పిల్లల ఆరోగ్యానికీ భరోసా | Medical examinations across Andhra Pradesh For Childrens Health | Sakshi
Sakshi News home page

పిల్లల ఆరోగ్యానికీ భరోసా

Feb 3 2022 3:36 AM | Updated on Feb 3 2022 8:36 AM

Medical examinations across Andhra Pradesh For Childrens Health - Sakshi

చిత్తూరు జిల్లాలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్‌

సాక్షి, అమరావతి: చిన్నారుల్లో శారీరక లోపాలు, అ నారోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి భరోసా ఇచ్చే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 18 ఏళ్ల పిల్లల వరకు వైద్య పరీక్షలు నిర్వహించి.. వారిలో ఆరోగ్య సమస్యలు గుర్తించి, ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్య శాఖ చేపడుతోంది. ఇందులో భాగంగా పిల్లల వైద్య పరీక్షలకు గత నెలలో శ్రీకారం చుట్టింది. తొలుత అంగన్‌వాడీల్లోని చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత నెల మొదటి వారంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు వైద్య పరీక్షలు చేయడం మొదలుపెట్టింది. కానీ, కరోనా వ్యాప్తి ఈ వైద్య పరీక్షలపై ప్రభావం చూపింది.

అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 6,124 కేంద్రాల్లో 1,62,069 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు చేశారు. 796 మందికి సమస్యలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించి 580 మందికి జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రాల్లో (డీఈఐసీ) చికిత్స అందించారు. శస్త్రచికిత్స అవసరమైన 23 మంది చిన్నారులను పెద్దాసుపత్రులకు సిఫార్సు చేశారు. 193 మందికి మెరుగైన వైద్యం కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లోని కార్పొరేట్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేశారు. వీరందరికీ ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తోంది.  

మార్చిలోగా పాఠశాల పిల్లలకూ..
ఇక ఈ నెలాఖరులోగా రాష్ట్రవ్యాప్తంగా 55,605 అంగన్‌వాడీల్లో 28,18,368 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు పూర్తిచేయాలని కార్యాచరణ రూపొందించారు. అలాగే, వచ్చే మార్చి నెలాఖరులోగా అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని పిల్లలందరికీ వైద్య పరీక్షలు పూర్తిచేయాలని వైద్యశాఖ అధికారులు లక్ష్యం నిర్ధేశించుకున్నారు.  

వైద్య పరీక్షలు వేగవంతం
కరోనా వ్యాప్తి కారణంగా వైద్య పరీక్షలు మందకొడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో..  జాగ్రత్తలు పాటిస్తూ వైద్య పరీక్షలు వేగవంతం చేస్తున్నాం. నెలాఖరులోగా అంగన్‌వాడీల్లో చిన్నారులకు వైద్య పరీక్షలు పూర్తిచేస్తాం. చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.   
– శ్రీనివాస రెడ్డి, ఆర్‌బీఎస్‌కే రాష్ట్ర ప్రత్యేక అధికారి

30 రకాల సమస్యలకు ఉచిత పరీక్షలు
న్యూరల్‌ ట్యూబ్‌ లోపం, డౌన్స్‌ సిండ్రోమ్, గ్రహణ మొర్రి, పెదవి చీలిక, వంకర పాదాలు, నడుం భాగం వృద్ధి లోపం, సంక్రమిక కంటిపొర, గుండె జబ్బులు, పుట్టుకతో వచ్చే చెవుడు, రెటినోపతి ఆఫ్‌ ప్రీ మెచ్యూరిటీ, రక్తహీనత, విటమిన్ల లోపం, మేధోపరమైన అసమానత, వయసుకు అనుగుణంగా మాటలు రాకపోవటం, ఆటిజమ్, అభ్యసనా సమస్యలు, తలసీమియా సహా ఇతర 30 రకాల ఆరోగ్య సమస్యలు, లోపాలు గుర్తించడానికి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement