
తవణంపల్లె మండలం గాజులపల్లె–అరగొండ రోడ్డులోని ర్యాంపులో నిల్వ ఉన్న మామిడి
చిత్తూరు జిల్లాలో మామిడి రైతన్న చిత్తు చిత్తు.. చెట్లపైనే కుళ్లిపోతున్న కాయలు
పల్ప్ ఫ్యాక్టరీల వద్ద రాత్రింబవళ్లు లోడ్ లారీలు బారులు
తమిళనాడు బార్డర్ దాటి క్యూ లైన్‌లు..
చిత్తూరు, గుడిపాల, తవణంపల్లె, పూతలపట్టులో దయనీయ పరిస్థితులు
రైతుల ఆశలను కుళ్ల బొడిచిన టీడీపీ కూటమి సర్కారు
కడుపు రగిలిపోయి చెట్లను తొలగిస్తున్న అన్నదాతలపై కేసులు నమోదు
జరిమానాలు సైతం వసూలు చేస్తున్న వైనం..
ప్రభుత్వమే పట్టించుకోకపోతే రైతులను ఇంకెవరు పట్టించుకుంటారు?
పండిన పంటను రేటు కూడా తెలియకుండా ఇచ్చేస్తా ఉండేది ప్రపంచంలో ఒక్క రైతే!
అన్నదాతల ఆక్రోశం ఇదీ..
చిత్తూరు అర్బన్: మామిడి పంట చిత్తూరు జిల్లాకు గుండెకాయ లాంటిది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు మామిడికి అనుకూలం కావడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 56 వేల హెక్టార్లలో సాగవుతోంది. ఈదఫా 39,895 హెక్టార్లలో ఐదు లక్షల టన్నులకుపైగా తోతాపురి దిగుబడి వచ్చినట్లు అంచనా. విస్తారంగా కాసినా రైతన్నల ఆశలు ఎన్నో రోజులు నిలవలేదు. ఏ ఒక్క ఫ్యాక్టరీ కిలోకి రూ.12 మద్దతు ధర చెల్లించలేదు. ప్రభుత్వం నుంచి రూ.4 ప్రోత్సాహకమూ దక్కలేదు. ర్యాంపుల వద్ద రూ.2–3 మాత్రమే పలుకుతున్నాయి.
చిత్తూరు, గుడిపాల, తవణంపల్లె, పూతలపట్టు ప్రాంతాల్లో గుజ్జు ఫ్యాక్టరీల వద్ద రైతులు రాత్రింబవళ్లు మామిడి కాయల లోడ్‌లతో నిరీక్షిస్తున్నారు. గుడిపాల నుంచి తమిళనాడు సరిహద్దు వరకు కాయల లోడ్ ట్రాక్టర్లు రోజుల తరబడి నిలిచిపోయాయి. దిక్కుతోచని రైతన్నలు రోడ్లపై పారబోస్తున్నారు.. ఉచితంగా పంచి పెడుతున్నారు... కూలీ, రవాణా ఖర్చులూ రాకపోవడంతో చెట్లకే కాయలను వదిలేస్తున్నారు. చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో కడుపు రగిలిపోయిన పలువురు రైతులు మామిడి చెట్లను పూర్తిగా తొలగించేశారు.
రైతులపై కేసులు, జరిమానాలు..
రైతన్నలు కన్నెర్ర చేయడంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు సర్కారు కుయుక్తులు పన్నుతోంది. చెట్లు కొట్టేస్తున్న రైతులపై వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తోంది. జిల్లాలో ఇప్పటికే ఆరుగురు రైతులపై కేసులు నమోదయ్యాయి.
వైఎస్ జగన్ హయాంలో తోతాపురి కిలో రూ.23–25
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ హయాంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 2023–24లో తోతాపురి మామిడి కిలో రూ.23–25 వరకు పలికింది. కిలో రూ.15–20కి మించి ఎప్పుడూ తగ్గలేదు. గత ప్రభుత్వం పంట మార్కెట్‌కు వచ్చే ముందే కార్యాచరణ సిద్ధం చేసి కలెక్టర్ల నేతృత్వంలో గుజ్జు పరిశ్రమల యాజమాన్యం, రైతులు, ఉద్యాన, మార్కెటింగ్, రెవెన్యూ అధికారులతో కమిటీలు నియమించింది. గుజ్జు పరిశ్రమలతో సమీప తోటలను అనుసంధానం చేశారు. మార్కెట్‌లో డిమాండ్‌కు తగినట్టుగా దశల వారీగా కోతలు చేపట్టేలా అవగాహన కల్పించేవారు.
దీంతో ఇతర మామిడి రకాలు సైతం 2019–24 మధ్య టన్ను రూ.50 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు పలికాయి. గత ప్రభుత్వంలో 10 లక్షల టన్నుల మామిడి గుజ్జుతో పాటు దాదాపు 2,500 టన్నుల మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేశారు. మామిడి రైతుల కోసం రూ.35 కోట్లతో ప్రత్యేకంగా 1,752 ప్యాక్ హౌస్‌లు, రూ.40 కోట్లతో 347 కలెక్షన్ సెంటర్లు నిర్మించారు. మరో రూ.22.50 కోట్లతో 200 కలెక్షన్ సెంటర్లు, రూ.10.50 కోట్లతో 525 ప్యాక్ హౌస్‌లు నిర్మాణం చేపట్టగా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యలోనే నిలిపివేసింది.
గత ప్రభుత్వ హయాంలో నాణ్యమైన పండ్ల దిగుబడుల కోసం రాయితీతో ఫ్రూట్ కవర్లు అందించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మామిడి రైతులు 21 వేల ఎకరాల్లో కొత్తగా తోటలను విస్తరించగా, మరో 20,585 ఎకరాల్లో తోటలను పునరుద్ధరించగలిగారు. కరోనా విపత్తులోనూ మామిడితో పాటు ఇతర పండ్ల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దక్కేలా గత సర్కారు చర్యలు తీసుకుంది.
కిలో రూ.2.50..
చిత్రంలో కనిపిస్తున్న రైతు దామోదర్‌రెడ్డికి చిత్తూరు పరిధిలోని మాపాక్షి గ్రామంలో ఎనిమిది ఎకరాల మామిడిì తోట ఉంది. ఈసారి వంద టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. ఇప్పటివరకు 60 శాతం పంట మాత్రమే అమ్ముడైంది. ర్యాంపు వద్ద కిలో రూ.2.50 చొప్పున అమ్మేశాడు. భారీగా నష్టం రావడంతో మామిడి చెట్లను కొట్టేసి కొబ్బరి సాగు చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు.
ఒక్క కాయ కోస్తే ఒట్టు..
ఈ చిత్రంలో ఉన్న మహిళ కృష్ణవేణి సొంతూరు యాదమరి మండలం మార్లబండ. మూడెకరాల తోతాపురి మామిడి తోట ఉన్నా కూలి ఖర్చులు కూడా రాకపోవడంతో ఒక్క కాయ కూడా కోయకుండా వదిలేసింది. కాయలన్నీ రంగు మారి రాలిపోయే దశలో ఉన్నాయి. ర్యాంపుల్లో అడిగితే రూ.2 అంటున్నారని.. అది కూడా డబ్బులు ఇప్పుడు ఇవ్వలేమని చెబుతున్నారని కంటతడి పెడుతోంది.
చెట్లపైనే కుళ్లిపోతున్నాయి
ఐరాల మండలం కామినాయన పల్లెకి చెందిన సుధాకర్‌నాయుడు 25 ఏళ్లుగా మామిడి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ధర లేకపోవడంతో కోత కోయకుండా అలాగే వదిలేశారు. దీంతో కాయలు చెట్లపైనే కుళ్లిపోయి రాలిపోతున్నాయి.
మానసికంగా కుంగిపోయి..
ఈ ఏడాది ఎక్కువ దిగుబడి రావడంతో సంతోషించా. కానీ పంటను కొనేవారు లేక కాయలు మాగి రాలిపోయాయి. ఫ్యాక్టరీల చుట్టూ తిరిగినా ఒక్క టోకెను సాధించలేకపోయా. ర్యాంపు దగ్గర ధరలు కూలీలకు, బాడుగలకు కూడా సరిపోదు. మానసికంగా కుంగిపోయి 45 ఏళ్ల వయస్సున్న 50 చెట్లను నరికేశా. – రమేష్, సరకల్లు గ్రామం.. తవణంపల్లె మండలం
కోత ఖర్చులూ కరువు..
నాలుగు రోజులుగా రేయింబవళ్లు ఫ్యాక్టరీ ఎదుట పడికాపులు కాస్తున్నాం. దోమలు కుట్టి చేతులు కాళ్లు వాచిపోతున్నాయి. మాకు ఏడెకరాల మామిడి తోట ఉంది. ఈ ఏడాది నాలుగు లోడ్లు పంట వచ్చింది. ఫ్యాక్టరీ వద్ద రోడ్ల మీదే సగం కుళ్లిపోతోంది. కోత ఖర్చులు కూడా రావడంలేదు. – హేమంత్, గొల్లపల్లి గ్రామం,చిత్తూరు రూరల్ మండలం
ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా?
ఐదు రోజులుగా జైన్ కర్మాగారం ఎదుట కష్టాలు పడుతున్నాం. కలెక్టర్ ఆదేశించినా ఎవరూ పట్టించుకోవడంలేదు. మంచినీళ్లు కూడా లేక అవస్థలు పడుతున్నాం. అందరికీ సరిపడా భోజన ఏర్పాట్లు లేవు. రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? – ముని రాజారెడ్డి, వేపంజేరి గ్రామం
తమిళనాడు బార్డర్ దాటి క్యూ ఉండాది..
కాయలు తోలుకొచ్చా. నేనొచ్చి రెండ్రోజులు అవుతా ఉండాది. ఇంటికి వెళ్లకపోయేసరికి నా భార్య ఏడుుస్తా ఉండాది. తమిళనాడు బార్డర్ దాటి క్యూ ఉండాది. కాయలు దిగేకి రెండ్రోజులు పట్టేటట్టు ఉండాది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – సుబ్రమణ్యం, పలమనేరు, చిత్తూరు జిల్లా
కాయలు కొన్న వ్యాపారి రావట్లేదు..
కాపు వచ్చినప్పుడే తోటను ఓ వ్యాపారికి అమ్మేశా. రూ.20 వేలు అడ్వాన్స్ ఇచ్చారు. కలర్ కాయలు (టేబుల్ రకాలు) మాత్రమే కోశారు. తోతాపురి కోయలేదు. ఫోన్ చేస్తుంటే అదిగో.. ఇదిగో అంటున్నారు. – చంద్రన్, పచ్చనపల్లి గ్రామం, చిత్తూరు మండలం
ఈ కష్టాలు ఎప్పుడూ చూడలేదు...
నాకు మూడెకరాల మామిడితోట ఉంది. ఇప్పటివరకు రెండు లోడుల కాయలు అన్‌లోడింగ్ చేయించా. ఇంకా మూడు నాలుగు లోడ్‌ల కాయలున్నాయి. రేటు ఎంతో చెప్పడం లేదు. ఈ కష్టాలు ఎప్పుడూ చూడలేదు. – గోవిందస్వామి, చిత్తపార, గుడిపాల మండలం
రేటు కూడా తెలియకుండా..
పదేళ్ల క్రితం ఏడెకరాల్లో 350 మామిడి మొక్కలు పెట్టా. నీళ్ల ట్యాంకులు, మందులకు రూ.80 వేల వరకు ఖర్చైనాది. ఫ్యాక్టరీ వద్దకు వెళితే టోకెన్లు దొరకలేదు. పది టన్నులు చెట్లపైనే వదిలేశా. 20 టన్నులు ఫ్యాక్టరీకు ఇచ్చేదానికి రెండు రోజులుగా ఇక్కడే ఉన్నా. పండిన పంటను రేటు తెలియకుండానే అమ్ముకుంటున్నది ఒక్క మామిడి రైతే అనుకుంటా..! – కె.మదన్‌మోహన్ నాయుడు, పెరుమాళ్ల కండ్రిగ, చిత్తూరు మండలం