కడియం నర్సరీలో ఖరీదైన మొక్కలు

Kadiyam Nursery Plants: Olive, Multimode Bonsai, Imported Ficus, Moringa - Sakshi

విదేశాల నుంచి దిగుమతి

ఖరీదు రూ.లక్షల్లోనే.. 

కడియం నుంచి అంబానీ పార్కుకు రెండు చెట్లు తరలించారా.. ఒక్కో దాని ఖరీదు పాతిక లక్షల రూపాయలట.. రెండు రోజుల నాటి ఈ వార్త అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది. మొక్కల్లో ఇంత ఖరీదైనవి ఉంటాయా? అని ఒక్కసారిగా దీనిపై చర్చ మొదలైంది. తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలోకి ఒక్కసారి తొంగిచూస్తే ఇలాంటి విశేషాలున్న మొక్కలు లేదా చెట్లు ఎన్నో కనిపిస్తాయి. ఆనందాన్ని.. ఆశ్చర్యాన్ని పంచుతాయి. రూపంతో పాటు, ధరలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి మరి.. ఈ తరహా ప్రత్యేక మొక్కలను కడియం ప్రాంత నర్సరీ రైతులు దేశ విదేశాల నుంచి తీసుకువస్తున్నారు. అక్కడి వాతావరణాన్ని ఇక్కడ కృత్రిమంగా కల్పించి మరీ పెంచి అభివృద్ధి చేస్తున్నారు. విలాసవంతమైన ఈ మొక్కలను అభివృద్ధి చేయడం అందరి రైతులు వల్లా సాధ్యం కాదండోయ్‌.. ఆసక్తి, స్థోమత ఉన్న రైతులు మాత్రమే వీటిని అభివృద్ది చేస్తున్నారు. సంపన్నులే వీటిని కొనుగోలు చేస్తుంటారు. కడియం నర్సరీలో ఇలాంటి కొన్ని మొక్కల గురించి తెలుసుకుందామా..     


లక్కీ.. ఆలివ్‌

ఇటీవల అంబానీ పార్క్‌కు కడియం నుంచి తరలించిన చెట్టు పేరు ఆలివ్‌. పాశ్చాత్య దేశాల్లో అదృష్టాన్ని తెచ్చేదిగా దీన్ని భావిస్తుంటారు. వందల ఏళ్ల వయసున్న ఈ చెట్టును పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. స్పెయిన్‌ నుంచి తీసుకువచ్చిన ఆలివ్‌ ప్లాంట్స్‌ కడియం నర్సరీలో లభిస్తున్నాయి. 150 నుంచి 210 సంవత్సరాల వరకు వయసున్న వీటిని  అమ్మకానికి పెట్టారు. ధర రూ.25 లక్షల వరకూ ఉంటుంది. మన దేశంలో ఆవునెయ్యికి ఎంత ప్రాధాన్యం ఉందో. ఆలివ్‌ మొక్కల నుంచి తీసిన నూనెకు కూడా కొన్ని దేశాల్లో అంతే ప్రాధాన్యం ఇస్తారని వీటిని అభివృద్ధి చేస్తున్న రైతులు చెబుతున్నారు. (చదవండి: ఒక్కో మొక్క రూ.25 లక్షలు!)             


ఆకారమే అందం

ఫైకస్‌ కుటుంబానికే చెందిన ఈ మొక్క రూపు చూడగానే హత్తుకుంటుంది. ఆకర్షణీయంగా ముచ్చటగొలుపుతుంది. ఆసియా దేశాలైన చైనా, తైవాన్, థాయ్‌లాండ్‌ తదితర దేశాల్లో వీటిని పెంచుతుంటారు. కడియంలోని రైతులు వీటిని దిగుమతి చేసుకుంటున్నారీ మధ్య. మరింతగా అభివృద్ధి పరుస్తున్నారు. మొక్క వయస్సును బట్టి ధరలు ఉంటాయి. 15 ఏళ్ల వయసుంటే రూ.లక్ష వరకు ఉంటుంది. (చదవండి: ప్రపంచ పటంలో ఉలవపాడు మామిడి..)


కొమ్మకొమ్మకో గుబురు 

ఫైకస్‌ కుటుంబానికే చెందిన మరో రకం మొక్క మల్టీహెడ్‌ బోన్సాయ్‌.. సాధారణంగా మొక్క ఒకే గుబురుగా ఎదుగుతుంది. ఈ మొక్క మాత్రం ప్రతి కొమ్మకూ ఒక గుబురుగా ఉంటుంది. అదే దీని ప్రత్యేకత. చూపరులను కట్టి పడేస్తుంది. దీని ధర కూడా దాదాపు రూ.లక్ష  వరకు ఉంటుంది. ఈ తరహా బోన్సాయ్‌  కూడా మన కడియం నర్సరీలో దొరుకుతుంది. 


ఇంపోర్టెడ్‌ ఫైకస్‌

కండలు తిరిగిన దేహం మాదిరిగానే కన్పించే ఈ మొక్కను ఇంపోర్టెడ్‌ ఫైకస్‌ అని వ్యవహరిస్తున్నారు. ఇది కూడా విదేశీ అతిధే.  ఎంతో నైపుణ్యంతో అల్లినట్లు కొమ్మలను ఒకదానికొకటి అతుక్కుని అందంగా కనువిందు చేస్తుంది. ఈ మొక్క ఫైకస్‌ కుటుంబానికి చెందినదే. పదేళ్ల వయసున్న మొక్కల నుంచి మన కడియం ప్రాంత నర్సరీల్లో లభ్యమవుతున్నాయి. వీటి ధర కూడా రూ.3 లక్షల నుంచి ప్రారంభమతుంది. వయసును బట్టి ధర పెరుగుతుంది. ఇవే కాకుండా బోన్సాయ్‌ వృక్షాలు, కజిరినా వంటి మంచు ప్రాంత మొక్కలు, బిస్మార్కియా వంటి ప్రత్యేక మొక్కలు కూడా కడియంలో కొలువుతీరాయి. 


మోరింగా.. మజాకా..

మునగ జాతికి చెందిన ‘మోరింగా’ మొక్క కూడా ఆఫ్రికా ఖండం నుంచి ఇక్కడకు వచ్చింది. ఆఫ్రికా ప్రాంతంలో ఈ మొక్క ఆకుల్లో ఔషధ గుణాలున్నాయని భావిస్తారు. వీటి పొడిని ఆహారంలో కూడా తీసుకుంటారు. ప్రస్తుతం అలంకరణ మొక్కల జాబితాలోనే ఈ మొక్కను మనవాళ్లు పరిగణిస్తున్నారు. ఇప్పుడిప్పుడే దీనికి డిమాండ్‌ పెరుగుతోంది. 


దాని ఎత్తే గమ్మత్తు

ఏదో నియమం పెట్టుకున్నట్టు ఏడాదికి ఒకే ఒక సెంటీ మీటర్‌ మాత్రమే ఎత్తు పెరుగుతుందీ మొక్క. దాని పేరు యూకా రోస్ట్రేటా. అంతే కాకుండా బంగారు వర్ణంలో మొదలు భాగం మెరిసిపోతుంది. ఆకులు మాత్రం వెండి రంగులో ఉండి ఆకట్టుకుంటాయి. ఎడారి జాతికి చెందిన ఈ మొక్క ఎటువంటి వాతావరణంలోనైనా బతికేస్తుందని నర్సరీ రైతులంటున్నారు. స్పెయిన్‌కు చెందిన ఈ రకం మొక్కలను కూడా కడియం తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ధర రూ.50 వేల నుంచి ప్రారంభమవుతుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top