కోటిపల్లి రైల్వేలైన్‌కు కదలిక

Kotipalli Narasapuram railway line construction has taken a step forward - Sakshi

గౌతమి గోదావరిపై వంతెన, ట్రాక్, మౌలిక వసతులకు రూ.296.51 కోట్లు 

టెండర్ల దాఖలుకు గడువు జూన్‌ 26

ఫలించిన రాష్ట్రప్రభుత్వ యత్నాలు

సాక్షి అమలాపురం: కోటిపల్లి–నరసాపురం రైల్వేలైన్‌ నిర్మాణంలో ముందడుగు పడింది. కొన్ని పనులకు రైల్వేశాఖ రూ.296.51 కోట్లు కేటాయించింది. గౌతమి నదిపై దాదాపు రెండేళ్లుగా నిలిచిపోయిన వంతెన నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. ఇప్పటికే పిల్లర్ల నిర్మాణం పూర్తయిన ఈ వంతెన పైభాగంలో ఐరన్‌ రెయిల్స్, బాక్స్‌ గడ్డర్లు, ఇతర పనులు చేపట్టనున్నారు.

కోటిపల్లి–నరసాపురం మధ్య 57.21 కిలోమీటర్ల రైల్వేలైన్‌ నిర్మాణ అంచనా రూ.2,120.16 కోట్లు. ఈ ప్రాజెక్టులో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని గోదావరి నది పాయలపై మూడు వంతెనల నిర్మాణం కీలకం. ఈ పనులు పూర్తయితే ప్రాజెక్టు నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చినట్టే. తొలుత డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలో కోటిపల్లి–శానపల్లిలంక మధ్య గౌతమి గోదావరి నదిపై 3.50 కిలోమీటర్ల వంతెన నిర్మాణం చేపట్టారు. దీనికి సంబంధించి మొత్తం 44 పిల్లర్ల నిర్మాణం పూర్తయింది.

వైనతేయ గోదావరి పాయపై బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య 21 పిల్లర్లకుగాను 16 పూర్తయ్యాయి. ఐదు నిర్మాణదశలో ఉన్నాయి. వశిష్ట గోదావరి నదిపై జిల్లాలోని దిండి, పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని చించినాడ మధ్య వంతెన నిర్మాణానికి 20 పిల్లర్లకుగాను 18 పూర్తయ్యాయి. గౌతమి నదిపై పిల్లర్ల నిర్మాణం పూర్తయి రెండేళ్లవుతున్నా మిగిలిన వంతెన నిర్మాణ పనులు చేపట్టలేదు. వరదలు, ఇతర కారణాల వల్ల వశిష్ట, వైనతేయ పిల్లర్ల నిర్మాణాలకు అవాంతరాలు ఏర్పడినా ఇటీవల పనులు జోరందుకున్నాయి. 

ఇక పనులు చకచకా..
గౌతమి నదిపై వంతెన నిర్మాణం పూర్తిచేయడంతోపాటు ట్రాక్‌ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రైల్వేశాఖ రూ.296.51 కోట్లు కేటాయించడంతో పనులు చకచకా సాగనున్నాయి. ఈ నిధులతో వంతెన నిర్మాణం పూర్తిచేయడంతోపాటు కోటిపల్లి వైపు 30 మీటర్లు, శానపల్లిలంక వైపు 100 మీటర్ల మేర ఎర్త్‌వర్క్‌ చేసి, కోటిపల్లి నుంచి శానపల్లిలంక వరకు ట్రాక్‌ నిర్మిస్తారు. ఈ పనులకు సంబంధించి ఈ నెల 11న టెండర్లు పిలిచారు. వచ్చేనెల 26వ తేదీ వరకు టెండర్ల దాఖలుకు అవకాశం ఇచ్చారు. 

దుష్ప్రచారాలకు తెర
దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోటిపల్లి–నరసాపురం రైల్వే ప్రాజెక్టులో 25 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వ వాటాగా భరిస్తామని హామీ ఇచ్చారు. గత చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.2 కోట్లు ఇస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసి చేతులు దులుపుకొంది. నిధులు విడుదల చేయలేదు. భూసేకరణ భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తున్నందున ఇవ్వాల్సిన వాటాను మినహాయించాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది.

ఈ యత్నాలు ఫలించాయి. దీంతో రైల్వేశాఖ గౌతమి వంతెన నిర్మాణ పనులకు టెండర్లు పిలిచింది. ప్రభుత్వం ఈ ప్రయత్నాల్లో ఉండగా ఇదే అదనుగా టీడీపీ సహా విపక్షాలు వంతెన నిర్మాణ పనులు నిలిచిపో యినట్టు దుష్ప్రచారానికి దిగాయి. గౌతమి నదిపై వంతెన పనులు ఆగినా.. వైనతేయ, వశిష్ట నదులపై వంతెనల పనులు జరుగుతున్నా విషప్రచారం ఆపకపోవడం గమనార్హం.

తాజాగా గౌతమి నదిపై వంతెన పనులు కూడా మొదలు కానున్నాయి. గౌతమి నదిపై వంతెన నిర్మాణ పనులకు టెండరు పిలవడంపై కోనసీమ జేఏసీ చైర్మన్‌ వి.దివాకర్, కన్వీనర్‌ బండారు రామ్మోహ నరావు అమలాపురంలో ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

చాలా సంతోషం
కోటిపల్లి–నరసాపురం రైల్వే ప్రాజెక్టులో గౌతమి నదిపై వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించడంతో చాలా సంతోషంగా ఉంది. ఆగిపోయిన పను లు మొదలు కావడంతో ఈ ప్రాజెక్టుపై స్థాని కులకు ఉన్న బెంగ వీడింది. ఇందుకు సహక రి ంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు.– బండారు రామ్మోహనరావు, కోనసీమ జేఏసీ కన్వీనర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top