
పొత్తు ధర్మం పాటించడం లేదు..
టీడీపీ ఏం చేసినా భరించడానికి
ఎవరూ సిద్ధంగా లేరని ధ్వజం
తిరువూరు: కూటమి ధర్మాన్ని విస్మరించి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని జనసేన నియోజకవర్గ కన్వినర్ మనుబోలు శ్రీనివాసరావు సామాజిక మాధ్యమాల్లో ధ్వజమెత్తారు. తిరువూరు నియోజకవర్గంలో కొందరు తనను నిత్యం బెదిరిస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కూటమి ధర్మాన్ని విస్మరించి టీడీపీ ఏమి చేసినా భరించడానికి ఎవరూ సిద్ధంగా లేరని, కూటమి గెలుపు కోసం కృషిచేసిన వారిని అవినీతిపరులంటూ ముద్ర వేస్తున్నారని ఆరోపించారు.
తనపై భౌతికదాడికి కూడా ఎమ్మెల్యే ప్రోత్సహించడం ఆశ్చర్యం కలిగిస్తోందని, కూటమిలో భాగస్వామ్యమైన జనసేనతో కనీసం సంప్రదించకుండా సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు సొంత అజెండా రూపొందించుకోవడాన్ని ఖండించారు.నియోజకవర్గానికి మంజూరైన సీసీ రోడ్లలో కూటమి భాగస్వామ్య పార్టీలకు సంబంధం లేకుండా టీడీపీ నాయకులే కాంట్రాక్టు పనులు చేసుకుంటే పొత్తు ధర్మం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు.
చెరువుల్లో మట్టిని టీడీపీ నాయకులే పోటీపడి అమ్ముకోవడం, రేషన్ మాఫియా వద్ద నెలవారీ మామూళ్ళు వసూలు, జాతీయ ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి వసూళ్ళ పర్వం, విద్యుత్ సబ్‌స్టేషన్లలో కాంట్రాక్టు కార్మికుల నియామకానికి లక్షలాది రూపాయలు వసూలు చేయడం, తిరువూరులో గతంలో అక్రమ కట్టడంగా గుర్తించినది ఇప్పుడు సక్రమంగా ఎలా మారిందనే విషయాలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మనుబోలు చెప్పారు. ఏ కొండూరు మండలం గోపాలపురంలో మట్టి అక్రమ క్వారీ నిర్వహణపై కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.