దిగ్గజ సంస్థ ఐటీసీ భారీ పెట్టుబడులు | ITC huge investments in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

దిగ్గజ సంస్థ ఐటీసీ భారీ పెట్టుబడులు

Feb 26 2024 5:50 AM | Updated on Feb 26 2024 11:56 AM

ITC huge investments in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : రూ.5.13 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కలిగి ఉన్న ప్రముఖ బహుళజాతి కంపెనీ ఐటీసీ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతోంది. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వేగంగా విస్తరిస్తోంది. ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌ నుంచి ఫుడ్‌ ప్రాసెసింగ్, స్పైసెస్‌ పార్క్, వైఎస్సార్‌ చేయూత వంటి అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటోంది.

గుంటూరు పట్టణంలో తొలి ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను ఐటీసీ ఏర్పాటుచేసింది. సుమారు రూ.140 కోట్లతో వెల్‌కమ్‌ పేరుతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తూ ఈ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను నిర్మించారు. జనవరి 12, 2022న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీసీ సీఎండీ సంజీవ్‌ పూరి మాట్లాడుతూ.. తమ వ్యాపార విస్తరణకు ఏపీ ఎంతో కీలకమని.. విశాఖ, విజయవాడతో పాటు ఆధ్యాత్మిక నగరాల్లో హోటళ్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్‌ ప్రాసెసింగ్, ఆక్వా ప్రాసెసింగ్‌ వంటి రంగాల్లో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.  

రూ.200 కోట్లతో ఐటీసీ స్పైసెస్‌ పార్క్‌
మరోవైపు.. పల్నాడు జిల్లా యడ్లపాడు సమీపంలో సుమారు 6.2 ఎకరాల్లో సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్‌ చేసి, ఎగుమతి చేసే విధంగా రూ.200 కోట్లతో గ్లోబల్‌ స్పైసెస్‌ పార్క్‌ను ఐటీసీ అభివృద్ధి చేసింది. మిర్చితో పాటు పసుపు, అల్లం, ధనియాలు, యాల­కులు తదితర సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్‌ చేసి ఎగుమతి చేస్తున్నారు. సుమారు 20,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ పార్క్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ సెప్టెంబర్, 2022లో ప్రారంభించారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,200 మందికి ఉపాధి కల్పిస్తోంది. అంతేకాక.. 5,500 మంది రైతు కుటుంబాలు ఈ పార్క్‌ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.

గతంలో ఐటీసీ గ్రూపు రాష్ట్రంలో పొగాకు వ్యాపారానికే పరిమితం కాగా, 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చొరవతో గుంటూరు కేంద్రంగా సుగంధ ద్రవ్యాల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ఐటీ స్పైసెస్‌ పేరుతో ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటుచేసి, వేగంగా విస్తరించింది. సుమారు 170 గ్రామాల్లో 10,000 మందికి పైగా రైతులతో 35,000 హెక్టార్లల్లో వివిధ సుగంధ ద్రవ్యాలను సాగుచేయిస్తోంది. ఈ పంటలను నేరుగా కొనుగోలు చేయడం ద్వారా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. ఐటీసీ గ్రూపు దేశంలో ఆశీర్వాద్‌ బ్రాండ్‌ పేరుతో వివిధ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. 

‘చేయూత’లో భాగస్వామిగా..
ఇక రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన చేయూత పథకంలో ఐటీసీ ప్రధాన భాగస్వామిగా చేరింది. ఇందులో భాగంగా.. మహిళలు చేసే వ్యాపా­రాలు, మహిళా మార్ట్‌ల పేరుతో ఏర్పాటు­చేస్తున్న సూపర్‌ మార్కెట్లకు ఐటీసీ ఉత్పత్తులను అందించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. 

రాష్ట్ర సామాజిక, ఆర్థిక కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతాం
ఐటీసీకి రాష్ట్రంతో సుదీర్ఘ అనుబంధముంది. మా నిర్ణయాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహం బాగుంది. ఇప్పటికే అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యాం. త్వరలో మరో రూ.400 కోట్లు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనున్నాం. ముఖ్యమంత్రి విజన్‌తో రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక కార్య­క్రమంలో విప్లవాత్మకమైన మార్పులు జరుగుతు­న్నాయి. ఇందులో భాగస్వా­మ్యం కావ­డంతో పాటు ఫుడ్‌ ప్రోసెసింగ్, ఆక్వారంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నాం. – గుంటూరులో ఐటీసీ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ సంస్థ సీఎండీ సంజీవ్‌ పూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement