న్యాయం అడిగిన అబలపై నడిరోడ్డుపై దాడి | Janasena Leaders Attack on MLA Arava Sridhar Victim Veena | Sakshi
Sakshi News home page

న్యాయం అడిగిన అబలపై నడిరోడ్డుపై దాడి

Apr 3 2026 6:26 AM | Updated on Apr 3 2026 9:59 AM

Janasena Leaders Attack on MLA Arava Sridhar Victim Veena

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బాధితురాలిపై దాడి చేస్తున్న నాగేంద్ర

కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బాధితురాలిపై జనసేన నేతల దాష్టికం 

కులం పేరుతో దూషిస్తూ పిడిగుద్దులు 

న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించిన బాధితురాలు 

జనసేన నేత తాతంశెట్టి, అతని వర్గీయులపై పోలీసులకు ఫిర్యాదు 

చివరి వరకూ నిలబడి పోరాడతానని స్పష్టికరణ  

సాక్షి,అమరావతి/రైల్వే కోడూరు/ఓబులవారిపల్లె /విశాఖపట్నం: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బాధితురాలిపై స్థానిక జనసేన పార్టీ వర్గీయులు గురువారం పట్టణంలో నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డారు. రైల్వే కోడూరుకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర అనుచరులతో కలిసి ఈ దాష్టీకానికి తెగబడ్డారు.  అయినా చంద్రబాబు సర్కారులో చలనం లేదు. అయినా తాను భయపడేది లేదని న్యాయం కోసం పోరాడతానని బాధితురాలు చెబుతున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది.  

అసలేం జరిగిందంటే.. 
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బాధితురాలు గురువారం సాయంత్రం తన అనుచరుడితో కలసి ఇంట్లో అవసరాల కోసం రైల్వేకోడూరు గాంధీ విగ్రహం సమీపంలో ఉండగా అదే సమయంలో అరవ శ్రీధర్, తాతంశెట్టి నాగేంద్ర వాహనాలు అక్కడకి వచ్చాయి. శ్రీధర్‌ వచ్చాడని భావించిన ఆమె కారులోకి తొంగి చూసే యత్నం చేశారు. అది గమనించిన తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు ఆమె­పైనా, అనుచరుడిపైనా రోడ్డుపైనే ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. కులం పేరుతో దూషిస్తూ పిడిగుద్దులు కురిపించారు. విచక్షణా­రహితంగా రక్త­మొచ్చేలా కొట్టారు. తీవ్రగాయాలైనప్పటికీ బాధితు­రాలు రోడ్డుపై బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రి­క్తత నెలకొంది. అనంతరం ఆమె  రైల్వేకోడూరు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని తాతంశెట్టి నాగేంద్ర, జనసేన చోటా నేతలపై  ఫిర్యాదు చేశారు. 

బాబు ఏం చేస్తున్నారు? : వరుదు కళ్యాణి 
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బాధితురాలిపై జనసేన నేతల దాడిని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఖండించారు. ఓ మహిళకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. గురువారం విశాఖ పెదవాల్తేరులోని తన క్యాంప్‌ కార్యాలయంలో కళ్యాణి మీడియాతో మాట్లాడారు. మహిళా హోంమంత్రి అనితకు ఈ దాడులు కనపడవా.. అని ప్రశ్నించారు. నిందితులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

అరవపై చర్యలు తీసుకోండి
అంతకు ముందు అరవ శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని అతని బాధితురాలు గురువారం రైల్వేకోడూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ముక్కా రూపానందరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ అధికార కార్యక్రమాల్లో పాల్గొనవద్దని పవన్‌ కళ్యాణ్‌ ఆదేశించినా అరవ  పాల్గొంటున్నారని, ఇది పవన్‌ను అవమానించడమేనని పేర్కొన్నారు. దాడి అనంతరం బాధితురాలు మాట్లాడుతూ బాబుకు ఆకలేస్తుందంటే వాడికేమైనా తీసుకెళ్దామని టోల్‌గేట్‌ వద్దకు అనుచరుడితో కలిసి వెళ్లానని, తాతంశెట్టి, ఆయన అనుచరులు దాడి చేశారని వివరించారు. న్యాయం కోసం చివరి వరకు పోరాడతానని స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement