నగల వ్యాపారిని కొట్టి, కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి.. కేజీ పైగా బంగారం | Massive Robbery Happened In Jewelery Shop Owner Family At West Godavari - Sakshi
Sakshi News home page

నగల వ్యాపారిని కొట్టి, కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి.. కేజీ పైగా బంగారం

Published Wed, Sep 13 2023 11:47 AM

Massive robbery In West Godavari - Sakshi

పశ్చిమ గోదావరి: బంగారు నగల వ్యాపారి కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి.. వారిని విచక్షణారహితంగా కొట్టి కేజీ పైగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన మంగళవారం రాత్రి తణుకులో చోటుచేసుకుంది. బంగారంతో పాటు లక్ష రూపాయల నగదు కూడా దుండగులు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. తణుకు నరేంద్ర సెంటర్‌ వద్ద బంగారు నగల దుకాణాల వీధిలో రేణుక జ్యూయలరీ పేరుతో నామ్‌దేవ్‌ వ్యాపారం చేస్తున్నారు.

షాపు మేడపైన రెండో అంతస్తులో నామ్‌దేవ్‌ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. మంగళవారం సెలవు కావడంతో షాపులన్నీ మూసి ఉన్నాయి. ఇదే అదునుగా ఐదుగురు దుండగులు సుమారు 7.30 గంటల ప్రాంతంలో ముసుగులు ధరించి నేరుగా నామ్‌దేవ్‌ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో ముగ్గురు పిల్లలు శ్రేయ, చైత్ర, చేతన ట్యూషన్‌కు వెళ్లగా ఇంట్లో నామ్‌దేవ్, అతని భార్య సవిత, కుమారుడు చేతన్‌ ఉన్నారు.

 దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి తమతో పాటు తెచ్చుకున్న టేపుతో వారి కాళ్లు, చేతులు కట్టేశారు. ప్రతిఘటించిన నామ్‌దేవ్‌ను విచక్షణారహితంగా కొట్టడంతో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. బెడ్‌రూమ్‌లో ఉన్న లాకర్‌ తాళాలు తీసుకుని లాకర్‌ తెరిచి కిలోకి పైగా తాకట్టు బంగారం, రూ.లక్ష నగదును దోచుకెళ్లారు. ఇదంతా కేవలం 15 నిమిషాల వ్యవధిలో పూర్తిచేసినట్టు బాధితులు చెబుతున్నారు. దుండగులు కారులో పరారయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుండగులు వెళ్లిపోయిన కొద్దిసేపటికి తేరుకున్న నామ్‌దేవ్‌ తప్పించుకుని ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ రాజ్‌కుమార్, సీఐ ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 

సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు 
పట్టణంలోని ప్రధాన కూడలి నరేంద్ర సెంటర్‌లో భారీ దోపిడీ జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. దోపిడీలో ఐదుగురు పాల్గొనగా నిందితుల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా టోల్‌గేట్లను పోలీసులు అప్రమత్తం చేశారు. దుండగుల్లో ఒక వ్యక్తి గతంలో నామ్‌దేవ్‌ వద్ద పనిచేసిన సూరజ్‌కుమార్‌గా భావిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.    

Advertisement
 

తప్పక చదవండి

Advertisement