కీలక నేతకు రూ.18కోట్ల ముడుపుల మూట..!
ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.100కోట్ల గండి
ట్రావెల్ బస్సులపై పన్ను తగ్గింపునకు ప్రతిపాదన
కేంద్రం తాజా విధానాన్ని సద్వినియోగం చేసుకోని రాష్ట్రం
ట్రావెల్స్ సిండికేట్‌తో కీలక నేత సెటిల్‌మెంట్
సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వ ఖజానా నిండితే నాకేంటీ... నా సొంత ఖజానా కళ కళలాడాలి గానీ’ అని ప్రభుత్వంలో ఓ కీలక నేత భావించారు. రాయలసీమకు చెందిన ఆయన అందుకే ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్‌తో భారీ డీల్ కుదుర్చుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ప్రైవేట్ ట్రావెల్స్‌పై పన్నులు తగ్గించేందుకు పచ్చ జెండా ఊపారు. ప్రతిగా రూ.18కోట్ల డీల్ సెటిల్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో తమ బస్సుల రిజిస్ట్రేషన్‌ను రాష్ట్రానికి మార్చాల్సిన అనివార్యతను ఏపీ ప్రయోజనాలకు అనుకూలంగా అమలు చేసి, రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని తెచ్చే సదవకాశాన్ని కాలరాశారు. రవాణా శాఖలో చర్చనీయాంశంగా మారిన వ్యవహారం ఇదిగో ఇలా ఉంది...
ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్... ఏపీలో సర్వీసులు
రాష్ట్రంలో సర్వీసులు నిర్వహిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవనే విషయం బహిరంగ రహస్యం. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ప్రధాన రాష్ట్రాల్లో పన్నుల కంటే ఈశాన్య రాష్ట్రాల్లో పన్నులు తక్కువగా ఉండటమే అందుకు కారణం. ప్రైవేట్ బస్సుల్లో ఒక్కో సీటుకు త్రైమాసికానికి రూ.4వేలు చొప్పున పన్ను చెల్లించాలి. ఆ లెక్కన ఒక్కో బస్సుకు మూడు నెలలకు రూ.1.50 లక్షల చొప్పున ఏడాదికి రూ.6 లక్షలు చెల్లించాలి. కాగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌లో బస్సుకు రూ.56 వేలు, అరుణాచల్ ప్రదేశ్‌లో రూ.50 వేలు మాత్రమే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఆ నిర్ణయం తీసుకున్నారు.
అందుకే రాష్ట్రానికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ తదితర ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించి ఏపీలో సర్వీసులు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన విధాన నిర్ణయాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. వన్ నేషన్.. వన్ పర్మిట్ కింద కేంద్ర ప్రభుత్వానికి రూ.90 వేలు చెల్లిస్తే చాలు ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసినా దేశవ్యాప్తంగా సర్వీసులు నిర్వహించుకోవచ్చు. రాష్ట్రంలో సర్వీసులు నిర్వహిస్తున్న 2,200 ప్రైవేటు బస్సుల్లో 1,800 బస్సులకు పైగా ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసినవే కావడం గమనార్హం. ఈ విధానంతో రాష్ట్ర ఖజానా ఏటా రూ.100కోట్ల మేర నష్టపోతోంది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ట్రావెల్స్ దందాకు చెక్
రాష్ట్ర అధికారులు కచ్చితంగా వ్యవహరిస్తే చాలు
కాగా అఖిల భారత పర్మిట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తన విధాన నిర్ణయాన్ని సవరించింది. ఏ రాష్ట్రంలో బస్సులను రిజిస్ట్రేషన్ చేస్తారో... ఆ రాష్ట్రంలో నెలలో కనీసం అయిదు రోజులపాటు సర్వీసులు నిర్వహించాలని పేర్కొంది. దాంతో ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ దందాకు చెక్ పడింది. ఎందుకంటే నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ తదితర ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసిన బస్సులను నెలలో అయిదు రోజులపాటు ఆ రాష్ట్రాల్లో తిప్పాలి. ఆ రాష్ట్రాలకు వెళ్లి వచ్చేందుకు కనీసం మరో అయిదు రోజులు పడుతుంది. అంటే నెలలో పది రోజులపాటు ఆంధ్ర ప్రదేశ్‌కు వెలుపల బస్సులు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రాష్ట్రాలకు ప్రయాణికులు దాదాపు ఉండరు. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు ఆర్థికంగా పెనుభారంగా మారుతుంది.
పది రోజుల సర్వీసుల రాబడి కోల్పోవడంతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లి వచ్చేందుకు అయ్యే ఖర్చుతో తడిసిమోపెడవుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ పన్నులతో వచ్చే మిగులు కంటే ఈ ఆర్థిక భారం అధికం. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు తమ బస్సుల రిజిస్ట్రేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు మార్చుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. రాష్ట్ర రవాణా శాఖ అధికారులు చేయాల్సింది... కేంద్రం తాజాగా జారీ చేసిన నిబంధనలను ట్రావెల్స్ యజమానులు కచ్చితంగా పాటిస్తున్నారా లేదా అంటే.. నెలలో అయిదు రోజులపాటు ఈశాన్య రాష్ట్రాల్లో సర్వీసులు నిర్వహిస్తున్నారా లేదా అని విస్తృతంగా తనిఖీలు చేయడమే. నిబంధనలను పాటించని బస్సులపై జరిమానాలు విధించడమే. దాంతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు తమ బస్సుల రిజిస్ట్రేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు మారుస్తారు.
కీలక నేత రూ.18 కోట్ల డీల్ ... ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.100 కోట్ల గండి
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రైవేట్ బస్సులపై పన్నులు తగ్గించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్‌కుగానీ ఇతర దక్షిణ భారత రాష్ట్రాలకు ఏమాత్రం లేదు. ప్రస్తుతం ఉన్న పన్నుల విధానం కొనసాగిస్తే చాలు.. ఖజానాకు ఆదాయం వస్తుంది. ఇదే విషయాన్ని రవాణా శాఖ అధికారులు ప్రభుత్వానికి చెప్పారు. కానీ ‘ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తే నాకేంటీ అని ప్రభుత్వంలో ఓ కీలక నేత భావించారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి తన సొంత ఖజానా నింపుకునే పనిలో పడ్డారు. అదే విషయాన్ని తనతో సంప్రదింపులు జరిపిన ట్రావెల్స్ సిండికేట్‌కు స్పష్టం చేశారు. తనకు భారీగా ముడుపులు ముట్టజెప్పితే ట్రావెల్స్ బస్సులపై పన్నులు తగ్గిస్తానని ఆఫర్ ఇచ్చారు. ఒక్కో బస్సుకు రూ.లక్ష చొప్పు¯]∙ఇస్తే.. ఒక్కో సీటుపై పన్నును రూ.4వేల నుంచి రూ.2,500కు తగ్గిస్తామని ఆయన తన రేటు స్పష్టం చేశారు.
అందుకు ట్రావెల్స్ సిండికేట్ సమ్మతించింది. ఈశాన్య రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌తో రాష్ట్రంలో దాదాపు రూ.1,800 ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. బస్సుకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.18కోట్లకు డీల్‌ను సూత్రప్రాయంగా ఆమోదించారు. దీంతో పన్ను రేట్లు తగ్గిస్తూ ప్రతిపాదనలు రూపొందించాలని కీలక నేత రవాణా శాఖ అధికారులను మౌఖికంగా ఆదేశించారు. ఇక పన్ను రేట్లు తగ్గిస్తూ ఉత్తర్వులు వెలువడటం.. కీలక నేతకు రూ.18కోట్లు ముడుపులు ముట్టడమే మిగిలింది. కానీ ప్రభుత్వ ఖజానాకు మాత్రం ఏటా రూ.100 కోట్ల గండి పడనుంది.


