అనుమతులు గోరంత.. దోచేది కొండంత ! 

Illegal Excavation Of Soil In Guntur District - Sakshi

 అక్రమ తవ్వకాలతో కోట్ల రూపాయల దోపిడీ

చర్యలు తీసుకోవటంలో అధికారుల జాప్యం

పిడుగురాళ్ల రూరల్‌: ప్రభుత్వం పేదల కోసం నిర్మించే ఇళ్ల స్థలాల చదును కోసం మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకొని ప్రైవేటు పనులకు అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతూ అక్రమార్కులు కోట్ల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. పదుల సంఖ్యలో టిప్పర్లను పెట్టి భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ అక్రమార్జనకు తెరలేçపుతున్నారు. అధికారులు సైతం జరుగుతున్న అక్రమంలో తమకు ఎటువంటి సంబంధం లేదంటూ మేము ఉన్న సమయంలో ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, ఆ తవ్వకాలకు మాకు ఎటువంటి సంబంధం లేదని చర్యలు తీసుకోవటంలో జాప్యం వహిస్తూ నిర్లక్ష్య సమాధానాలు చెబుతున్నారు. అనుమతి తీసుకున్న సదరు కాంట్రాక్టర్‌ పిడుగురాళ్ల మండల పరిధిలోని కామేపల్లి గ్రామ బైపాస్‌ వద్ద ఉన్న టీడీపీ నేతకు  చెందిన స్థలంలోకి, స్థానిక సిమెంట్‌ ఫ్యాక్టరీకి పెద్ద మొత్తంలో మట్టి తరలిస్తూ ప్రభుత్వం ఆదాయానికి చిల్లు పెడుతున్నారు. 

ఇష్టారాజ్యంగా తవ్వకాలు 
పిడుగురాళ్ల, మాచవరం మండలం సరిహద్దుల్లో ఉన్న గాంధీనగర్‌ గ్రామం పొల్లాల్లో సర్వే నంబర్‌ 976/2 పట్టా భూమి నందు పిన్నెల్లి గ్రామంలోని ఇళ్ల స్థలాలు చదును చేయటానికి అనుమతులు తీసుకున్నారు. గ్రావెల్‌ రోడ్డుకు మట్టి తవ్వకాలు నిర్వహించుకోనేందుకు కాంట్రాక్టర్‌ 1,660 క్యూబిక్‌ మీటర్లకు ఆగస్టు నెల 19న అనుమతులు పొందాడు. భారీ ప్రొక్లెయిన్లు, పదుల సంఖ్యలో లారీలతో అర్ధరాత్రి సమయంలో అదే అనుమతిని అడ్డం పెట్టుకొని పిడుగురాళ్ల మండలం కామేపల్లి బైపాస్‌ పక్కనే ఉన్న ఓ టీడీపీ నేత పెట్రోల్‌ బంకు నిర్మాణానికి, తుమ్మలచెరువు గ్రామ శివారులో ఉన్న సిమెంట్‌ ఫ్యాక్టరీకి వేల టన్నుల్లో మట్టిని సరఫరా చేస్తున్నారు. 1,660 క్యూబిక్‌ మీటర్లకు 93 టిప్పర్లు మాత్రమే మట్టిని సరఫరా చేసుకోవాలి. అంటే 18 క్యూబిక్‌ మీటరుŠల్‌ ఒక టిప్పర్‌కు సమానం. రోజుకు సుమారు 120 టిప్పర్లతో మట్టిని తవ్వకాలు  చేపడుతున్నారు. ఒక్కో టిప్పర్‌కు వచ్చి రూ.6 వేలు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్క రోజుకే సుమారు రూ.9 లక్షలకుపైగా ఆదాయం గడిస్తున్నారు. 

ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఇటువైపు కన్నెతి కూడా చూడటం లేదు. అనుమతులు పొందిన సర్వే నంబర్‌ ఒకటి, తవ్వకాలు జరిపేది ఒక చోట అని వదంతులు వినిపిస్తున్నాయి. స్థానిక వీఆర్వో అడిగినా తనకు ఎలాంటి సమాచారం తెలియదని, ఉన్నతాధికారులను సంప్రదించాలని మాట దాటవేశారు. దీనిపై మాచవరం మండలం తహసీల్దార్‌ సి.చెంచులక్ష్మిని సాక్షి ఫోన్‌లో వివరణ కోరగా తనకు తెలియదని తాను కొత్తగా వచ్చానని, గత తహసీల్దార్‌ అనుమతులు ఇచ్చారని, దీనిపై తనకు తెలియదని సమాధానం చెప్పి ఫోన్‌ కట్‌ చేశారు.

చర్యలు తీసుకుంటాం 
వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పిన్నెల్లి గ్రామ శివార్లలో 1,660 క్యూబిక్‌  మీటర్లకు గ్రావెల్‌ రోడ్డు నిర్మాణం కోసం అనుమతి తీసుకున్నారు. అయితే స్థానికంగా ఉన్న తహసీల్దార్‌ ఎంత వరకు తవ్వకాలు జరిపారో, ఎక్కడికి తరలిస్తున్నారో అని సమాచారం తెలుసుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి. అధికంగా తవ్వకాలు జరిపితే మేం చర్యలు తీసుకుంటాం. 
 – వెంకట్రావు, మైనింగ్‌ ఏడీ, నడికుడి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top