
రాష్ట్రంలో హడావుడిగా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్
కన్వీనర్ కోటా రిజి్రస్టేషన్‌కు తగినంత సమయం ఇవ్వని దుస్థితి
పెండింగ్ ధ్రువపత్రాలు అప్‌లోడ్ చేయలేక వందలాది మంది ఇక్కట్లు
ఉదయం 10 గంటలకు మెయిల్.. సాయంత్రం 5 గంటలకు క్లోజ్
ఇది విద్యార్థుల జీవితాలతో చెలగాటమేనంటున్న తల్లిదండ్రులు
సాక్షి, అమరావతి : డాక్టర్ అవ్వాలనే ఆశయంతో రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. అందుబాటులోకి వచ్చిన కొత్త వైద్య కళాశాలల్లో సీట్లు పొందే అవకాశాన్ని కాలదన్ని వైద్య విద్యా అవకాశాలకు గండికొట్టడమే కాకుండా, ఉన్న సీట్లలో ప్రవేశాలకు అందరికీ అవకాశాలు కల్పించడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం రాష్ట్రంలో హడావుడిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించారని వారి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.
ధ్రువ పత్రాల నమోదు, ఇతర విషయాల్లో తప్పులు దొర్లాయని, వాటిని సరి చేసుకోవడానికి తగిన సమయం ఇవ్వకుండానే వందల సంఖ్యలో దరఖాస్తులను ఆరోగ్య విశ్వవిద్యాలయం తిరస్కరించిందని మండిపడుతున్నారు. ఆలిండియా కోటా తొలి దశ కౌన్సెలింగ్ కోసం గత నెలలో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) నోటిఫికేషన్ ఇచ్చింది. తొలుత గత నెల 28వ తేదీ వరకూ రిజిస్ట్రేషన్ కు గడువు విధించింది.
కాగా, దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఆలస్యం, ఇతర కారణాలతో రిజిస్ట్రేషన్ చేసుకోలేని విద్యార్థులు సమయం పొడిగించాలంటూ ఎంసీసీని అభ్యర్థించారు. దీంతో పలు దఫాలుగా పొడిగిస్తూ ఈ నెల 6వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించింది. అయితే రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా తయారయ్యాయి.
కేవలం 7 గంటలు గడువా?
రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాల కోసం గత నెలలో విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ ఇచ్చింది. 23 నుంచి 29వ తేదీవరకు సాధారణ దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం రూ.20 వేల ఆలస్య రుసుముతో 30, 31 తేదీల్లో రెండు రోజులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ స్వల్ప వ్యవధిలో దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కనీసం మరో అవకాశం కూడా ఇవ్వలేదు. కుల, ఆదాయ, దివ్యాంగ.. తదితర ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక కొందరు విద్యార్థులు స్వల్ప గడువులో దరఖాస్తు చేసుకోలేకపోయారు.
కొందరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆన్‌లైన్ ఫీజు కూడా చెల్లించినప్పటికీ దరఖాస్తులను సమర్పించలేకపోయారు. మరికొందరు గడువు ముగిస్తే మరి అవకాశం వస్తుందో లేదోనని హడావుడిగా దరఖాస్తులు సమర్పించారు. ఇలాంటి విద్యార్థులు 257 మంది వరకు ఉన్నారు. వీరికి ఈ నెల 5వ తేదీన ఒకే ఒక్క రోజు పెండింగ్ ధ్రువపత్రాలు సమర్పించడానికి అవకాశం కల్పించారు.
ఇందుకు సంబంధించి ఉదయం 10 గంటలకు మెయిల్స్ పంపారని, సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే గడువు ఇచ్చారని విద్యార్థులు వెల్లడించారు. దీంతో వీరిలో చాలా మంది గడువులోగా తప్పులను సరిచేసుకోలేక ప్రభుత్వ కోటా సీటు పొందడానికి అర్హత కోల్పోయామని గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో ఆరోగ్య వర్సిటీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.