
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తాటిపర్తిపాళెంలో స్థానిక టీడీపీ నేత తన బంధువుల పొలం వద్దకు వేయించిన సిమెంట్ రోడ్డు
తీవ్రంగా అభ్యంతరం తెలిపిన కేంద్రం
కూటమి పార్టీల నేతలకు రూ.3,000 కోట్లు పందేరం
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలులో తీవ్ర అక్రమాలు
క్షేత్ర స్థాయిలో కేంద్ర బృందాల పరిశీలన.. నిగ్గు తేలిన నిజం
అంశాల వారీగా వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ
కాంట్రాక్టర్లకు తావు లేని పథకంలో వారి ద్వారానే పనులు
రెండు మూడు అంతస్తుల భవనాలున్న చోట రోడ్లు వేసిన వైనం
రోడ్డు వసతి లేని ప్రాంతాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం
రెండు మూడు ముక్కలుగా వంద మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణం
పంచాయతీల ప్రమేయం, ఎవరి పర్యవేక్షణ లేకుండా పనులు
అడుగడుగునా ఉల్లంఘనలే అంటూ తలంటిన కేంద్రం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా కూటమి పార్టీల నేతలకు దోచి పెడుతోందా? నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులిస్తోందా? కూలీలతో చేయించాల్సిన పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తోందా? పంచాయతీల ప్రమేయం లేకుండానే అంతా తానై కానిచ్చేస్తోందా? రోడ్డు వసతి లేని చోట కాకుండా కొందరికే మేలు కలిగేలా పనులు చేయిస్తోందా..? ఈ ప్రశ్నలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం ‘అవును’ అని సమాధానం ఇస్తోంది.
రాష్ట్రంలో ఇష్టానుసారంగా సాగుతున్న ఉపాధి హామీ పథకాన్ని తీవ్రంగా తప్పు పడుతోంది. ఉపాధి ముసుగులో భారీ అవినీతికి పాల్పడటాన్ని ఎత్తి చూపుతోంది. రాష్ట్రంలో ఏడాదిగా సిమెంట్ రోడ్డు నిర్మాణాల పేరుతో ఉపాధి హామీ పథకంలో భారీగా నిబంధనల ఉల్లంఘనలతో పాటు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. అసలు కాంట్రాక్టరు వ్యవస్థకు తావులేని ఈ పథకంలో కాంట్రాక్టర్ల ద్వారా పనులు జరుగుతున్నాయని తప్పు పట్టింది.
ఈ క్రమంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన పనులపై తనిఖీలు చేసేందుకు జూన్ 17–21వ తేదీల మధ్య కేంద్ర పరిశీలక బృందాలను తిరుపతి, కాకినాడ, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలకు పంపి క్షేత్ర స్థాయిలో అవకతవకలను నిగ్గు తేల్చింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో పాటు కేంద్రం గుర్తించిన ఎన్జీవోలకు సంబంధించి ఇద్దరేసి సభ్యులతో ఆయా బృందాలు ఆయా జిల్లాల్లో పర్యటించాయి. ఒక్కో జిల్లాలో రెండు మండలాల్లోని నాలుగు గ్రామాల్లో పనులను ఆ బృందాలు పరిశీలించాయి. ప్రతిచోటా అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాయి. అక్రమాలను పేర్కొంటూ వాటికి తగిన వివరణలు ఇవ్వాలని కోరుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది.
దిక్కుతోచక మల్లగుల్లాలు
‘ఉపాధి’లో విచ్చలవిడిగా అవకతవకలు చోటుచేసుకున్నాయన్నది ఊరూరా తెలిసిన వాస్తవం. ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించుకుని వివరణ కోరడంతో ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిబంధనల ఉల్లంఘనపై కేంద్రానికి వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వీటికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి కూడా నివేదికలు కోరినట్టు సమాచారం. నెపాన్ని కొందరు అధికారులపైకి నెట్టి తమకు క్లీన్ చిట్ ఇచ్చుకునేలా ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.
రూ.3 వేల కోట్లు హాంఫట్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే గ్రామీణ ప్రాంతాల్లో ‘ఉపాధి’ కింద 26 వేలకు పైగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, తదితర పనులకు అనుమతులిచ్చింది. ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టే పనులలో కాంట్రాక్టర్ల విధానమే ఉండదు. గ్రామ పంచాయతీలు లేదంటే ప్రభుత్వం నిర్ధారించిన శాఖ ఆధ్వర్యంలోనే ఆయా పనులు చేపట్టాల్సి ఉంటుంది. కానీ, గ్రామ పంచాయతీలకు సంబంధం లేకుండా గ్రామాల్లో టీడీపీ నేతలే అనధికారికంగా ఆయా పనులను దక్కించుకున్నారు. ఆయా గ్రామాల్లో టీడీపీ నేతలు సూచించిన పేర్లను వెండర్లుగా నమోదు చేసి, వాళ్లు కొనుగోలు చేసినట్టు పేర్కొన్న ధరల మేరకు బిల్లుల చెల్లింపు జరిగింది.
ఇలా 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,900 కోట్లు, ఈ ఆర్థిక ఏడాది ఇప్పటి వరకు మరో రూ.1,080 కోట్లు.. మొత్తంగా దాదాపు మూడు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించేశారు. మెటీరియల్ కేటగిరిగా పేర్కొనే పనులకు బిల్లుల చెల్లింపులో తీవ్ర స్థాయిలో నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఆయా పనులకు అవసరమయ్యే సిమెంట్ తదితర రకరకాల మెటిరీయల్స్‌ను టెండరు విధానంలో ఎవరు తక్కువ ధరకు సరఫరా చేస్తారో వారి జాబితాను మండల స్థాయిలో నిర్ధారించాల్సి ఉంటుంది.
ఆపై ఆయా పంచాయతీల్లో పనుల సంఖ్య ఆధారంగా ఏ రకమైన మెటీరియల్ ఎంత అవసరముంటుందో.. ఎవరెవరి వద్ద దొరుకుతుందో ఎంపీడీవో నిర్ధారించాలి. ఆయా వెండర్ల నుంచే ఆ మెటీరియల్‌ను నిర్ధారించిన ధరకే తీసుకోవాలి. ఆ మేరకు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే.. కేంద్రమే నేరుగా ఆ వెండరుకు బిల్లు చెల్లిస్తుంది. ఇలాంటి ప్రక్రియ ఏదీ లేకుండా నేరుగా టీడీపీ నేతలు సూచించిన వారి పేర్లను వెండర్లుగా నమోదు చేసి నిధులు కాజేశారు. ఈ విధానాన్ని కేంద్రం తీవ్రంగా తప్పు పట్టింది.
కేంద్రం తప్పుపట్టింది వీటినే..
⇒ తగిన రోడ్డు వసతి లేని గ్రామీణ ప్రాంతాలకు కొత్తగా సిమెంట్ రోడ్డు వేసేందుకు ఉపాధి హామీ పథకం నిబంధనలు అనుమతిస్తుండగా, వాటిని వదిలేసి.. రాష్ట్రంలో పలుచోట్ల సెమీ–అర్బన్ ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించారు.
⇒ రెండు మూడు అంతస్తుల ఇళ్లు ఉన్న ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేశారు.
⇒ అధికారికంగా ఎంపిక చేసిన కాంట్రాక్టర్లు కాకుండా స్థానిక కాంట్రాక్టర్లతో పనులు చేయించారు.
⇒ ఆయా పనులకు అవసరమైన వస్తువులు, సామగ్రి (సిమెంట్, కంకర.. తదితరాలు)ని గ్రామ పంచాయతీ లేదా మండల, జిల్లా పరిషత్‌ల వంటి స్థానిక ప్రభుత్వాలు/ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేసినవి కాకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారం కొనుగోలు చేశారు.
⇒ ఆయా గ్రామ పంచాయతీల పర్యవేక్షణలో పనులు సాగలేదు.
⇒ వంద, రెండు వందల మీటర్ల పొడవున్న రోడ్డు పనులను కూడా రెండు మూడు భాగాలుగా విభజించి పనులు చేపట్టారు.
⇒ ప్రజాప్రయోజనాన్ని, మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించి ఎవరికో ఉపయోగ పడేలా పనులు చేపట్టారు.
⇒ ఏటా ఒకే ప్రాంతంలో.. చేసిన చోటే మళ్లీ మళ్లీ మట్టి పనులు చేస్తున్నారు. అలా ఎందుకు చేయాల్సి వస్తుందో సమగ్ర పరిశీలన లేనేలేదు.
⇒ బిల్లుల చెల్లింపు ఇష్టారాజ్యంగా సాగింది. ఎక్కడా నిబంధనలు పాటించలేదు.