
300 నుంచి 400 మంది ఉద్యోగులతో మిడ్ జీసీసీలు
టైర్–1 నగరాల్లో 2 వేల మందితో జీసీసీలు ఏర్పాటవుతున్నాయి
భారీ ఐటీ కంపెనీలకు ద్వితీయశ్రేణి నగరాల్లో స్పేస్ లేదు
మరో మూడేళ్లలో విశాఖ వంటి నగరాల్లో మార్పులు
హెచ్1బీపై ఆంక్షలు భారత్‌కు కలిసొచ్చే అంశమే
అత్యుత్తమ మానవ వనరులు ఇక భారత్‌కే సొంతమవుతాయి
‘సాక్షి’తో ఐటీ రంగ నిపుణురాలు, ఐ్రస్పౌట్ సీఈవో సుందరి పాటిబండ్ల
సాక్షి, విశాఖపట్నం: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో గేమ్ ఛేంజర్లుగా అవతరించబోతున్నాయని ప్రముఖ ఐటీ రంగ నిపుణురాలు, ఐస్ప్రౌట్ సీఈవో సుందరి పాటిబండ్ల చెప్పారు. ఖర్చు తగ్గించుకునేందుకు ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు టైర్–2, టైర్–3 నగరాలవైపు ఏ మాదిరిగా అడుగులు వేస్తున్నాయో.. జీసీసీలు కూడా దాన్నే అవలంభిస్తున్నాయని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న పాలసీలు కూడా ఈ అభివృద్ధికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చన్నారు. విశాఖలో జరిగిన 28వ జాతీయ ఈ–గవర్నెన్స్ సదస్సు ప్లీనరీ సెషన్లలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుందరి పాటిబండ్ల ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..
ఉద్యోగం చేసే నగరాల్లో స్థిరపడాలని..
ఐటీ సంస్థలు, జీసీసీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మంచి వాతావరణంలో పనిచేయాలన్నదే కాదు.. పనిచేస్తున్న నగరాల్లోనే స్థిరపడాలని భావిస్తున్నారు. అందుకే విశాఖ వంటి నగరాలకు కొన్నేళ్లుగా డిమాండ్ పెరుగుతోంది. కోవిడ్ తర్వాత అందరి ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. ప్రశాంతమైన, పర్యావరణహిత, ట్రాఫిక్ గజిబిజి లేని నగరాల్లో తమ శాఖలు విస్తరించేందుకు ఆలోచిస్తున్నారు.
భారీసంస్థలకు మౌలిక సదుపాయాల్లేవు
ప్రస్తుతం భారీసంస్థలు ఏర్పాటు చేసేంత మౌలిక సదుపాయాలు చాలా నగరాల్లో తక్కువగానే ఉన్నాయి. కానీ ఉన్న వనరుల్ని వినియోగించుకునేలా ప్రణాళికలు వేసుకుంటే ఐటీ, జీసీసీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు విశాఖలో ఎన్నో ఖాళీ భవనాలున్నాయి. వాటిని ఆఫీస్ స్పేస్‌గా రూపాంతరం చేస్తే.. చిన్నచిన్న సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయి. గ్రేడ్–బి, సి స్పేస్ మాత్రమే కనిపిస్తోంది తప్ప.. గ్రేడ్–ఏ స్పేస్ ఉన్న స్థలాలు లేవు. అందుకే కొన్ని సంస్థలు తమ మౌలిక సదుపాయాలకు అనుగుణంగా ఉన్న స్థలం కోసం ఎదురుచూస్తున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఈ పరిస్థితులు మారే సూచనలు కనిపిస్తున్నాయి.
అమెరికా ఆంక్షలతో లాభం మనకే
హెచ్1బీ వీసాపై అమెరికా ఆంక్షలు విధించడం.. ఐటీ సంస్థలపై కొంత ప్రభావం చూపినా.. భారత్‌కే లబ్ధి చేకూరుతుందనే చెప్పొచ్చు. మన దేశానికి చెందిన నైపుణ్య మానవ వనరులు ఇక్కడే పనిచేసేందుకు వీలవుతుంది. ఫలితంగా భారీ జీసీసీలు భారత్‌కు క్యూకట్టే అవకాశాలు పెరగనున్నాయి.
జీసీసీ డెస్టినేషన్‌గా భారత్
జీసీసీ డెస్టినేషన్‌గా భారత్ అవతరిస్తోంది. జీసీసీలు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రాలుగా వ్యవహరిస్తున్నాయి. జీసీసీలు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్‌గా కూడా మారబోతున్నాయి. ఇందుకు ఎంతో నైపుణ్యం కలిగిన మానవ వనరులతో పాటు మౌలిక సదుపాయాలు కూడా అవసరం. మిడ్ సైజ్ జీసీసీలు ఆర్ అండ్ డీ కేంద్రాలను భారత్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఇవి కచి్చతంగా టైర్–2 నగరాలకు రాబోతున్నాయి. జీసీసీని ఏర్పాటు చేసేందుకు మా సంస్థ సహాయకారిగా వ్యవహరిస్తోంది. రిక్రూట్‌మెంట్, ట్రైనింగ్, వర్క్‌స్పేస్ ఏర్పాటు చేస్తున్నాం.
టైర్–2 సిటీల్లో గేమ్ ఛేంజర్‌గా జీసీసీ
భారీ జీసీసీలకు రెండువేల నుంచి ఐదువేల మంది ఉద్యోగులు అవసరం. మిడ్ సైజ్ జీసీసీలకు మాత్రం 300 నుంచి 400 మంది వరకు అవసరం. ఈ తరహా కంపెనీలు ఎక్కువగా ఏర్పాటయ్యే నగరాలు తిరుగులేని చోదక శక్తులుగా అవతరించనున్నాయి. ఎందుకంటే పెద్దపెద్ద జీసీసీలు ఏర్పాటు చేసేంత సామర్థ్యం, మౌలిక వసతులు ప్రస్తుతం లేవనే చెప్పుకోవాలి. మూడు నాలుగేళ్లలో స్పేస్ క్రియేట్‌చేసే సామర్థ్యం నగరాలకు వస్తుంది. జీసీసీలకు అవసరమైన మానవ వనరులు భారత్‌లో ఉన్నాయి.
దేశంలోని తొమ్మిది నగరాల్లో 2.5 మిలియన్ చదరపు అడుగుల్ని ఆయా సంస్థలకు ఐ స్ప్రౌట్ సంస్థ అందించింది. ఏడాదిన్నర కాలంలో 70 మిడ్‌సైజ్ జీసీసీల ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించాం. నియామకాల పరంగా గత త్రైమాసికంలో టైర్–2 సిటీలైన కోయంబత్తూర్‌లో 34.10 శాతం, కొచి్చలో 27.60, అహ్మదాబాద్‌లో 24.60 శాతం వరకు వృద్ధి నమోదైంది. అందుకే టైర్–2 సిటీల్లో జీసీసీలు గేమ్‌ఛేంజర్‌లు కానున్నాయి.