
విచ్చలవిడిగా ఆక్వా చెరువులపై నాటు తుపాకుల వినియోగం
పట్టించుకోని అధికారులు
ఏలూరు: నాటుతుపాకులతో వేటగాళ్లు హల్‌చల్ చేస్తున్నారు. ప్రతిరోజు ఆక్వా చెరువులపై పిట్టలు కొట్టేందుకు తుపాకులను విచ్చలవిడిగా వాడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, అర్తమూరు తదితర గ్రామాలతోపాటు ఆకివీడు, కాళ్ళ, పాలకోడేరు, భీమవరం రూరల్ మండలాలు, ఏలూరు జిల్లాలోని గణపవరం, నిడమర్రు మండలాల్లోను ఇదే విధంగా నాటు తుపాకులు దర్శనమిస్తున్నాయి. పట్టపగలే వాహనాలపై తుపాకులను చేతపట్టుకుని తిరుగుతున్నా పోలీసులు గానీ, ఇతర అధికారులు గానీ ఎవరూ పట్టించుకోడం లేదంటూ సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. తుపాకీ గురితప్పితే తమ పరిస్థితి ఏంటని ఆయా మండలాల్లోని ప్రజలు, వ్యవసాయ కూలీలు ఆందోళన చెందుతున్నారు.
ఇది నేరం కాదా?
నాటు తుపాకీలతో కేవలం పిట్టలనే కాలుస్తున్నారా.. లేక మరేదైనా జరుగుతుందా.. తుపాకుల సరఫరా ఎక్కడ నుంచి జరుగుతుంది అంటూ పలువురు వీటిపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ నాటు తుపాకులతో ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వేటగాళ్లు ఇంత బహిరంగంగా ఎలా వస్తున్నారు? వారికి రూ.30 వేలు నుంచి రూ.40 వేలు జీతాలు ఎలా ఇస్తున్నారు?ఇదేమీ నేరం కాదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
గతంలో నాటుతుపాకీతో దారుణాలు
గతంలో నాటుతుపాకీతో జరిగిన దారుణాలు గుర్తు తెచ్చుకుని ప్రజలు భయపడుతున్నారు. గతంలో సరిగ్గా పంచాయతీ ఎన్నికల సమయంలో మండలంలోని ఎన్నార్పీ అగ్రహారంలో నాటుతుపాకీతో ఓ హత్య జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పుడు కూడా ఆక్వా చెరువులపై పిట్టలు కొట్టేందుకు తెచ్చిన నాటుతుపాకీగా పోలీసులు గుర్తించినట్లు పలువురు చెబుతున్నారు. అలాగే చెరువుకువాడ గ్రామంలో నాటు తుపాకీతో ఓ వ్యక్తి కోతి(వానరం)ని కాల్చడం కూడా సంచలనానికి దారి తీసింది. ఇంతటి భయంకరమైన ఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టంచుకోకపోవడంపై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వెంటనే వీటిపై చర్యలు తీసుకుని ప్రజల ప్రశాంత జీవనానికి అండగా నిలవాలని వారు కోరుతున్నారు.