుం జారీచేస్తున్నారు. అర్ధరాత్రి.. అపరాత్రి తేడా లేకుండా ఫోన్లుచేసి మరీ నోటికొచి్చనట్లు మాట్లాడుతున్నారని వర్సిటీల అధికారులు,  ఉన్నత విద్యామండలి అధికారులు గగ్గోలు పెడుతున్నారు. నోట్‌ఫైల్‌ ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ నోటిమాట ద్వారా తాను చెప్పింది చేసేయాలని లేకుంటే ఉద్యోగాలు ఊడగొడతానంటూ బెదిరింపులకు తెగబడుతున్నారు.

ఇది తప్పని ఎవరైనా చెబితే అంతుచూస్తానంటూ హెచ్చరించడం సర్వసాధారణమైపోయింది. ఒక వ్యవస్థ దగ్గర లేని అధికారానికి బాధ్యతను అంటగట్టి బలిపశువును చేస్తూ ఫోన్లో ఇష్టమొచ్చినట్లు చిందులేయడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఉన్నత విద్యాశాఖలో జీఓ నెం–3 ద్వారా వర్సిటీల పర్యవేక్షణ బాధ్యత పూర్తిగా ఉన్నత విద్యా కమిషనరేట్‌కు బదిలీ అయ్యింది. అయితే, సదరు ఓఎస్డీ ఉన్నత విద్యామండలికి ఫోన్‌చేసి వర్సిటీ సమగ్ర డేటాను తీసుకురావాలని మౌఖికంగా ఆదేశించారు. ఇది తమ పరిధిలో లేదని, చైర్మన్‌ అనుమతిలేకుండా ఎలాంటి డేటా ఇవ్వలేమని చెప్పడంతో సదరు ఓఎస్డీ ఫోన్‌లోనే వీరంగం వేసేశారు.

మంత్రి అపాయింట్‌మెంటూ దొరకట్లేదు
ఇదిలా ఉంటే.. తమ సమస్యలు చెప్పుకునేందుకు మంత్రి అపాయింట్‌మెంట్‌ కూడా ఈయనవల్ల దొరకట్లేదు. ఎంతటివారైనా ఓఎస్డీని కలవాల్సిందే. వినతిపత్రాలు ఆయనకే ఇవ్వాలి. అందుకే ఓఎస్డీ అడింది ఆట.. పాడింది పాటగా మారిపోయింది. పాఠశాలలు, కళాశాలల అనుమతులను కావాలనే అడ్డుకోవడం ద్వారా భారీగా ముడుపులు దండుకోవడం రివాజైపోయింది. అలాంటి ఓఎస్డీ ఉన్నత విద్యాశాఖను శాసిస్తుండడం విద్యా వ్యవస్థకు ఎనలేని చేటుచేస్తోంది.

ఓఎస్డీ ఆడింది ఆట.. పాడింది పాట..
గతేడాది ఓఏఎండీసీ (డిగ్రీ) ప్రవేశాల సమయంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అనుమతులు ఇవ్వడంలో జాప్యంచేస్తే సదరు ఓఎస్డీ ఉన్నత విద్యామండలి అధికారులను నోటికొచి్చనట్లు తిట్టిపోశారు. ఇలా 20–30 ఏళ్ల సుదీర్ఘ పరిపాలన, విద్యా రంగంలో అనుభవం కలిగిన వ్యక్తులను సైతం అత్యంత హేయమైన పదజాలంతో మాట్లాడడం తమను మానసిక క్షోభకు గురిచేస్తోందని వారు వాపోతున్నారు. కొందరైతే.. ఓఎస్డీ నుంచి ఫోన్‌ వస్తే చాలు భయంతో వణికిపోయి అనారోగ్యం పాలవుతున్నారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీల నుంచి రూ.1,500 కోట్ల మేర నిధులు లాక్కోవడంలో సదరు ఓఎస్డీ చేసిన హంగామా అంతాఇంతా కాదు. డబ్బులిచ్చే వరకు ఉన్నత విద్యామండలి, వర్సిటీల అధికారులను మాటలతో చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత ఏపీ స్టేట్‌ ఫైనాన్సియల్‌ కార్పొరేషన్‌లో నిధులు డిపాజిట్‌ చేస్తే 7.75 శాతం వడ్డీ ఇస్తామని నమ్మబలికి ఆ తర్వాత 7.55 శాతానికే పరిమితం చేసేశారు. ఇప్పుడది మార్చమని వర్సిటీలు, అధికారులు కోరుకుంటే సదరు ఓఎస్డీ ‘నన్నే ప్రశ్నిస్తారా? మీ సంగతి తేలుస్తా’నని హెచ్చరించడం కొసమెరుపు.

Advertisement
 
Advertisement
Advertisement