
సాక్షి, మంత్రాలయం: ఆలయ ఈవో విజయరాజు చులకన భావం, ప్రధాన అర్చకుడు జె.ఈరప్ప, వేద పండిట్ మోహన్‌శర్మ పెత్తనం భరించలేక ఉప ప్రధాన అర్చకుడు పూజన్న స్వామి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని ప్రముఖ ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో సంచలనంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉరుకుందకు చెందిన పూజన్న స్వామి 2002లో శ్రీ ఈరన్న స్వామి ఆలయంలో శాశ్వత అర్చకుడిగా నియమితులయ్యారు. వంశపారంపర్య హక్కుతో ఆలయంలో సేవలు అందిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఉప ప్రధాన అర్చకుడిగా పదోన్నతి పొందారు. వీరి పూర్వీకుల పొలాల్లోనే ఈరన్న స్వామి కొలువుదీరడం గమనార్హం. మూడేళ్ల క్రితం రూ.50 లక్షల విలువైన 4 గదుల సముదాయాన్ని కూడా పూజన్న ఆలయానికి విరాళంగా ఇచ్చారు. శనివారం రాత్రి తన ఇంట్లో నిద్రించిన పూజన్న స్వామి, ఆదివారం వేకువజామున తన ఇంటి పైగదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం ఎంతకూ ఆయన లేవకపోవడంతో, కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్లి చూడడంతో అప్పటికే ఆయన మృతిచెందినట్టు గుర్తించారు.
మృతుడు రాసిన సూసైడ్ నోట్‌లో ఆలయ ఈవో విజయరాజుపై, ప్రధాన అర్చకుడు జె.ఈరప్ప, వేద పండిట్ మోహన్‌శర్మపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన అర్చకుడు, వేద పండిట్ కలిసి ఆలయంలోని ఇతర అర్చకులపై అధికారం చెలాయిస్తూ, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వంశపారంపర్య అర్చకులమన్న గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భాలయంలో సీసీ కెమెరాలు పెట్టి అర్చకులను దురుద్దేశంతో చూస్తున్నారని వాపోయారు. దేవాలయంలో అనేక వాస్తవ విరుద్ధాలు జరుగుతున్నా ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు. ఈవో వారిద్దరిని మద్దతు ఇస్తుండడంతో తాను తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మృతుడికి భార్య జయమ్మ, కుమార్తెలు శ్రావణి, శ్రీలత, కుమారుడు వీరయోగీంద్ర మణికంఠ ఉన్నారు.
నేను చులకనగా చూడలేదు: ఆలయ ఈవో విజయరాజు
నేను అర్చకులను ఎవ్వరినీ చులకనగా చూడలేదు. శాఖాపరంగా ఆలయంలో తీసుకోవాల్సిన సంస్థాగత మార్పులు మాత్రమే చేశాను. సీసీ కెమెరాలు విషయం శాఖాపరంగా జరిగింది. పూజన్న స్వామి పట్ల ఏనాడూ నేను దురుసుగా ప్రవర్తించలేదు. ఆయన సూసైడ్ నోట్‌లో ఎందుకు అలా రాశారో అర్థం కావడం లేదు. ఎవ్వరిపైనా నాకు ప్రత్యేక ద్వేషం లేదు.