ఆహా ఏమి రుచి.. ఆత్రేయపురం మామిడి తాండ్ర..

Konaseema: Atreyapuram Mango Tandra Special Story - Sakshi

ఆత్రేయపురం(కోనసీమ జిల్లా): రుచికి.. శుచికి.. తియ్యని మామిడి తాండ్రకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఆత్రేయపురం పేరు గాంచింది. చుట్టూ పచ్చని పొలాలు.. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ గ్రామం తాండ్ర తయారీలో ప్రసిద్ధి పొందింది. అనేక మంది ప్రజలు దీనినే వృత్తిగా మార్చుకుని జీవనోపాధి పొందుతున్నారు. తియ్యని లాభాలు ఆర్జిస్తున్నారు. ఏటా వేసవి వచ్చిందంటే తాండ్ర తయారీలో ప్రజలు నిమగ్నమవుతుంటారు. సుమారు 500 కుటుంబాల వారు ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో తాటి చాపలపై మామిడి తాండ్ర పూస్తుంటారు. ఈ మూడు నెలలూ అనేక మందికి జీవనోపాధి కలి్పస్తుంటారు. ఇప్పుడు తయారు చేసిన తాండ్రను నిల్వ ఉంచి, ఏడాది పొడవునా విక్రయిస్తూంటారు.

60 టన్నులు.. రూ.66 లక్షలు
ప్రస్తుత సీజన్‌లో ఆత్రేయపురం కేంద్రంగా సుమారు రూ.66 లక్షల విలువైన 60 టన్నుల మామిడి తాండ్ర తయారవుతోంది. దీని తయారీకి అవసరమైన మామిడి కాయలను నూజివీడు, సత్తుపల్లి, కోరుకొండ, గోకవరం, తుని, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రధానంగా కలెక్టర్‌ రకం మామిడినే తాండ్ర తయారీకి వాడుతుంటారు. ఆత్రేయపురానికి రోజూ రెండు లారీల చొప్పున మామిడి కాయలు తీసుకొస్తుంటారు. దిగుమతి చేసుకున్న మామిడి కాయలను కావు వేసి పండ్లుగా తయారు చేస్తారు.

గుజ్జు తీసి.. చక్కెర వేసి..
పండిన మామిడి నుంచి గుజ్జు తీస్తారు. ఆ గుజ్జులో తగు పాళ్లలో పంచదార కలుపుతారు. తర్వాత ఎండలో ఉంచిన తాటి చాపలపై కూలీల సాయంతో ఒక్కో పొరను పూస్తారు. ఇలా రోజుకు ఒక్కో పొర చొప్పున ఐదారు పొరలు పూసిన అనంతరం మామిడి తాండ్ర తయారవుతుంది. మామిడి తాండ్ర పూసిన తాటి చాపలు వారం రోజుల పాటు ఎండలో ఆరబెడతారు. దీనివల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అనంతరం ఆరంగుళాల పొడవు, వెడల్పు ఉండేలా ముక్కలు కోసి తిరిగి ఎండబెట్టి విక్రయాలకు సిద్ధం చేస్తారు. ప్రస్తుతం ఉన్న మామిడి ధరలతో తాండ్ర తయారీ తలకు మించిన భారంగా మారిందని తయారీదారులు వాపోతున్నారు.

పెరిగిన ధరలతో గుబులు
ప్రస్తుతం మామిడి దిగుబడి అంతంత మాత్రంగానే ఉండటంతో ధరలు విపరీతంగా పెరిగాయి. టన్ను మామిడి కాయల ధర రూ.18 వేలు, పంచదార క్వింటాల్‌ రూ.3,800 పలుకుతుండటంతో రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని వ్యాపారులు అంటున్నారు. దీంతో సామాన్యులు మామిడి తాండ్ర తయారీకి ముందుకు వెళ్లే పరిస్థితులు లేవని తయారీదారుడు కఠారి సురేష్‌ ‘సాక్షి’కి తెలిపారు. టన్ను మామిడి కాయలతో 250 కిలోల తాండ్ర తయారవుతుండగా.. ప్రస్తుత ధరల ప్రకారం, కూలీల ఖర్చులతో కలసి సుమారు రూ.25 వేల వరకూ అవుతోంది. ఈ పరిస్థితుల్లో కిలో తాండ్రను రూ.150 నుంచి రూ.200 వరకూ అమ్మితేనే గిట్టుబాటు అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

ఇక్కడి నుంచి విదేశాలకూ..
ఆత్రేయపురంలో తయారైన మామిడి తాండ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ఇలా గ్రామానికి అంతర్జాతీయంగా పేరు తెస్తున్నారు. శ్రమనే దైవంగా నమ్ముకుని ఆత్రేయపురం పరిసర ప్రాంతాల ప్రజలు మామిడి తాండ్ర తయారీలో నిమగ్నమవుతున్నారు. లాభాలు ఆర్జించడంతో పాటు గ్రామానికి గుర్తింపు తీసుకురావడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

ఈ ఏడాది తక్కువ రేటు 
మామిడి తాండ్ర పుట్టిన ప్రాంతంగా ఆత్రేయపురం ఖ్యాతికెక్కింది. వేసవిలో టన్నుల కొద్దీ మామిడి కాయలను కొనుగోలు చేసి, తాండ్ర తయారు చేస్తారు. దీనిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ ఏడాది మామిడికాయలు తక్కువ రావడంతో రేటు కూడా ఎక్కువగా ఉంది. తాండ్ర తయారు చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కకపోవచ్చు.
– కఠారి సురేష్, ఆత్రేయపురం

ప్రభుత్వం చేయూతనివ్వాలి
ఈ ప్రాంతంలో ఎందరో మహిళలు ఉపాధి పొందుతున్న మామిడి తాండ్ర తయారీకి  ప్రభుత్వం బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు అందించాలి. అలాగే ఈ ప్రాంతంలో స్టాల్స్‌ నిర్మించుకోవడానికి, నాణ్యమైన సరుకులు కొనుగోలు చేయడానికి సాయం అందించాలి. 
-చిలువూరి చిన వెంకట్రాజు, ఆత్రేయపురం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top