కారుతో ఢీకొట్టి.. ప్రమాదాన్ని దాచేసి! | Man Seriously Injured After Being Struck by Car Carrying APTDC In-charge Official | Sakshi
Sakshi News home page

కారుతో ఢీకొట్టి.. ప్రమాదాన్ని దాచేసి!

May 22 2026 5:43 AM | Updated on May 22 2026 5:43 AM

Man Seriously Injured After Being Struck by Car Carrying APTDC In-charge Official

ఏపీటీడీసీ ఇన్‌చార్జి బాస్‌ ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

ఐదు రోజులకుపైగా కోమాలోనే బాధితుడు

గుట్టుగా ఆస్పత్రిలో వైద్యం

సాక్షి, అమరావతి:  పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)లో ఇన్‌చార్జి బాస్‌గా రాజ్యమేలుతున్న ఓ అధికారి నిర్లక్ష్యానికి ఓ ఉద్యోగి కోమాలోకి వెళ్లిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరిశ్రమల శాఖకు చెందిన అ అధికారి రెండేళ్లుగా ఏపీటీడీసీలో ఎటువంటి పొడిగింపు ఆర్డర్‌ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అధికారిక హోదాలో కొనసాగడమే కాకుండా జీతం సైతం తీసుకుంటూ ఏపీటీడీసీపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఇటీవల ఎండీ సైతం సెలవుపై వెళ్లడంతో ప్రభుత్వం ముందూవెనుక చూడకుండా సదరు అధికారికి ఏపీటీడీసీకి ఇన్‌చార్జి బాస్‌ని చేసేసింది.

శుక్రవారం సాయంత్రం సదరు ఇన్‌చార్జి బాస్‌ ఏఎన్‌యూ వర్సిటీకి ఎదురుగా ఉన్న హైటెక్‌ భవంతుల్లోని తన నివాసానికి డ్రైవర్‌తో పాటు విజయవాడ నుంచి కారులో వెళ్తుండగా కాజా టోల్‌ గేట్‌కు సమీపంలో ఓ వ్యక్తిని బలంగా ఢీకొట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి కోమాలో వెళ్లిపోయాడు. బాధిత వ్యక్తి ఏపీసీఆర్‌డీఏలో అవుట్‌ సోర్సింగ్‌ విభాగంలో చిరుద్యోగిగా కొద్ది నెలల కిందటే చేరారు. గుంటూరు వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఏపీటీడీసీ ఇన్‌చార్జి బాస్‌ కారు బలంగా ఢీకొట్టినట్టు సమాచారం. దీనిపై పోలీసు కేసు నమోదు చేయకుండా సదరు ఇన్‌చార్జి బాస్‌ బాధిత కుటుంబాన్ని బెదిరించినట్టు తెలుస్తోంది. సమాచారం తెలిసినప్పటికీ మంగళగిరి పోలీసులు సైతం ఫిర్యాదు రాలేదనే కారణంతో ఘటనను పట్టించుకోలేదు.

అంతా గుట్టుగానే..
ఆ ఇన్‌చార్జి బాస్‌ ఇప్పుడు కొత్త కారుకు మారిపోయారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఆ కారును బయట తిప్పకుండా దాచేశారు. బాధితుడికి గుంటూరులోని ఓ ఆస్పత్రిలో రహస్యంగా చికిత్స చేయిస్తున్నట్టు సమాచారం. బాధితులు గొడవ చేయకుండా చూసే బాధ్యతను ఏపీటీడీసీలోని ఓ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌కు అప్పగించినట్టు భోగట్టా. ప్రభుత్వ వాహనం ఢీకొని ఎవరైనా గాయపడితే తొలుత సదరు డ్రైవర్, వాహనంలో ఉన్న అధికారి స్థానిక పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. సంబంధిత ప్రభుత్వ విభాగానికి వెంటనే నివేదించాలి.

ఇది 24 గంటల్లోగా చేయాల్సిన ప్రాథమిక ప్రొటోకాల్‌. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వాహనాన్ని స్వా«దీనం చేసుకోవడంతో పాటు మోటారు వాహనాల చట్టం ప్రకారం డ్రైవర్‌ నిర్లక్ష్యమా?  ప్రమాదం ఎందుకు జరిగిందనే అంశాలపై దర్యాప్తు చేస్తారు. దీనికి సమాంతరంగా ప్రమాదానికి కారణంపై పని చేస్తున్న ప్రభుత్వ కార్యాలయానికి నివేదించాలి. అధికారిక వాహన వినియోగానికి సంబంధించి అంతర్గతంగా శాఖాపరమైన విచారణ చేసి వాస్తవాలు నిగ్గుతేల్చి మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇవన్నీ చేస్తే బాధిత వ్యక్తికి ఏదైనా జరిగితే చట్టపరమైన బీమా లభిస్తుంది.

అంతేగానీ, రహస్యంగా వైద్యం చేయిస్తే తాత్కాలిక ఉపశమనం లభించినా తర్వాత ఎదైనా సమస్య తలెత్తితే బాధిత కుటుంబానికి ఆసరా కరువవుతుంది. ఇక్కడ, ప్రమాద ఘటనను దాచి పెట్టేందుకు ఏపీటీడీసీ ఇన్‌చార్జి బాస్‌ ఎందుకు ప్రయతి్నస్తున్నారో అర్థంకాని పరిస్థితి. ఒకవేళ వాహనం ఫిట్‌నెస్‌ లేకుండానే వాడేస్తున్నారా? మితిమీరిన వేగంతో కారు నడిపారా? రోడ్డు నిబంధనలు బేఖాతరు చేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో ఓ ఉద్యోగి సంస్థ వాహనాన్ని తీసుకెళ్లి భారీ యాక్సిడెంట్‌ చేసి కనీసం ఏపీటీడీసీ కార్యాలయంలో నివేదించకుండా గుట్టుగా వర్క్‌షాప్‌లో మరమ్మతు చేసి ఆఫీసులో పెట్టేయడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement