రియల్‌ దందా..

Irregularities In Indiramma Housing Places - Sakshi

అన్యాక్రాంతమవుతున్న పేదల జాగాలు

చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు

రూ.20 కోట్లకు పైగా లావాదేవీలు

దర్జాగా ప్రభుత్వ స్థలాల కబ్జా

చోద్యం చూస్తున్న అధికారులు  

మండపేట పట్టణానికి చెందిన మహిళకు పదేళ్ల క్రితం రాజీవ్‌ గృహకల్పలో ప్లాటు, గొల్లపుంత కాలనీలో ఇందిరమ్మ స్థలం మంజూరయ్యాయి. ఏదో ఒక పథకానికి మాత్రమే అర్హులన్న నిబంధనతో ఆమె స్థలాన్ని వదులుకుంది. ఖాళీగా ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని దళారులు అన్యాక్రాంతం చేసేశారు. తాజాగా కొనుగోలు చేసుకున్న వారు ఇంటి నిర్మాణానికి సన్నద్ధమవుతుండగా స్థానికుల ఫిర్యాదుతో హౌసింగ్‌ అధికారులు అడ్డుకుని నోటీస్‌ బోర్డు ఏర్పాటు చేశారు. గొల్లపుంత కాలనీలోని ఇందిరమ్మ ఇళ్ల స్థలాల్లో జరుగుతున్న అక్రమాల్లో వెలుగు చూసిన ఉదంతమిది. బయటకు రాకుండా అన్యాక్రాంతమైన ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు, ఇళ్లు 400 పైనే ఉంటాయని అంచనా.

మండపేట: పట్టణంలోని ఇందిరమ్మ స్థలాల్లో రియల్‌ వ్యాపారం చాపకింద నీరులా సాగిపోతోంది. ఖాళీ స్థలం నుంచి నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లను రూ.మూడు లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ మేస్తున్నారు. వ్యాపారులు, దళారులతో పాటు ఉద్యోగులు సైతం బినామీ పేర్లపై ఇక్కడ స్థలాలు కొనుగోళ్లు చేసి నిర్మాణాలు చేస్తున్నట్టు సమాచారం. పేదల స్థలాల్లో సాగుతున్న రియల్‌ వ్యాపారం ద్వారా దాదాపు రూ.20 కోట్ల మేర చేతులు మారినట్టు అంచనా. 

వైఎస్‌ అకాల మరణం, పాలకుల నిర్లక్ష్యంతో.. 
దివంగత వైఎస్సార్‌ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఇందిరమ్మ పథకం మండపేటలో వేలాది మంది పేదల సొంతింటి కలను సాకారం చేసింది. వైఎస్‌ ప్రోత్సాహంతో అప్పటి ఎమ్మెల్యే డాక్టర్‌ బిక్కిన కృష్ణార్జున చౌదరి పట్టణంలోని గొల్లపుంతలో రెండు విడతలుగా 122.72 ఎకరాలను సేకరించారు. ఇది రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద స్థలసేకరణ. తొలి విడతలోని 55.77 ఎకరాల లేఅవుట్‌ను సెంటున్నర చొప్పున రెవెన్యూ అధికారులు 2,125 ప్లాట్లుగా విడదీశారు. 1,890 మంది లబి్ధదారులకు పంపిణీ చేయగా మిగిలిన 235 ప్లాట్లను ఖాళీగా ఉంచారు. 2010 నవంబరు నుంచి నిర్మాణ పనులు మొదలయ్యాయి. వైఎస్‌ అకాల మరణం, పాలకుల నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. ఇప్పటి వరకూ దాదాపు 1500 ఇళ్లు మాత్రమే పూర్తి కాగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.  

అమ్మకానికి స్థలాలు, ఇళ్లు..   
లబ్ధిదారుల ఎంపికలో రెవెన్యూ సిబ్బంది అవకతవకలకు పాల్పడడంతో అక్రమాలకు తెరలేచింది. పలువురు సొంతిళ్లు ఉన్న వారికి, రాజీవ్‌ గృహకల్పలో ప్లాట్లు మంజూరైన వారికి  స్థలాలు మంజూరు చేశారు. ఇళ్లు ఉన్న వారు స్థలాల అమ్మకాలు మొదలుపెట్టడంతో పేదల స్థలాల్లో రియల్‌ వ్యాపారం మొదలైంది. నిబంధనలకు విరుద్దంగా దళారులు స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు చేయిస్తున్నారు. లబి్ధదారుల స్థలాలతో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అమ్మకాలు చేసేస్తున్నారు. పేదలకు పంపిణీ చేయగా ఖాళీగా ఉంచిన 235 ప్లాట్లు ఎక్కడ ఉన్నాయనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. స్థలం రూ.మూడు లక్షల నుంచి ఉండగా, నిర్మాణంలో ఉన్నవి, పూర్తి చేసిన ఇంటిని రూ.ఐదు లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్మకాలు చేస్తున్నట్టు సమాచారం. అమ్మకాలు, కొనుగోళ్ల ద్వారా దాదాపు రూ.20 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు అంచనా. కొందరు ఇళ్లను నిర్మించి అద్దెకు ఇస్తుండడం గమనార్హం. పట్టణంతో పోలిస్తే కాలనీలో అద్దె తక్కువగా ఉండడంతో ఇక్కడకు అద్దెకు వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. కాలనీలో అద్దెకు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు 300 కు పైగా ఉంటాయని అంచనా. బయట అద్దెలు చెల్లించలేక, అర్హత ఉన్నా స్థలం రాని పలువురు పేదవర్గాల వారు స్థలాలు కొనుగోలు చేసుకుని ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. అటువంటి వారికి అన్యాయం జరుగకుండా చూడడంతోపాటు అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి పేదలకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.   

దర్జాగా కబ్జాలు  
కాలనీలోని విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నా మున్సిపల్, రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మున్సిపాలీ్టకి ఆదాయం సమకూర్చే దిశగా పట్టణంలో మాదిరి కాలనీలోను మెయిన్‌ రోడ్డు వెంబడి షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి అప్పట్లో అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం గొడ్డు కాలువ వంతెన వద్ద నుంచి అందరికీ ఇళ్లు, ప్లాట్ల వరకూ రోడ్డు నుంచి దాదాపు 20 మీటర్ల మేర స్థలం వదిలి మిగిలిన దానిలో ప్లాట్లను విభజించారు. కాగా విలువైన ఈ స్థలం ఆక్రమణలకు గురవుతోంది. కాలనీలో ఎక్కడికక్కడ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరమ్మ స్థలాల్లో జరుగుతున్న రియల్‌ వ్యాపారాన్ని అడ్డుకోవడంతో పాటు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మండపేట తహసీల్దార్‌ రాజేశ్వరరావును వివరణ కోరగా తాను ఇటీవల బదిలీపై వచ్చానని, అమ్మకాలకు సంబంధించి ఫిర్యాదులేమీ రాలేని అన్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటానని తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top