
యూపీ కేడర్ సత్యనారాయణ కోసం ఏపీ సర్కారు పట్టు
డిప్యుటేషన్‌పై పంపాలని కేంద్రంపై తీవ్ర ఒత్తిడి
నిబంధనలకు విరుద్ధమన్నా కూటమి పెద్దలు ససేమిరా
రెడ్‌బుక్ రాజ్యాంగం కక్ష సాధింపునకు సమర్థుడని నమ్మకం
టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు, స్పీకర్‌కు బంధువు
సాక్షి, అమరావతి : ఓ ఐపీఎస్ అధికారిని డిప్యుటేషన్‌పై యూపీ నుంచి ఏపీకి పంపాల్సిందేనని చంద్రబాబు ప్రభుత్వం పట్టుపడుతోంది. నిబంధనలకు విరుద్ధమని కేంద్ర హోం శాఖ స్పష్టం చేస్తున్నా, తమకు ఆయన కావాల్సిందేనని తేల్చి చెబుతోంది. ప్రస్తుతం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అంతగా పట్టుపడుతోందంటే..
అనకాపల్లి జిల్లాకు చెందిన కె.సత్యనారాయణ 1998 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో రహదారి భద్రత విభాగం అదనపు డీజీగా ఉన్నారు. ఆయన టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబానికి సమీప బంధువు కూడా. అందుకే 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన్ను ప్రత్యేకంగా డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చారు. అప్పట్లో ఆయన సీఐడీ విభాగంలో ఐజీగా విధులు నిర్వహించారు. డిప్యుటేషన్ కాలం ముగిసిన తర్వాత తిరిగి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిపోయారు.
చెప్పింది చెప్పినట్లు చేస్తారని..
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రభుత్వ పెద్దలు సత్యనారాయణపై దృష్టి సారించారు. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు, కక్షసాధింపు చర్యలతో విరుచుకు పడేందుకు అస్మదీయుడైన అధికారి కావాలని భావించారు. దాంతో ప్రభుత్వ ముఖ్య నేత దృష్టి సత్యనారాయణపై పడింది. అందుకే ఆయన్ను రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై పంపాలని కేంద్ర హోం శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే..
..ఐజీ లేదా అంతకంటే ఉన్నత స్థాయి పోలీస్ అధికారులను డిప్యుటేషన్‌పై ఇతర రాష్ట్రాలకు పంపేందుకు నిబంధనలు సమ్మతించవు. అదే విషయాన్ని ఆ మధ్య కేంద్ర హోం శాఖ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సత్యనారాయణను డిప్యుటేషన్‌పై ఏపీకి పంపేందుకు నిరాకరించింది. దీనిపై కొన్ని నెలలు మౌనంగా ఉన్న ప్రభుత్వ పెద్దలు ఇటీవల మరోసారి కేంద్రంపై ఒత్తిడి తెస్తోందని సమాచారం. ఈ ప్రయత్నాలన్నీ రెడ్‌బుక్ రాజ్యాంగం వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసుల బాధ్యతలను సత్యనారాయణకు అప్పగించేందుకేనని పోలీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.