డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు 54 మంది గైర్హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ ఐదో సెమిస్టర్ పరీక్షల్లో 90 శాతం హాజరు నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా శనివారం 535 మందికి 481మంది హాజరు కాగా 54 తమంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఎమ్మిగనూరు రావూస్ డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒక విద్యార్థి చూచి రాతలకు పాల్పడగా డిబార్ చేసినట్లు తెలిపారు.
90 ఏళ్ల తెలుగు అభ్యుదయ సాహిత్యంపై సదస్సు
కర్నూలు కల్చరల్: సాహిత్య అకాడమీ, అభ్యుదయ రచయితల సంఘం సంయుక్తంగా నగరంలోని సలాం ఖాన్ ఎస్టీయూ భవన్‌లో ఆదివారం ఉదయం 10 గంటలకు 90 ఏళ్ల తెలుగు అభ్యుదయ సాహిత్యంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు అరసం జిల్లా అధ్యక్షులు కె.ప్రహ్లాద్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కార్యాలయంలో సదస్సుకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో సదస్సు జరుగుతుందన్నారు. సాహిత్య అకాడమీ బెంగళూరు ఆఫీస్ ఇన్‌చార్జి నవీన్‌కుమార్, అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, అరసం రాష్ట్ర అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి అతిథులు, వక్తలుగా హాజరు కానున్నారన్నారు. ర్యక్రమంలో అరసం గౌరవ సలహాదారుడు డాక్టర్ ఎం. హరికిషన్, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
నేడు ఏపీఎన్‌జీజీవోస్ కర్నూలు నగర శాఖ ఎన్నిక
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎన్‌జీజీవోస్ అసోసియేషన్ కర్నూలు నగర శాఖ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. జిల్లా అడ్‌హాక్ కమిటీలో సభ్యుడైన మద్దిలేటి ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. స్థానిక ఎన్‌జీవో హోమ్‌లో ఉదయం 9 గంటలకు నామినేషన్ స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే ఐదు తాలూకా ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నగరశాఖ ఎన్నికలు కూడ ఏకగ్రీవంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్షుడుగా మద్దిలేటి, కోడుమూరుకు శ్రీనివాసులు, ఆదోనికి ఉషారాణి, పత్తికొండకు సాయిబాబా, ఆలూరు తాలూకాకు మోహన్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. కర్నూలు తాలూకాకు ఎన్నికలు జరిగితే అన్ని తాలూకాలకు ఎన్నికలు జరిగినట్లవుతుంది. కర్నూలు తాలూకా ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర సహా అధ్యక్షుడు దస్తగిరిరెడ్డి పర్యవేక్షించనున్నారు.
రోగుల సేవలకు
నూతన సాఫ్ట్‌వేర్
కర్నూలు (హాస్పిటల్): రోగుల సేవలను మరింత సరళతరం చేయడానికి ప్రభుత్వం నూతన సాఫ్ట్‌వేర్ రూపొందించిందని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీబాయి చెప్పారు. శనివారం ఆసుపత్రిలోని ధన్వంతరి హాలులో వైద్యులు, సిబ్బందికి నూతన సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీబాయి మాట్లాడుతూ రోగి రిజిస్ట్రేషన్, కేస్ స్టడీ, డయాగ్నోస్టిక్ రిపోర్ట్ అప్‌లోడ్, ఇంటర్ డిపార్ట్‌మెంట్ కమ్యూనికేషన్, రియల్ టైమ్ అప్‌డేట్స్ వంటి అనేక ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయన్నారు. నూతన సాఫ్ట్‌వేర్ వల్ల అన్ని విభాగాల వైద్యులు ఒకే ప్లాట్‌ఫామ్‌లో రోగి హిస్టరీ, రిపోర్టులు, చికిత్స వివరాలను చూసి వెంటనే నిర్ణయాలు తీసుకునే వీలుంటుందన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ పద్మజ, డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ పద్మజ, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివబాల, సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ సురేష్ చాంద్ తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు 54 మంది గైర్హాజరు


