సాక్షి, కర్నూలు: కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ వీడింది. దర్యాప్తులో పలు కీలక విషయాలను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. బైక్ నడిపిన శివశంకర్ వెనుక కూర్చున్న వ్యక్తిని ఎర్రి స్వామి(నాని)గా గుర్తించారు. శివశంకర్, ఎర్రి స్వామి ఇద్దరూ లక్ష్మీపురం గ్రామం నుండి అర్ధరాత్రి తర్వాత సుమారు 2 గంటల సమయంలో తుగ్గలి దిశగా బయలుదేరారు. ఎర్రి స్వామిని వదిలి.. తిరిగి రావడం కోసం శివశంకర్ బయలుదేరినట్లు తెలిసింది.
బైక్ (పల్సర్)పై ప్రయాణించిన వీరు కియా షోరూం సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద రాత్రి 2.24 గంటలకు రూ.300 పెట్రోల్ కొట్టించుకుని తిరిగి బయలుదేరారు. బయలుదేరిన కొద్ది సేపటికే చిన్న టేకూరు సమీపంలో బైక్ స్కిడ్ అవడంతో రోడ్డు కుడి వైపున ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ నడిపిన శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక కూర్చున్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు.
ప్రమాద స్థలంలో శివశంకర్‌కు సాయం చేయడానికి ప్రయత్నించిన ఎర్రి స్వామి.. బైక్‌ను రోడ్డుపై నుంచి తీయబోయే సమయంలోనే బస్సు బైక్‌ను ఢీకొట్టి.. కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. బస్సు కింద మంటలు రావడంతో భయపడిన ఎర్రి స్వామి అక్కడి నుంచి తన స్వగ్రామమైన తుగ్గలికి వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంపై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు.


