
ఆస్పత్రుల శానిటేషన్ టెండర్లలో అక్రమాలు
పెద్దల తరఫున నరసింహారెడ్డి డీల్
సీఎం బంధువు సంస్థకు, గతంలో అక్రమాలకు పాల్పడిన సంస్థలకు పెద్దపీట
రూ.800 కోట్ల విలువైన కాంట్రాక్టుల్లో దోపిడీకే ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: దోచుకో పంచుకో తినుకో(డీపీటీ) సిద్ధాంతంతో పెదబాబు, చినబాబు, అమాత్యులు రెచ్చిపోతున్నారు. అయినవాళ్లకు, అడిగినంత కమీషన్ ఇచ్చినవాళ్లకు ఎడాపెడా కాంట్రాక్టులు కట్టబెట్టేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్ నిర్వహణ టెండర్లలోను అదే విధానం అవలంబిస్తున్నారు. కీలకనేత తరఫున వైద్యశాఖలో అక్రమార్జన వ్యవహారాలను చక్కబెడుతున్న నరసింహారెడ్డి ప్రస్తుతం శానిటేషన్ టెండర్లలోనూ రింగ్‌మాస్టర్‌గా మారినట్టు సమాచారం. కీలకనేత వైద్యశాఖ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి సెక్యూరిటీ, శానిటేషన్, మందుల సరఫరా, వైద్యపరీక్షలు.. ఇలా వివిధ సేవల నిర్వహణలో వసూళ్ల వ్యవహారాలను నరసింహారెడ్డి చూస్తున్నారు.
ప్రభుత్వాస్పత్రుల్లో జన్–ఔషధి మందుల సరఫరా, కొద్దినెలల కిందట నిర్వహించిన సెక్యూరిటీ టెండర్లలోను ఇతడిని ప్రసన్నం చేసుకున్న వారికి నిబంధనలు అతిక్రమించినా కాంట్రాక్టులు దక్కాయి. నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియల్ బిడ్ వేసిన, పొరుగు రాష్ట్రాల్లో బ్లాక్‌చేసిన సంస్థలకు సెక్యూరిటీ కాంట్రాక్టు కట్టబెట్టడానికి పెద్దమొత్తంలో నరసింహారెడ్డి ద్వారా కీలకనేతకు ముట్టాయి. బిల్లు చెల్లించిన ప్రతిసారి సదరు సంస్థలు 7 శాతం మేర కమీషన్ ముట్టజెప్పేలా అప్పట్లో డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.
దీంతో ప్రస్తుతం సదరు సంస్థలు కాంట్రాక్ట్ నిబంధనలను అతిక్రమిస్తున్నా చూసీచూడనట్టు వదిలేయాలంటూ కీలకనేత కార్యాలయం నుంచి వైద్యశాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలున్నట్టు తెలిసింది. రూ.800 కోట్ల విలువైన శానిటేషన్ టెండర్లలోను అడ్డగోలుగా కాంట్రాక్టు కట్టబెట్టేందుకు కొంత, అనంతరం బిల్లుచేసిన ప్రతిసారి కమీషన్ కింద మరికొంత ప్రభుత్వ పెద్దలకు ముట్టజెప్పేలా డీల్ కుదిరినట్టు ప్రచారం నడుస్తోంది.
రూ.30 కోట్లు దోచేసిన సంస్థకు అర్హత
శానిటేషన్ టెండర్లకు దాఖలైన బిడ్‌ల పరిశీలన అనంతరం ప్రస్తుతం కోస్తాంధ్రలో సేవలు అందిస్తున్న ఒక సంస్థ బిడ్‌ను ఆమోదించినట్టు ఏపీఎంఎస్‌ఐడీసీ ప్రకటించింది. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. కొద్దినెలల కిందట శానిటేషన్ సేవలకు టెండర్లు పిలిచి తుదిదశలో రద్దుచేశారు. అప్పట్లో సదరు సంస్థపై నిధుల దురి్వనియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు అందాయి. రూ.30 కోట్ల మేర నిధులు దండుకున్నట్టు విచారణలో తేలినట్టు సమాచారం. దీంతో అప్పట్లో ఆ సంస్థను పక్కన పెట్టేశారు. తాజా టెండర్లలో ఈ సంస్థ బిడ్‌లు ఆరు ప్యాకేజీల్లో ఆమోదించినట్టు అధికారులు ప్రకటించడం గమనార్హం.
కీలకనేత ఎలా చెబితే అలా చేస్తామంటూ సదరు సంస్థ యాజమాన్యం హామీ ఇవ్వడంతో ప్రజాధనాన్ని అక్రమంగా దోచేసిన ఆరోపణలున్నా.. అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శలొస్తున్నాయి. మరో సంస్థ విషయంలో నరసింహారెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నట్టు వెల్లడైంది. ఈ సంస్థకు సెక్యూరిటీ టెండర్లలో నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసినా కాంట్రాక్టు ఇచ్చారు. ఇప్పుడు ఈ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా బిడ్ వేసినా ఆమోదించారు. ఆ సంస్థకు పోటీవస్తున్నాయని కొన్ని పెద్దసంస్థలను సైతం తప్పించినట్టు ఫిర్యాదులున్నాయి. పెద్దలను ప్రసన్నం చేసుకున్న సంస్థలపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి.
నిబంధనలు అతిక్రమించినా..
టెండర్ నిబంధనల ప్రకారం అర్హత ఉండి, పొరుగు రాష్ట్రాల్లో విజయవంతంగా పనులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు లేని సంస్థల బిడ్‌లను తిరస్కరిస్తున్నట్లు విమర్శలున్నాయి. అదే అడ్డగోలుగా నిబంధనలు అతిక్రమించినప్పటికీ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులే అర్హతగా పలుసంస్థల బిడ్‌లు ఆమోదించేశారని అధికారికవర్గాల్లో చర్చ నడుస్తోంది. సీఎం బంధువు సంస్థ కోసమే రెండోసారి ప్రభుత్వం టెండర్లను పిలిచిన విషయం తెలిసిందే. ఈ దఫా సదరు సంస్థకు ఎలాగైనా కాంట్రాక్టు కట్టబెట్టాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.
లేదంటే తమకు ఊస్టింగ్ తప్పదనే ఆందోళనలో ఉన్నారు. హౌస్‌కీపింగ్, శానిటేషన్ విభాగంలో పనిచేసిన అనుభవం, ఆరి్థక టర్నోవర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని.. అయితే సీఎం బంధువు సంస్థ సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్, ఇతర సేవల అనుభవం, టర్నోవర్‌ను క్లెయిమ్ చేసిందని తెలిసింది. హౌస్‌కీపింగ్, శానిటేషన్ టర్నోవర్ ఆధారంగా పనులు దక్కే పరిస్థితి లేదని, అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం.