జగన్ కట్టించిన ఇళ్లను పంచి మరో డ్రామా
మా ప్రభుత్వంలో 31.19 లక్షల ఇళ్ల స్థలాలిచ్చాం
21.75 లక్షల ఇళ్లు మంజూరు చేశాం
అందులో 9 లక్షల ఇళ్లు పూర్తిచేసిచ్చాం
మాజీమంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టికరణ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పంపిణీ పేరుతో చంద్రబాబు మరో క్రెడిట్ దోపిడీకి పాల్పడ్డారని, నాయుడుపేట సభలో ఆయన చెప్పిన అబద్ధాలే అందుకు నిదర్శనమని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. గతంలో ఇళ్ల పంపిణీ పేరుతో పేదలపై భారం మోపిన చరిత్ర చంద్రబాబుది అయితే.. వారికి రూ.12 వేల కోట్ల రాయితీలు కల్పించి ఇళ్లు నిర్మించి ఇచ్చిన చరిత్ర వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదని ఆయన గుర్తుచేశారు. అయినా సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లెవేస్తున్నారని మండిపడ్డారు.
నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనను ప్రజలు ఈసడించుకుంటున్నారని, నాయుడుపేటలో చంద్రబాబు ఉపన్యాసం వినడానికి కూడా ప్రజలు ఆసక్తి చూపించకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఎవరు మంచి పని చేసినా దానిని తన ఖాతాలో వేసుకోవడం, తప్పు జరిగితే అధికారులు, ప్రతిపక్షాల మీద నెట్టేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. కాకాణి ఇంకా ఏమన్నారంటే..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు..
తిరుపతి జిల్లాలో 15,659 ఇళ్లు నిర్మిస్తున్నామని, ఇప్పటివరకు రాష్ట్రంలో 5.5 లక్షల ఇళ్లు నిర్మించామని చెబుతున్న చంద్రబాబు 2014–19 మధ్య ఎన్ని స్థలాలిచ్చారు? ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలి. 21 నెలల్లో 5.5 లక్షల ఇళ్లు కట్టించామంటూ పచ్చి అబద్ధం చెప్పారు. గతంలో మా ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు ఫినిషింగ్ టచ్ ఇచ్చాక పంపిణీ చేయకుండా ఆగిపోయిన వాటిని ఇవాళ పంపిణీ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 31.19 లక్షల ఇళ్ల స్థలాలిచ్చి 21.75 లక్షల ఇళ్లు మంజూరుచేస్తే 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. రెండు లక్షల ఇళ్లు ముగింపు దశలో ఉండగా మరో 11 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని నిరూపించేందుకు మేం సిద్ధం. 2019–24 మధ్య నిరుపేదలకు దాదాపు రూ.32 వేల కోట్ల విలువైన 72 వేల ఎకరాల భూముల్ని పేదలకు పంచిపెట్టిన చరిత్ర వైఎస్ జగన్‌దే.
టిడ్కో ఇళ్లు ఇచ్చిందీ వైఎస్ జగనే..
2024 ఫిబ్రవరిలో 1.25 లక్షల టిడ్కో ఇళ్లు కట్టించి ఇచ్చాం. వాటికి రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పించి కేవలం ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన చరిత్ర జగన్‌దే. అలా 1,43,600 ఇళ్లను అక్క చెల్లెమ్మలకు వైఎస్ జగన్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. దీన్ని చంద్రబాబు కాదని చెప్పగలరా? ఇంకా 365 ఎస్‌ఎఫ్‌టీ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు 44,304 మందికి ఒక్కొక్కరికి కేవలం రూ.25 వేల చెల్లింపుతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. అలాగే, 430 ఎస్‌ఎఫ్‌టీ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు 74,312 మందికి ఒక్కొక్కరికి కేవలం రూ.50 వేల చెల్లింపుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో మొత్తం 25 లేఅవుట్లలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం రాజధానిలో పేదలు ఉండకూడదంటూ ఆర్–5 జోన్‌లో మొత్తం 50,793 ఇళ్ల పట్టాలను రద్దుచేసింది.
టిడ్కో ఇళ్లలో చంద్రబాబు అవినీతి..
చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లలో జరిగింది అవినీతి మాత్రమే. ముడుపులిచ్చిన కాంట్రాక్టర్లకు ఎక్కువ ధరకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. అలాగే, లబ్ధిదారులపై విపరీతంగా భారం మోపారు. ఇలా టిడ్కో ఇళ్ల మీద రూ.8,929 కోట్ల అవినీతికి పాల్పడిన విషయం వాస్తవమా కాదా చంద్రబాబు చెప్పాలి.


