బలైపోతున్న భర్తలు.. కలవరపెడుతున్న ఘటనలు | Husbands Deaths Increasing By Wives | Sakshi
Sakshi News home page

బలైపోతున్న భర్తలు.. కలవరపెడుతున్న ఘటనలు

May 27 2026 12:20 AM | Updated on May 27 2026 4:29 AM

Husbands Deaths Increasing By Wives

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత మూడు రోజుల్లో వరుసగా భర్తల హత్యలు చోటుచేసుకోవడం కలవరపెడుతోంది. ఈ హత్యలకు ప్రాంతం, కులం, మతం అనే తేడా లేదు. ఇలా వివాహేతర సంబంధాల కారణంగా భార్యల చేతిలో భర్తలు బలైపోతున్న ఘటనలు వరుస వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో మనూర్ మండలానికి చెందిన ఓ మహిళ తన ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీనికి అడ్డుగా ఉన్న భర్త ముత్యంరెడ్డిని ప్రియుడితో కలిసి హత్య చేసింది. అనంతరం తన భర్తను జేసీబీతో గొయ్యి తవ్వించి మరీ పాతిపెట్టారు. అలానే మంచిర్యాల జిల్లాలో హాజీపూర్ మండలం ముల్కల గ్రామానికి చెందిన కుమార్‌ను అతని భార్య భారతి, తన ప్రియుడు సురేందర్‌తో కలిసి హతమార్చింది. ఈ స్కెచ్‌కు సురేందర్ స్నేహితుడు మల్లేశ్ కూడా తోడయ్యాడు. అయితే చేసే హత్యలో కూడా లాభం ఉండాలనుకుంది భారతి. దానికోసం హత్యకు ముందే భర్త పేరుతో రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ కట్టించింది. ఆ తర్వాత హత్య జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. 

ఇలాంటిదే మరో ఘటన ఈమధ్య విశాఖ జిల్లా భీమిలిలో జరిగింది. ఓ మహిళ తన భర్తను గొడవల మధ్య చున్నీతో గొంతు బిగించి హతమార్చింది. ఇలా ఈ మూడు ఘటనలు కేవలం మూడు రోజుల్లోనే చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలోనూ హనీమూన్ మర్డర్ వంటి అనేక కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వీటిలో చాలా సందర్భాల్లో భర్త తన తప్పు లేకపోయినా బలైపోతున్నాడు. ఈ సంఘటనలు కుటుంబ బంధాలు, భార్య-భర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఉండాల్సిన నమ్మకం, వారి దాంపత్యంలోని విలువలు ఎంతగా దెబ్బతింటున్నాయో చూపిస్తున్నాయి. వివాహం అనేది జీవిత భాగస్వామ్యానికి ప్రతీక. కానీ కొంతమంది మహిళలు దాన్ని నేరానికి వేదికగా మార్చడం ఆందోళనకరంగా మారింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇటు సమాజంతో పాటు చట్టవ్యవస్థ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement